breaking news
bhamidipati saipraneet
-
Thailand Open: పోరాడి ఓడిన సాయిప్రణీత్
థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారత్ నుంచి బరిలో మిగిలిన ఏకైక ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లో వెనుదిరిగాడు. బ్యాంకాక్‌లో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ 49వ ర్యాంకర్ సాయిప్రణీత్ 17–21, 23–21, 18–21తో ప్రపంచ 23వ ర్యాంకర్, ఆరో సీడ్ లీ షి ఫెంగ్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో సాయిప్రణీత్ స్కోరు 12–12 వద్ద ఉన్నపుడు తడబడి వరుసగా ఆరు పాయింట్లు సమర్పించుకోవడం టర్నింగ్ పాయింట్ అయింది. సాయిప్రణీత్‌కు 1,260 డాలర్ల (రూ. 1 లక్ష 3 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 3,850 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సింధు, సాయి చరిత్ర
కల కాదు నిజమే. నమ్మశక్యంకానీ రీతిలో... కళ్లు చెదిరే ప్రదర్శనతో... ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఒకేరోజు ఇద్దరు తెలుగు తేజాలు పూసర్ల వెంకట (పీవీ) సింధు, భమిడిపాటి సాయిప్రణీత్ గర్జించారు. కొన్నేళ్లుగా అంతర్జాతీయ టోర్నీల్లో తనకు కొరకరాని కొయ్యగా మారిన ప్రపంచ రెండో ర్యాంకర్ తై జు యింగ్‌ను సింధు మట్టికరిపించగా... ప్రపంచ నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీని బోల్తా కొట్టించిన సాయిప్రణీత్ అందరి అంచనాలను తారుమారు చేసి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. సెమీఫైనల్ చేరడంతో సింధు, సాయిప్రణీత్‌లకు కనీసం కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. దాంతో 42 ఏళ్ల ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో తొలిసారి భారత్ ఖాతాలో మహిళల సింగిల్స్, పురుషుల సింగిల్స్‌లో పతకాలు చేరనున్నాయి. 1983 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజ క్రీడాకారుడు ప్రకాశ్ పదుకొనే కాంస్యం సాధించాక... పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు మళ్లీ పతకం అందించనున్న ప్లేయర్‌గా సాయిప్రణీత్ చరిత్ర లిఖించాడు. బాసెల్ (స్విట్జర్లాండ్): కొడితే కుంభస్థలం కొట్టాలి. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, సాయిప్రణీత్ నిజం చేసి చూపించారు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారులపై అద్వితీయ విజయాలు సాధించారు. ఈ ఏడాది అంతర్జాతీయ టోర్నీల్లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుల నిరాశాజనక ప్రదర్శనను అందరూ మర్చిపోయేలా చేశారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఐదో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి పీవీ సింధు 71 నిమిషాల్లో 12–21, 23–21, 21–19తో రెండో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై నెగ్గగా... పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 19వ ర్యాంకర్, తెలంగాణ ప్లేయర్ సాయిప్రణీత్ 51 నిమిషాల్లో 24–22, 21–14తో నాలుగో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)ను మట్టికరిపించాడు. వెనుకంజలో ఉన్నా... ఈ మ్యాచ్‌కంటే ముందు తై జు యింగ్‌తో ఆడిన 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన సింధు... తొలి గేమ్ తర్వాత ఈసారి కూడా తన ఖాతాలో మరో ఓటమి వేసుకుంటుందనిపించింది. తొలి గేమ్‌ను సులువుగా సమర్పించుకున్న సింధు... రెండో గేమ్‌లో 5–8తో వెనుకంజ లో ఉంది. ఈ కీలక సమయంలో సంయమనం కోల్పోకుండా ఆడిన సింధు వరుసగా ఐదు పా యింట్లు గెలిచి 10–8తో ఆధిక్యంలోకొచ్చింది. అయితే తై జు యింగ్ కూడా పట్టుదలతో ఆడటంతో ఐదుసార్లు స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 21–21 వద్ద సింధు చక్కటి రిటర్న్ షాట్, ఆ తర్వాత క్రాస్‌కోర్టు షాట్లతో వరుసగా రెండు పాయింట్లు గెలిచి గేమ్‌ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో గేమ్ ఆరంభంలోనూ సింధు తడబడింది. 4–8తో వెనుకబడింది. అయితే ఈసారీ సింధు అద్భుతంగా పుంజుకుంది. స్కోరును 14–14 వద్ద సమం చేశాక ఇద్దరూ ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. స్కోరు 19–19 వద్ద ఉన్నపుడు సింధు స్మాష్ షాట్‌తో ఒక పాయింట్ సాధించగా... ఆ తర్వాత తై జు యింగ్ కొట్టిన రిటర్న్ షాట్ బయటకు వెళ్లడంతో సింధు విజయం ఖాయమైంది. సూపర్ సాయి... ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో ర్యాంకర్ జిన్‌టింగ్ (ఇండోనేసియా)ను ఓడించిన సాయిప్రణీత్ క్వార్టర్ ఫైనల్లోనూ అదే జోరు కనబరిచాడు. సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించాడు. కీలకదశలో స్మాష్ షాట్లతో చెలరేగాడు. తొలి గేమ్ నెగ్గిన తర్వాత రెండో గేమ్‌లో సాయిప్రణీత్ మరింత దూకుడు పెంచాడు. జొనాథన్ క్రిస్టీకి తేరుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌ను ముగించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో అత్యధికంగా ఐదు పతకాలు నెగ్గిన రికార్డు చైనా ప్లేయర్ జాంగ్ నింగ్ (స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పేరిట ఉంది. తాజా ప్రదర్శనతో సింధు ఈ రికార్డును సమం చేసింది. 1: ప్రపంచ సీనియర్, జూనియర్ చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్ సాయిప్రణీత్. 2010 ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో సాయిప్రణీత్ కాంస్యం గెలిచాడు. 2: ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు రావడం ఇది రెండోసారి. 2017లో సింధు, సైనా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. నేడు జరిగే సెమీఫైనల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్)తో సాయిప్రణీత్... ప్రపంచ మూడో ర్యాంకర్ చెన్ యుఫె (చైనా)తో సింధు ఆడతారు. మధ్యాహ్నం గం. 2.30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం ఉంది. -
సాయిప్రణీత్ ముందంజ
మకావు: మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ భమిడిపాటి సాయిప్రణీత్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఎనిమిదో సీడ్ సాయిప్రణీత్ 11-5తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి వూన్ కాక్ హాంగ్ (మలేసియా) గాయంతో వైదొలిగాడు. బుధవారం జరిగే రెండో రౌండ్లో రొనాల్డ్ సుసిలో (సింగపూర్)తో సాయిప్రణీత్ ఆడతాడు. భారత్‌కే చెందిన సౌరభ్ వర్మ, హెచ్ఎస్ ప్రణయ్ కూడా శుభారంభం చేయగా... అజయ్ జయరామ్, అరవింద్ భట్ ఓడిపోయారు. తొలి రౌండ్లో సౌరభ్ వర్మ 21-14, 21-15తో యాంగ్ చి చెయి (చైనీస్ తైపీ)పై... ప్రణయ్ 21-12, 21-18తో చున్ షి కుయ్ (చైనీస్ తైపీ)పై గెలిచారు. జయరామ్ 15-21, 11-21తో కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో; అరవింద్ 15-21, 5-21తో షి యుకి (చైనా) చేతిలో ఓడిపోయారు.