breaking news
BCs welfare
-
బీసీల సంక్షేమానికి పెద్దపీట: హరీశ్
మణికొండ: దేశంలోని ఏరాష్ట్రంలోనూ లేనివిధంగా తెలం గాణలో బీసీల సంక్షేమానికి ఇప్పటివరకు రూ.48 వేల కోట్లు ఖర్చుచేశామని, ఈ సంవత్సరం 6,229 కోట్లను బడ్జెట్లో కేటాయించామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఆయన మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి గండిపేట మండలం కోకాపేటలోని ఆరెకటిక, గాండ్ల, రంగ్రేజ్, భట్రాజ్ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు ఆయన యాదవ, కురుమ ఆత్మగౌరవ భవనాలను పరిశీలించారు. ఆయా భవనాలకు అవసరమైన విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యాల కల్పనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కోకాపేటలో బీసీల ఆత్మగౌరవ సముదాయాల నిర్మాణపనులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. తుది దశకు చేరుకున్న యాదవ, కురుమ సంఘాల భవనాలను మార్చి 10న ప్రారంభిస్తామన్నారు. బీసీలకు ప్రభుత్వం అండ: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలకు అండగా నిలుస్తున్నారని మంత్రి కమలాకర్ అన్నారు. ఇప్పటివర కు 29 బీసీ సంఘాల ఆత్మగౌరవ భవనాలకు భూమిపూజ చేశామన్నారు. దేశవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాలు బీసీల గురించి కేవలం మాటలే చెబుతాయని, తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ సర్కారు చేతల్లో చూపిస్తోందని మంత్రి తలసాని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి జరుగుతున్న కృషిని ఆయా కులసంఘాల నేతలు, ప్రజలు దేశవ్యాప్తంగా చాటిచెప్పాలని సూచించారు. గతంలో ప్రభుత్వాలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూశాయని, కేంద్ర ప్రభుత్వం బీసీలకు 2 వేల కోట్లు కేటాయించగా, తెలంగాణలో 6,229 కోట్లు సీఎం కేసీఆర్ కేటాయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మల్లేశం, బండ ప్రకాశ్, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కమీషన్ సభ్యుడు ఉపేంద్ర, జిల్లా కలెక్టర్ హరీశ్, రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళ, ఆయా కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఆయన బర్త్‌డేను ‘బీసీడే’ గా గుర్తించాలి
హైదరాబాద్: విద్యార్థి దశ నుంచే బీసీల సంక్షేమం కోసం ఉద్యమబాటను ఎంచుకున్న కృష్ణయ్య పుట్టినరోజును బీసీ కులసంఘాలు, బీసీ శ్రేణులు ‘బీసీడే’గా గుర్తించి సంఘసేవా కార్యక్రమాలను చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కోరారు. కృష్ణయ్యకోసం ఎవరూ పూలగుత్తులు, శాలువాలు తేకుండా అదే డబ్బును పేద విద్యార్థుల పుస్తకాలు, దుస్తుల కోసం వినియోగించాలని, ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడేలా రక్తదానశిబిరాలను ఏర్పాటుచేయాలని శ్రీనివాస్‌గౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. బీసీ ఉద్యమనేత ఆర్. కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వివిధ సామాజికసేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. -
బీసీల సంక్షేమానికి ‘టోపీ’
బడ్జెట్లో ఘనంగా రూ.4,028 కోట్లు చూపించినా... ఇచ్చింది రూ.2,068 కోట్లే కుల సమాఖ్యలు, కార్పొరేషన్ కింద రూపాయి ఖర్చు లేదు రాజీవ్ అభ్యుదయ యోజనా లేదు... వివాహ ప్రోత్సాహకాలు లేవు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీలంటే ఫీజులు, హాస్టళ్లేనా? ఫీజుల పథకం కింద స్కాలర్షిప్లు, ట్యూషన్ ఫీజులిచ్చి, ప్రభుత్వ హాస్టళ్లలో బీసీ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తే వెనుకబడిన వర్గాలన్నీ అభివృద్ధి చెందినట్లేనా? సర్కారు వారి బడ్జెట్ ఖర్చును పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. ఫీజులు, హాస్టళ్లకంటే బీసీల పట్ల ప్రభుత్వ ప్రాధాన్యతలేమీ లేవని అర్థమవుతోంది. ఈ ఏడాది (2013-14) బడ్జెట్ కింద బీసీల సంక్షేమానికి రూ.4,028 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం రూ.2,068 కోట్లను మాత్రమే బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చింది. అందులో ఫీజులు, హాస్టళ్లు, గురుకులాల కోసమే రూ.1,800 కోట్లకు పైగా ఉన్నాయి. కుల సమాఖ్యల ఎదురుచూపులు: బడ్జెట్లో ఒక్కో కుల సమాఖ్యకు రూ.15 నుంచి రూ.50 కోట్ల వరకు కేటాయింపులు చూపెట్టినా... ఈ సమాఖ్యల కింద రిజిస్టర్ చేసుకున్న ఒక్క సొసైటీకి కూడా ఆర్థిక సాయం లేదు. అదేమని ప్రశ్నిస్తే... ఎస్సీ, ఎస్టీలు, బీసీలు, మహిళలు, వికలాంగులు, మైనార్టీలందరికీ కలిపి ప్రభుత్వం ఒక కొత్త పథకం రూపొందిస్తోందని, దాని సబ్సిడీ విధానం ఖరారయ్యేంతవరకు నిధులివ్వబోమని అధికారులు చెపుతున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం వేలాదిమంది నిరుద్యోగులు బ్యాంకులను ఎలాగోలా ఒప్పించుకుని కనీసం గతంలో ఇచ్చే రూ.30వేల సబ్సిడీతోనైనా రుణం అందకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లోని బీసీలకు ఆర్థిక సాయం చేకూర్చే రాజీవ్ అభ్యుదయ యోజన పరిస్థితి కూడా అంతే. బీసీ కార్పొరేషన్ కింద చేపట్టాల్సిన ఇతర ఆర్థిక సాయం కార్యక్రమాలకు కూడా చిల్లిగవ్వ ఖర్చుచేయలేదు. మరోవైపు ఇతర కులాల వారిని వివాహం చేసుకుంటే ఇచ్చే వివాహ ప్రోత్సాహకాల కోసం బడ్జెట్లో రూ.5.2 కోట్లు చూపెట్టినప్పటికీ ఒక్క రూపాయి కూడా బీసీ శాఖకు ఇవ్వలేదు. అడ్వకేట్ల స్టయిపెండ్, కమ్యూనిటీ సర్వీసులకు కూడా నయాపైసా ఇవ్వకుండా రిక్తహస్తాన్ని చూపెట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది. కేంద్రం ఇచ్చినా...: ఈ ఏడాది బడ్జెట్ అంచనాల ప్రకారం హాస్టల్ భవనాల నిర్మాణంతో పాటు ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం కేంద్రం రూ.132 కోట్లు ఇవ్వగా, అందులో కేవలం 18.76 కోట్లను మాత్రమే బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చారు. ఇక, కేంద్రం ఇచ్చే నిధులు మ్యాచింగ్షేర్గా రాష్ట్రం ఇవ్వాల్సిన రూ. 33 కోట్లకు ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో మూడునెలలే సమయముంది. ఇందులో వచ్చేది ఒక త్రైమాసికం బడ్జెట్టే. ఈ బడ్జెట్ కింద రూ.2వేల కోట్లు ఇస్తే కానీ బడ్జెట్లో చూపెట్టిన మొత్తం బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చినట్లు. మళ్లీ అందులో కూడా వచ్చే మూడు నెలల్లో ఆ మొత్తాన్ని బీసీ సంక్షేమ శాఖ ఖర్చుపెట్టాలి. ఈ నేపథ్యంలో అసలు మిగిలిన మొత్తంలో బీసీలకు ప్రభుత్వం ఎంత ఇస్తుంది... బీసీ సంక్షేమ శాఖ ఎంత ఖర్చు చేస్తుందన్నది ప్రశ్నార్థకమే. సబ్‌ప్లాన్ పెడతారట...: ప్రణాళిక నిధులనే ఖర్చు పెట్టకుండా, బడ్జెట్లో చూపెట్టిన నిధులను కనీసం బీసీ శాఖకు కూడా ఇవ్వకుండా బీసీలపై సవతితల్లి ప్రేమను చూపుతున్న ప్రభుత్వ పెద్దలు... ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీల కోసం కూడా సబ్‌ప్లాన్‌ను పెడతామని చెపుతున్నారు. బీసీలకు సబ్‌ప్లాన్‌పై తీవ్రంగా కసరత్తు చేస్తున్నామని కొందరు మంత్రులు చెబుతుండగా, సీఎం మాత్రం బీసీలకు సబ్‌ప్లాన్ పెడితే బీసీలే నష్టపోతారని, అలా కాకుండా ఏం చేస్తే బీసీలు లాభపడతారో, ఆర్థికంగా వృద్ధి చెందుతారో ఆ కార్యక్రమాలను చేపడతామని చెప్పుకొస్తున్నారు. వివిధ పథకాల కోసం ఈ ఏడాది డిసెంబర్ 10 వరకు బీసీ సంక్షేమ శాఖకు ఆర్థిక శాఖ మంజూరు చేసిన నిధులు పథకం బడ్జెట్ అంచనా బీఆర్వోలు బీసీ శాఖకిచ్చింది (రూ. కోట్లలో) గురుకులం 65.5 65.5 49 రుణాల చెల్లింపు 3.26 3.26 0 హాస్టళ్లు 403 188 151 అడ్వకేట్లకు సబ్సిడీ 20 10 5 స్టడీసర్కిల్స్ 25 18.75 12.5 కళాశాల హాస్టళ్లు 116 105 33 కమ్యూనిటీ సర్వీసులు 50 25 0 కుల సమాఖ్యలు 140 140 50 బీసీ కార్పొరేషన్ 206 154 103 వివాహ ప్రోత్సాహకాలు 5.2 5.2 0 రాజీవ్ అభ్యుదయ యోజన 69 52 0 ట్యూషన్ ఫీజు (బీసీ) 1169 1748 795 ట్యూషన్ ఫీజు (ఈబీసీ) 600 1052 508 స్కాలర్షిప్ 816 527 257 (ఇందులో బీసీ సంక్షేమ శాఖకు ఇచ్చిన మొత్తం కూడా ఖర్చయ్యే అవకాశం లేదు. అందులో మరికొంత మిగిలే అవకాశం ఉంది. కుల సమాఖ్యలు, బీసీ ఆర్థిక కార్పొరేషన్కిచ్చిన రూ.150 కోట్లలో ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. )