breaking news
banks close
-
రెండు రోజులు బ్యాంకులు బంద్..
దేశవ్యాప్తంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు మూత పడనున్నాయి. మార్చి 24, 25 తేదీల్లో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) తెలిపింది. కీలక డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో జరిపిన చర్చలు సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడంతో సమ్మె షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది.ఐబీఏతో జరిగిన సమావేశాల్లో యూఎఫ్‌బీయూ సభ్యులందరూ అన్ని కేడర్లలో నియామకాలు, వారానికి ఐదు రోజుల పనిదినాలు వంటి అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ కీలక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ) ప్రధాన కార్యదర్శి ఎల్.చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లేబర్, ఆఫీసర్ డైరెక్టర్ పోస్టుల భర్తీ వంటి డిమాండ్లతో తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలతో కూడిన యూఎఫ్‌బీయూ గతంలో సమ్మెకు పిలుపునిచ్చింది.పనితీరు సమీక్షలు, పనితీరు సంబంధిత ప్రోత్సాహకాలపై ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగ భద్రతకు ముప్పును సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీఎఫ్ఎస్ పేర్కొన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల "మైక్రో మేనేజ్మెంట్"ను కూడా యూఎఫ్‌బీయూ వ్యతిరేకిస్తోంది. ఇటువంటి జోక్యం బ్యాంక్ బోర్డుల స్వయంప్రతిపత్తిని దెబ్బతీస్తుందని పేర్కొంది.ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు యూఎఫ్‌బీయూలో ఉన్నాయి.ఉద్యోగుల డిమాండ్లు..ఐబీఏ వద్ద ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడం ద్వారా ఈ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పథకంతో అనుసంధానం, ఆదాయపు పన్ను మినహాయింపు వంటివి కూడా ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి. -
భారత్ బంద్
- గ్యారేజీకి పరిమితం కానున్న బస్సులు - మూతపడనున్న బ్యాంకులు - కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా - సెలవు ప్రకటించిన ప్రైవేట్ విద్యా సంస్థలు ఒంగోలు టౌన్ : కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జిల్లాలో విజయవంతం చేసేందుకు కార్మిక సంఘాల నేతలు సిద్ధమయ్యారు. పదిహేను రోజులుగా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సమ్మె పురస్కరించుకొని పోస్టల్, టెలికం, ఎల్ఐసీ కార్యాలతో పాటు బ్యాంకులన్నీ మూతపడే అవకాశాలున్నాయి. ఆర్టీసీలో బస్సులు గ్యారేజీకే పరిమితం కానున్నాయి. అనేక ప్రైవేట్ విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, వైఎస్‌ఆర్‌టీయూ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. 1991 నుంచి కేంద్ర కార్మిక సంఘాలు దశలవారీగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తూ వస్తున్నాయి. తాజాగా 17వసారి చేయనున్నారు. రెండు లక్షలకు పైగా కార్మికులు పాల్గొనే అవకాశం జిల్లాలోని వివిధ రంగాల్లో 515059 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో లక్షా 50వేల మంది బిల్డింగ్ వర్కర్లు, 25వేల మంది ఆటో కార్మికులు, 25వేల పొగాకు గ్రేడింగ్ కార్మికులున్నారు. భారీ, మధ్యతరహా పరిశ్రమల్లో 26880, షాపు గుమస్తాలుగా 10900, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లో 5625, క్వారీల్లో 7000, ఇటుక బట్టీల్లో 5625, పలకల పరిశ్రమల్లో 3000, రెస్టారెంట్లు, హోటళ్లలో 5442 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరు కాకుండా విద్యాశాఖలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన 9485 మంది నాన్ టీచింగ్ సిబ్బంది, 5000 మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, 2985 మంది ఆశ కార్యకర్తలు, 187మంది మెడికల్ రిప్స్, 8600 మంది అంగన్వాడీలున్నారు. వీరంతా సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆర్టీసీలో 4200 మంది కార్మికులుండగా, అందులో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, ఎంప్లాయీస్ యూనియన్‌కు సంబంధించిన దాదాపు 2500 మంది కార్మికులు పాల్గొననున్నారు. భారీ ప్రదర్శన, సభకు ఏర్పాట్లు సార్వత్రిక సమ్మెలో భాగంగా ఒంగోలు నగరంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్టీసీ డిపో నుంచి ప్రదర్శన ప్రారంభమై కలెక్టరేట్ వద్దకు చేరుకుంటుంది. అక్కడ ధర్నా నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను కార్మిక సంఘాల నేతలు ఎండగట్టనున్నారు. సార్వత్రిక సమ్మెకు ఎన్జీఓ సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.