బాలుతో అళగిరి ఢీ
సాక్షి, చెన్నై : తంజావూరు లోక్‌సభ అభ్యర్థి, డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలును ఓడించడమే లక్ష్యంగా బహిష్కృత నేత అళగిరి ప్రయత్నాల్లో మునిగారు. పళని మాణిక్యం వర్గాన్ని ఏకం చేసి డిపాజిట్లు గల్లం తు చేయడానికి సిద్ధమవుతున్నారు. గురువారం అళగిరి చేసిన వ్యాఖ్యలు ఇందుకు అద్దం పడుతున్నాయి. డీఎంకే నుంచి అధినేత పెద్ద కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరిని శాశ్వతంగా బహిష్కరించిన విషయం తెలిసిందే. తనను పార్టీ నుంచి బహిష్కరించడంతో అళగిరి తీవ్ర ఆక్రోశంతో ఉన్నారు. డీఎంకేను చీల్చనని, ప్రత్యేకంగా పార్టీని పెట్టనని స్పష్టం చేస్తున్న అళగిరి తన మద్దతుదారుల్ని, డీఎంకేలోని అసంతృప్తి వాదుల్ని ఏకం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలోని తన మద్దతుదారుల్ని కలుస్తున్న అళగిరి రోజుకో చోట సంచలన వ్యాఖ్య లు చేస్తున్నారు. ఇన్నాళ్లు స్టాలిన్‌ను టార్గెట్ చేసి ఆరోపణలు సంధించిన ఆయన తన దృష్టిని డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్‌బాలు మీద మరల్చారు.
బాలుపై ఫైర్: దక్షిణాది కింగ్ మేకర్‌గా తన సత్తా ఏమిటో టీఆర్ బాలుకు రుచి చూపించేందుకు అళగిరి ఉరకలు తీస్తున్నారు. తంజావూరులో తన మిత్రుడు పళని మాణిక్యంను పక్కన పెట్టి టీఆర్ బాలును అభ్యర్థిగా ప్రకటించడాన్ని ఆయన జీర్ణిం చుకోలేకున్నారు. తంజావూరులో గురువారం ఆయ న మాట్లాడుతూ బాలు ఓటమి లక్ష్యంగా తన మద్దతుదారులకు, కేంద్ర మాజీ మంత్రి పళని మాణిక్యం వర్గానికి పిలుపునివ్వడం గమనార్హం. ఓడిద్దాం:డీఎంకేలో చిచ్చుకు ప్రధాన కారకుల్లో టీఆర్ బాలు కూడా ఉన్నాడని అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కలేదన్న అక్కసుతో పార్టీకి చెందిన కేంద్ర మం త్రులపై గతంలో తప్పుడు ఫిర్యాదుల్ని అధిష్టానానికి చేరవేశారని ఆరోపించారు. ఇందుకు దయానిధి మారన్‌ను మధ్యవర్తిగా పెట్టుకున్నట్టు విమర్శిం చారు. పార్టీలో చిచ్చుపెట్టి వేడుక చూడడంతోపాటు పార్టీకి చెందిన ముఖ్య నాయకులకు సీట్లు రానివ్వకుండా చేశాడని మండిపడ్డారు.
శ్రీపెరంబదూరులో గెలవనన్న విషయాన్ని తెలుసుకుని, పళని మాణిక్యం మీద ఉన్నది లేనిది నూరి పోసి సీటు రానివ్వకుండా చేశాడని ధ్వజమెత్తారు. ఆ స్థానాన్ని తన చేతిలోకి తీసుకుని విజయం సాధించాలని అనుకు న్నాడని, ఓటమి తప్పదని హెచ్చరించారు. అంద రూ ఒకే బాట, ఒకే నినాదంతో ముందుకు వెళ్లాలని, అప్పుడు బాలు ఓటమిని చూడొచ్చంటూ పరోక్షంగా ఆయనకు ఓట్లు వేయొద్దని మద్దతు దారులకు పిలుపునిచ్చారు. అలాగే షాజహాన్‌ను బంధించి అధికార పగ్గాల్ని ఔరంగజేబు ఎలా సొం తం చేసుకున్నాడో, అదే పరిస్థితి డీఎంకేలో నెలకొం దని ఆరోపించారు. కరుణానిధి షాజహన్ అని, స్టాలిన్ ఔరంగజేబు అంటూ ఎద్దేవా చేశారు.
అధికారికంగా అందనీ: తంజావూరు పర్యటన ముగించుకుని మదురై వెళుతూ అళగిరి తిరుచ్చిలో విలేకరులతో మాట్లాడారు. మద్దతుదారులందర్నీ కలుస్తున్నారు కదా అని ప్రశ్నించగా ముందుగా చెప్పానుగా అని సమాధానం దాట వేశారు. ఇందు లో ఆంతర్యమేమిటో అని ప్రశ్నించగా, నేను పార్టీ పెట్టబోనని, డీఎంకేను రక్షించుకుంటానని సమాధానమిచ్చారు. టీఆర్ బాలు తంజావూరులో గెలుస్తారా? అని ప్రశ్నించగా, దీనికి సమాధానం డీఎంకే వాళ్లను అడగండి, ఇప్పుడు ఆ పార్టీలో నేను లేనుగా అని పేర్కొన్నారు. డీఎంకేపై కేసు ఎప్పుడు వేస్తున్నారు..? అని ప్రశ్నించగా తనను పార్టీ నుంచి తొల గించినట్టు టీవీలు, పత్రికల్లో చూసి తెలుసుకున్నానని, అధికారికంగా తనకు ఎలాంటి లేఖ, ఉత్తర్వు లు రాలేదన్నారు. అవి చేతికి అందిన తర్వాత దాన్ని ఎవరు పంపించారో వారిపై కేసు వేస్తానంటూ స్పష్టం చేశారు. తమరి మద్దతు నాయకులు, సిట్టింగ్ ఎంపీలు రితీష్, నెపోలియన్లపై మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోన్నట్టుందే..? అని ప్రశ్నించగా, డీఎంకే అధిష్టానాన్ని అడగండి, ఎందు కు చర్యలు తీసుకోలేదో అని ఎదురు ప్రశ్న వేశారు.