breaking news
Ayesha murder case
-
ఆయేషా హత్య కేసులో సీబీఐ ముందడుగు
విజయవాడ లీగల్: ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బి–ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ ఒకడుగు ముందుకు వేసింది. నగరంలోని వివిధ కోర్టులలో పనిచేస్తున్న వై.సుబ్బారెడ్డి (మహిళ సెషన్స్ కోర్టు), వెంకటకుమార్ (ఫ్యామిలీ కోర్టు), కుమారి (మైలవరం)పై సీబీఐ 120 బి, 201, 409, 13(2) రెడ్‌విత్ 13(1) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. 2007 డిసెంబర్ 26 రాత్రి ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గ లేడీస్ హాస్టల్లో విద్యార్థిని ఆయేషాపై లైంగికదాడికి పాల్పడిన దుండగులు హత్య చేశారు. కేసులో నిందితుడిగా పోలీసులు ప్రవేశపెట్టిన పిడతల సత్యంబాబుకు మహిళ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై సత్యంబాబు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోగా వాదనలు విన్న కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. అదే సమయంలో కేసులో అసలు దోషులను పట్టుకోవాలని పోలీసులను ఆదేశించింది. కేసు విచారణలో భాగంగా, ప్రభుత్వం నలుగురు అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. అయినా కేసు విచారణలో ఏమాత్రం పురోగతి కనిపించకపోవడంతో ప్రజాసంఘాలు, ఆయేషా తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. అలాగే అప్పటి విచారణ అధికారులపై ప్రభుత్వం ఏవిధమైన చర్యలు చేపట్టలేదని, సిట్ అధికారులు సరిగా విచారణ చేయడం లేదంటూ హైకోర్టుకు, డీజీపీకి విన్నవించారు. మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఉన్న వస్తువులు తగలబడి పోయాయని హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేశారని, అసలు ఇదంతా నిందితుల ప్రోద్బలంతోనే జరుగుతోందని ఆయేషా తల్లిదండ్రులు 15 అంశాలతో కూడిన పిటిషన్‌ను దాఖలు చేశారు. దీంతో సాక్ష్యాలను తగలబెట్టి తారుమారు చేసిన వారిపై కేసు నమోదు చేసి విచారించాల్సిందిగా హైకోర్టు సీబీఐని ఆదేశించింది. సాక్ష్యాలు ఎందుకు తారుమారు చేశారు? మెటీరియల్ ఆబ్జెక్ట్స్‌ను తగలబెట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చింది, ఎందుకు చేశారు.. ఎవరి ప్రోద్బలంతో చేశారు.. అన్నవి ఇప్పుడు తేలాల్సిన ప్రశ్నలు. నగరంలోని నాల్గవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఆయేషా హత్యకు సంబంధించిన మెటీరియల్ ఆబ్జెక్టŠస్ అయిన పచ్చడి బండ, రెండు కండువాలు, రక్తపు మరకలున్న రెండు బెడ్ షీట్స్, మరకలున్న నైట్ ప్యాంటు, బ్రా, రక్తపు మరకలున్న రెండు దిండ్లను ఇబ్రహీంపట్నం పోలీసులు దాఖలు చేశారు. వాటిని 2014లోనే తగలబెట్టినట్లు సమాచారం. ఇదే విషయాన్ని సిట్ అధికారులు కోర్టుకు వచ్చినపుడు సిబ్బంది తెలిపారు. ఇదే ముగ్గురిపై శాఖాపరమైన విచారణ జరిగింది. విచారించిన న్యాయమూర్తి మెటీరియల్ ఆబ్జెక్టŠస్ తగలబడటానికి ఈ ముగ్గురే కారణమని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగానే సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆ కోణంలో విచారణ చేయాల్సి ఉంది. -
ఆయేషా కేసుపై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో పునర్ దర్యాప్తు నిమిత్తం దాఖలైన వ్యాజ్యాల్లో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. వాదనలు విన్న తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తన ఉత్తర్వులను వాయిదా వేసింది. ఈ కేసులో పునర్ దర్యాప్తు చేయించాల్సిన అవసరమెంతైనా ఉందని ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ రమా మేల్కోటే, పాత్రికేయురాలు కె.సజయ, సామాజిక కార్యకర్త వల్లూరుపల్లి సంధ్యారాణి సంయుక్తంగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం తెలిసిందే. అయితే సిట్ చేసే పునర్ దర్యాప్తును హైకోర్టే పర్యవేక్షించాలని, లేనిపక్షంలో సీబీఐకి దర్యాప్తు బాధ్యతల్ని అప్పగించాలంటూ ఆయేషా తల్లిదండ్రులు మరో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశిస్తేనే పునర్ దర్యాప్తు చేయగలమని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై వాదనలు వినిపించాలని పిటిషనర్లను ధర్మాసనం కోరింది. ఇందులోభాగంగా మంగళవారం పోలీసుల తరఫున హోంశాఖ న్యాయవాది విద్యావతి వాదనలు వినిపించారు. ఆయేషా హత్యకేసులో పునర్ దర్యాప్తునకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే సిట్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే తమంతతాముగా పునర్ దర్యాప్తు చేయలేమని, హైకోర్టు ఆదేశిస్తే తప్పక చేస్తామని వివరించారు. స్వతంత్రంగా దర్యాప్తు జరుగుతున్నప్పుడు కోర్టు పర్యవేక్షణ అవసరం లేదన్నారు. ఆయేషా తల్లిదండ్రుల తరఫు న్యాయవాది సురేశ్‌కుమార్ స్పందిస్తూ.. హైకోర్టు పర్యవేక్షణలోనే దర్యాప్తు జరగాలని కోరారు.