breaking news
ATVM
-
రైల్వే ఉద్యోగాల పేరిట టోకరా
సాక్షి, అమరావతి: రైల్వే ఉద్యోగం అంటే ఆసక్తి చూపంది ఎవరు? దాదాపు ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతారు. ఇప్పుడు దీన్నే అస్త్రంగా చేసుకున్న కొందరు మోసగాళ్లు భారీ మోసానికి తెరతీశారు. రైల్వేలో ఉద్యోగాలిస్తామని అభ్యర్థుల నుంచి రూ.లక్షలు దండుకుంటున్నారు. నిరుద్యోగులను నిలువునా ముంచుతున్నారు. రైల్వే శాఖ ఫెసిలిటేటర్ పేరుతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను వక్రీకరిస్తూ.. నిరుద్యోగుల నుంచి భారీ వసూళ్లకు తెరతీశారు. కాస్త ఆలస్యంగా గుర్తించిన రైల్వే అధికారులు అసలు అది ఉద్యోగమే కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విజయవాడ రైల్వే డివిజన్లోఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగాళ్లు సాగిస్తున్న దందా ఇదీ.. ‘ఏటీవీఎం ఫెసిలిటేటర్’ కోసం రైల్వే శాఖ నోటిఫికేషన్.. రైల్వే స్టేషన్లలో టికెట్లు జారీ చేసే ‘ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్లు (ఏటీవీఎం) ఫెసిలిటేటర్ల’ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలోని 26 రైల్వే స్టేషన్లలో 59 మంది ఫెసిలిటేటర్లను నియమిస్తామని అందులో పేర్కొంది. రైల్వే స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసే ఈ ఏటీవీఎం మెషిన్లలో వివరాలు నమోదు చేసి క్రెడిట్ / డెబిట్ కార్డుతో టికెట్ కొనుగోలు చేయొచ్చు. టికెట్ కౌంటర్లలో క్యూలలో నిలబడాల్సిన అవసరం లేకుండా టికెట్లు పొందేందుకు ఈ ఏటీవీఎం మెషిన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా వృద్ధులు, నిరక్షరాస్యులు తదితరులు ఈ మెషిన్లలో వివరాలు సరిగా నమోదు చేయలేరు.అందుకోసం మెషిన్ల వద్ద సహాయకులను నియమించాలని రైల్వే శాఖ భావించింది. మెషిన్ల ద్వారా ఫెసిలిటేటర్లు జారీ చేసే టికెట్లపై వారికి కమీషన్ చెల్లించాలని నిర్ణయించింది. విజయవాడ 9, అనకాపల్లి 3, అనపర్తి 1, బాపట్ల 1, భీమవరం టౌన్ 1, కాకినాడ టౌన్ 1, చీరాల 1, కాకినాడ పోర్ట్ 2, ఏలూరు 2, గూడూరు 4, కావలి 1, మచిలీపట్నం 2, నిడదవోలు 1, నిడుబ్రోలు 2, నెల్లూరు 5, నరసాపురం 1, ఒంగోలు 1, పిఠాపురం 1, పాలకొల్లు 1, రాజమహేంద్రవరం 5, సింగరాయకొండ 2, సామర్లకోట 1, తాడేపల్లిగూడెం 2, తెనాలి 5, తుని 2, యలమంచిలిలో 2 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. బోగస్ వెబ్సైట్లతో టోకరా.. రైల్వే శాఖ ఇచి్చన ఈ నోటిఫికేషన్‌ను కొందరు మోసగాళ్లు తప్పుదోవ పట్టించారు. ఏటీవీఎం ఫెసిలిటేటర్ ఉద్యోగాలు రైల్వేలో రెగ్యులర్/కాంట్రాక్టు ఉద్యోగాలు అని నిరుద్యోగులను నమ్మిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. అందుకోసం ఏకంగా బోగస్ వెబ్సైట్లను సృష్టించి యువతను మభ్య పెడుతున్నారు. రైల్వే అధికారులు ఇచి్చన నోటిఫికేషన్‌ను మారి్ఫంగ్ చేసి ఆ నకిలీ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచి దరఖాస్తులు ఆహా్వనిస్తున్నారు.ఒక్కో పోస్టు కోసం రూ.లక్షల్లోనే వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తారని చెబుతూ భారీగా నిరుద్యోగుల నుంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముఠాలో కొందరు రైల్వే ఉద్యోగులు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. దీంతో వారు అడిగినంత డబ్బులు ఇస్తే తమకు ఉద్యోగాలు వస్తాయని పలువురు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు నమ్మి మోసపోతున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే డబ్బులు చెల్లించిన పలువురు ఆ పోస్టుల భర్తీ గురించి రైల్వే ఉన్నతాధికారులను వాకబు చేస్తుండటం గమనార్హం.అవి ఉద్యోగాలు కానే కావు.. రైల్వే జీతాలు ఇవ్వదురైల్వే శాఖ స్పష్టికరణ ఏటీవీఎం ఫెసిలిటేటర్ల కోసం తాము ఇచ్చిన నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ కోసం కాదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఆ ఫెసిలిటేటర్ అనేది అసలు ఉద్యోగం కానే కాదని తేల్చిచెప్పింది. ఫెసిలిటేటర్‌కు రైల్వే జీతాలు ఇవ్వదని.. ఇతర ఎలాంటి ఉద్యోగ సంబంధమైన ప్రయోజనాలు కలి్పంచదని వెల్లడించింది. కేవలం రిటైర్డ్ రైల్వే సిబ్బంది / నిరుద్యోగుల కోసం జారీ చేసిన ఈ నోటిఫికేషన్‌ను కొందరు వక్రీకరిస్తున్నారని పేర్కొంది. ఏటీవీఎంల ద్వారా టికెట్లు జారీ చేసే ఫెసిలిటేటర్‌కు ఆ టికెట్ల మొత్తంలో గరిష్టంగా 3 శాతం కమీషన్ మాత్రమే రైల్వే చెల్లిస్తుందని తెలిపింది.అది కూడా గరిష్టంగా 150 కి.మీ.లోపు దూరం ఉన్న స్టేషన్లకే ఏటీవీఎం మెషిన్ల ద్వారా టికెట్లు జారీ చేయడం సాధ్యపడుతుందని వెల్లడించింది. అంటే ఏటీవీఎం ఫెసిలిటేటర్లకు కమీషన్ మొత్తం నామమాత్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. కాబట్టి ఏటీవీఎం ఫెసిలిటేటర్ పోస్టులు అనేవి రెగ్యులర్ ఉద్యోగాలో, కాంట్రాక్టు ఉద్యోగాలో కాదనే విషయాన్ని నిరుద్యోగులు గుర్తించాలని విజయవాడ రైల్వే డీఆర్ఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రైల్వేలో ఉద్యోగాల కోసం రైల్వే శాఖ అధికారిక వెబ్సైట్ www. scr. indianrailways.gov.in ను సంప్రదించాలని సూచించింది. -
ఏటీవీఎంలకు ఆదరణ
సాక్షి, ముంబై: లోకల్‌రైళ్ల టికెట్ల బుకింగ్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు సెంట్రల్ రైల్వే ప్రవేశపెట్టిన వివిధ పథకాలకు మంచి స్పందన లభిస్తోంది. ఫలితంగా సాధారణ కౌంటర్ల వద్ద టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికుల సంఖ్య 50 శాతానికి తగ్గిందని అధికారులు వెల్లడించారు. ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ఏటీవీఎం), జన్సాధారణ్ టికెట్ బుకింగ్ సేవక్ (జేటీబీఎస్) ద్వారా టికెట్లు కొనే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. వీటిని ప్రవేశపెట్టిన తరువాత ప్రయాణికులు టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద క్యూలో నిల్చొని టికెట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. అయితే సెంట్రల్ రైల్వే పరిధిలోని స్టేషన్లలో నిత్యం దాదాపు 9.5 లక్షల మంది ప్రయాణికులు టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. వీరిలో 55 శాతం మంది టికెట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. గత ఏడాది టికెట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా 65 శాతం మంది ప్రయాణికులు టికెట్లు కొనుగోలు కేయగా, ఈ ఏడాది 55 శాతం మంది మాత్రమే కొనుగోలు చేశారని అధికారి ఒకరు తెలిపారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే చాలా మంది ప్రయాణికులు ఏటీవీఎంలు, జేటీబీఎస్‌ల ద్వారానే టికెట్లను కొనుగోలు చేస్తున్నట్టు స్పష్టమవుతోందని సెంట్రల్రైల్వే సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ పేర్కొన్నారు. ఈ ఏడాది చివరి కల్లా జేటీబీఎస్, ఏటీవీఎంల టికెట్ల విక్రయాన్ని పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రయాణికులు టికెట్ల కౌంటర్ల వద్ద క్యూల్లో నిల్చుని టికెట్ కొనుగోలు చేసే సమయం లేకపోవడంతో వీటికి ఆదరణ తగ్గిందని ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. అయితే గతంలో 66 శాతం మంది ప్రయాణికులు రైల్వే ప్రవేశపెట్టిన టికెట్ కొనుగోల యంత్రాలు, విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సదుపాయాలను నవీకరించడంతో పరిస్థితి మెరుగుపడిందని సీఆర్ అధికారి ఒకరు తెలిపారు. గత రెండు నెలల క్రితం వివిధ రైల్వే స్టేషన్లలో 130 ఏటీవీఎంలను ఏర్పాటు చేశామన్నారు. ముంబై డివిజన్లో ప్రస్తుతం 385 ఏటీవీఎంలు ఉన్నాయని పాటిల్ తెలిపారు. ఈ ఏడాదిలోపు కూపన్ వాలిడేటింగ్ మెషీన్లను (సీబీఎం) తొలగించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. గత రెండేళ్లుగా సీవీఎంల ద్వారా టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఇదిలా ఉండగా సెంట్రల్ రైల్వే పరిధిలో 164 జేటీబీఎస్‌లు ఉన్నాయి. 2012 సెప్టెంబర్ నుంచి ఈ పథకం ద్వారా టికెట్ కొనుగోలు చేసే వారి సంఖ్య 50 శాతానికి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. దుకాణాలు, ఇతర ప్రైవేట్ సంస్థలు జేటీబీఎస్‌ల ద్వారా టికెట్ విక్రయించుకోవడానికి రైల్వే అనుమతించింది. అంతేకాకుండా సీజన్పాస్ల నవీకరణ కోసం కూడా అనుమతించింది. ఫలితంగా దుకాణదారులు ఒక్కో పాస్‌కు రూపాయి చొప్పున కమీషన్ పొందవచ్చు.