breaking news
atla taddi
-
అట్లతద్ది ఎందుకు చేసుకుంటారంటే..
కోడూరు, భట్టిప్రోలు: మన తెలుగు సంప్రదాయంలో మహిళలు సౌభ్యాగాన్ని ప్రసాదించాలంటూ అనేక వ్రతాలు, నోములు ఆచరించడం మనకు తెలిసిందే. అయితే ప్రతి ఏటా విజయదశమి తరువాత వచ్చే ఆశ్వయుజ బహుళ తదియనాడు జరుపుకొనే ‘అట్లతది’ పండుగకు మాత్రం ప్రత్యేక విశిష్టత ఉంది. తమతో పాటు కుటుంబమంతా సిరిసంపదలతో వర్థిల్లాలంటూ ఈ పర్వదినం నాడు గౌరీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మహిళలంతా గౌరీదేవి వ్రతాన్ని నిర్వహించి, చంద్రోదయ వేళ అట్లను నైవేద్యంగా సమర్పించి, ముతైదువులకు వాయనాలను అందిస్తారు. పరమశివుని పతిగా చేసుకొనేందుకు నారదముని సలహా మేరకు గౌరీదేవి తొలిసారి ఈ వ్రతాన్ని ఆచరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. చంద్రకళల్లో కొలువైవున్న శక్తి అనుగ్రహంతో స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుందని శాస్త్రాలు కూడా చెప్పుతున్నాయి. అట్లుకు ప్రత్యేక స్థానం అట్లతద్ది నాడు అట్లుకు ప్రత్యేక స్థానం కల్పిస్తారు. మన ఇళ్లల్లో అట్లు తయారీకి మినుములు, బియ్యాన్ని ఉపయోగించడం చూస్తాం. దీనికి కూడా పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది. మినుములు రాహువుకు, బియ్యం చంద్రుడికి సంబంధించిన ధాన్యాలు. ఈ ధాన్యాలతో చేసే అట్లను నైవేద్యంగా పెట్టి, వాయనాలను దానంగా ఇవ్వడం వల్ల గర్భదోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.. నవగ్రహాల్లో కుజునికి ‘అట్లు’ అంటే మహాప్రీతి అని, వీటిని నైవేద్యంగా సమర్పిస్తే కుజదోషం పోయి వివాహ బంధానికి ఎలాంటి అడ్డంకులు రావని పెద్దల మాట. మహిళలకు ఎంతో ఇష్టమైన పండుగ గ్రామాల్లో మహిళలు అత్యంత ఇష్టంగా జరుపుకొనే పండుగల్లో అట్లతద్ది ఒకటి. (చదవండి: ఇక ఉత్తరాంధ్రలో గోదారి 'గలగల') ఈ పండుగకు ప్రతి మహిళ తమ అరచేతుల్లో గోరింటాకు పెట్టుకొని అమితానందాన్ని పొందుతారు. కుటుంబంలో ఎవరి చేయి బాగా పండితే వారు అదృష్టవంతులని విశ్వసిస్తారు. అట్లతద్ది రోజున మహిళలు సూర్యోదయానికి ముందే స్నానపానీయాలు ముగించుకొని, గోంగూర పచ్చడి, పెరుగుతో భోజనం చేస్తారు. అనంతరం వీధిలో ఒక చోట ఉయ్యాల ఏర్పాటు చేసి ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్.. ముద్దపప్పు మూడట్లోయ్..’ అంటూ ఆటపాటలతో సరదగా గడుపుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. సాయంత్రం చంద్రోదయం తరువాత మళ్లీ ముత్తయిదువులకు 11 అట్లను వాయనంగా అందించి, పండుగను ముగిస్తారు. ఏదేమైనా అట్లతద్ది పండుగను మంగళవారం జరుపుకొనేందుకు ప్రతి ఇంటి వద్ద మహిళలు ఏర్పాట్లను పూర్తి చేశారు. (చదవండి: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్) -
దోశెడు రుచులు
ఎట్ల చేసినా అట్లు బాగుంటాయి. ఏం టైమ్‌లో అయినా మనసు దోశేస్తాయి. రొటీన్‌ని పక్కన పెట్టండి. బ్రేక్ ఫాస్ట్‌లో ఛీజ్‌ను, బ్రెడ్‌ను దోశెతో కలిపి కొత్త రుచిని లాగించండి. అట్ల తద్ది నోముకు దోశెడు రుచులు కలపండి. బ్రెడ్ దోశె కావలసినవి: బ్రెడ్ స్లైసులు – 10; బియ్యప్పిండి – పావు కప్పు; సెనగ పిండి – 2 టేబుల్ స్పూన్లు; పెరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; నీళ్లు – తగినన్ని; తినే సోడా – అర టీ స్పూను; నూనె – తగినంత పోపు కోసం: నూనె – ఒక టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; జీలకర్ర – పావు టీ స్పూను; కరివేపాకు తరుగు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు తయారీ: ♦ ముందుగా బ్రెడ్‌ను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ♦ బియ్యప్పిండి, సెనగ పిండి, పెరుగు, నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి, పిండి మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకోవాలి ♦ తగినంత ఉప్పు (బ్రెడ్ ఉంటుంది కనుక ఉప్పు తగ్గించి వేసుకోవడం మంచిది) జత చేయాలి ♦ ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి జత చేసి మరోమారు బాగా కలపాలి. పోపు తయారీ : ♦ స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ♦ జీలకర్ర జత చేసి మరోమారు వేయించాక, చివరగా కరివేపాకు తరుగు, ఇంగువ వేసి బాగా వేయించి దోశెపిండి మిశ్రమంలో వేసి కలపాలి ♦ చివరగా తినే సోడా జత చేసి బాగా కలపాలి. దోశె తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి సమానంగా పరవాలి ∙గరిటెతో దోశె పిండి తీసుకుని పెనం మీద పల్చగా వేయాలి ∙బాగా కాలిన తరవాత తిరగేసి మరికాస్త నూనె వేసి కాల్చాలి ∙రెండువైపులా కాలిన తరవాత ప్లేట్లోకి తీసుకుని కొబ్బరి చట్నీతో అందించాలి. ముంబై స్టయిల్ మసాలా దోశె కావలసినవి: దోశె పిండి – 3 కప్పులు; ఉల్లి తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; సాల్టెడ్ బటర్ – తగినంత; గరం మసాలా పొడి లేదా పావ్ భాజీ మసాలా పొడి – తగినంత; మిరప కారం – తగినంత; పొటాటో: మసాలా కోసం కావలసినవి: బంగాళ దుంపలు – 3 (ఉడికించి తొక్కతీసి మెత్తగా మెదపాలి); నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు (పొట్టుతో) – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; ఉల్లి తరుగు – ఒక కప్పు; పచ్చి మిర్చి – 1 (చిన్న ముక్కలు చేయాలి); అల్లం తురుము – అర టీ స్పూను; నీళ్లు – తగినన్ని; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ♦ ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి ♦ పచ్చి సెనగ పప్పును శుభ్రంగా కడిగి వేడి నీళ్లలో వేసి మూత పెట్టి సుమారు గంట సేపు నానబెట్టాక, నీళ్లు వడకట్టేసి, సెనగపప్పును పక్కన ఉంచాలి ♦ బంగాళ దుంపలను ఉడికించి తొక్క తీసి గరిటెతో మెత్తగా మెదిపి పక్కన ఉంచాలి ♦ స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ♦ జీలకర్ర జత చేసి మరోమారు వేయించాలి ♦ వడకట్టిన సెనగ పప్పు జత చే సి బంగారు రంగులోకి మారేవరకు ఆపకుండా వేయించాలి ♦ అల్లం తురుము జత చేసి మరోమారు వేయించాలి ♦ ఉల్లి తరుగు జత చేసి బాగా ♦ కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, పసుపు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి ♦ ఉడికించిన బంగాళదుంప ముద్ద జత చేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి ♦ ఉప్పు, పంచదార, కొద్దిగా నీళ్లు పోసి మసాలా మెత్తగా వచ్చేలా బాగా కలియబెట్టి, సుమారు ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మసాలా దోసె తయారీ: ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కాలనివ్వాలి ♦ గరిటెడు దోసె పిండి తీసుకుని పెనం పల్చగా దోసె వేయాలి ∙దోశె బాగా కాలుతుండగా మసాలాను ఉల్లితరుగు, కొత్తిమీర తరుగు, మిరప కారం లేదా గరం మసాలా వేసి సమానంగా పరవాలి ♦ ఆ పైన కొద్దిగా బటర్ వేయాలి ♦ చివరగా పొటాటో మసాలా మిశ్రమం కొద్దిగా తీసుకుని దోశె పైన ఉంచి దోశెను రెండు పక్కల నుంచి మధ్యకు మడిచి ప్లేట్లోకి తీసుకోవాలి ♦ పిజ్జా కటర్‌తో కట్ చేసుకుని కొబ్బరి చట్నీ, సాంబారులతో వేడివేడిగా అందించాలి. చీజ్ దోశె కావలసినవి: దోశెపిండి – రెండు కప్పులు; ఉల్లితరుగు – అరకప్పు; టొమాటో తరుగు – అర కప్పు; మిరియాల పొడి – పావు టీ స్పూను; చీజ్ తురుము – అర కప్పు; బటర్ – తగినంత తయారీ: ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, కొద్దిగా బటర్ వేసి సమానంగా పరిచి, మంట బాగా తగ్గించాలి ♦ గరిటెతో దోశె పిండి తీసుకుని పెనం మీద దోశెలా వేయాలి ♦ దోశె కొద్దిగా కాలిన తరవాత ఉల్లి తరుగు, టొమాటో తరుగు, మిరియాల పొడి వేసి అట్లకాడతో సరిచేయాలి ♦ చివరగా చీజ్ తురుము వేసి సరిచేయాలి ♦ అదే సమయంలో దోశె చుట్టూ బటర్ వేయాలి ♦ సన్న మంట మీద దోశె కాలుతుండగా, చీజ్, బటర్ రెండూ కరిగిపోతాయి ∙దోశె బంగారు రంగులోకి వచ్చేవరకు కాల్చి ప్లేట్లోకి తీసుకోవాలి ♦ కొబ్బరి చట్నీ, సాంబారుతో అందించాలి ♦ టొమాటో చట్నీ, ఉల్లి చట్నీ కూడా రుచిగా ఉంటాయి. పెరుగు దోశె కావలసినవి: బియ్యం – ఒక కప్పు; గట్టి అటుకులు – పావు కప్పు; మినప్పప్పు – 2 టేబుల్ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; నీళ్లు – నానబెట్టడానికి తగినన్ని; తాజా పెరుగు – అర కప్పు; పంచదార – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నెయ్యి – తగినంత తయారీ: ♦ బియ్యం, మినప్పప్పు, మెంతులను విడివిడిగా కడిగి, ఒకపాత్రలో వేసి తగినన్ని నీళ్లు, పెరుగు జత చేసి సుమారు ఐదు గంటలపాటు నానబెట్టాలి ♦ వేరొక పాత్రలో అటుకులు వేసి తగినన్ని నీళ్లు జత చేసి విడిగా నానబెట్టాలి ♦ నీరంతా ఒంపేసి అటుకులు, బియ్యం, మినప్పప్పు, మెంతులు గ్రైండర్లో వేసి మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ♦ పంచదార, ఉప్పు జత చేసి రాత్రంతా నాననివ్వాలి ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేయాలి ♦ గరిటెడు పిండి తీసుకుని పెనం మీద వేసి కొద్దిగా మందంగా ఉండేలా చూసుకోవాలి ♦ పైన మూత ఉంచి, మీడియం మంట మీద కాలనివ్వాలి ♦ దోశె పై భాగం బాగా కాలిన తర్వాత రెండవ వైపుకి తిప్పి చుట్టూ నెయ్యి వేసి కాలిన తరవాత ప్లేట్లోకి తీసుకోవాలి ♦ కొబ్బరి చట్నీ/ కొత్తిమీర చట్నీతో అందించాలి. షెజ్వాన్ దోశె కావలసినవి: ఉల్లికాడల తరుగు – పావు కప్పు; దోశె పిండి – 3 కప్పులు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; ఉల్లి తరుగు – పావుకప్పు; క్యాప్పికమ్ తరుగు – పావుకప్పు; క్యారట్ తురుము – అర కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; షెజ్వాన్ సాస్ – తగినంత; బటర్ – తగినంత తయారీ: ♦ స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక, అడ్డంగా సగానికి కోసిన ఉల్లిపాయను నూనెలో ముంచి పెనం మీద నూనె పూయాలి ♦ గరిటెతో దోశెపిండి తీసుకుని పెనం మీద దోశె వేయాలి ♦ సన్నటి మంట మీద దోశెను కాలనివ్వాలి ♦ పై భాగం బాగా కాలగానే రెండు టీ స్పూన్ల బటర్, ఒక టీ స్పూను షెజవాన్ సాస్ వేసి, దోశె మీద సమానంగా పరవాలి ♦ ఆ పైన కూరగాయల తరుగు వేసి పరవాలి ♦ బాగా కాలిన తరవాత దోశెను మధ్యకు మడిచి ప్లేట్లోకి తీసుకుని పిజ్జా కటర్‌తో నచ్చినట్లుగా కట్ చేయాలి ♦ ఇలా తయారు చేసుకున్నాక కొబ్బరి చట్నీ, సాంబారుతో వేడివేడిగా అందించాలి. దోశె పిండి కావలసినవి: మినప్పప్పు – ఒక కప్పు; బియ్యం – రెండున్నర కప్పులు; మెంతులు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: ♦ ముందు రోజు రాత్రి ఒక పెద్ద పాత్రలో మినప్పప్పు, బియ్యప్పిండి, మెంతులు వేసి, తగినన్ని నీళ్లు జతచేసి నానబెట్టాలి మరుసటిరోజు ఉదయం నీళ్లన్నీ వడకట్టేసి, మినప్పప్పు, బియ్యం, మెంతులు మిశ్రమాన్ని గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి ♦ ఉప్పు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, రెండు మూడు గంటలు బాగా నాననివ్వాలి. ఆ తరవాత దోశెలు వేసుకుంటే మెత్తగా వస్తాయి. టిప్స్ దోసె కరకరలాడుతూ, రుచిగా ఉండాలంటే... ♦ ఒక భాగం మినప్పప్పుకు 3 భాగాల బియ్యం నానబెట్టాలి. సగం కప్పు మరమరాలు లేదా అన్నం పేలాలు విడిగా నానబెట్టాలి. నాలుగు గంటలు వీటిని నానబెట్టిన తర్వాత అన్నీ కలిపి మెత్తగా రుబ్బాలి. ♦ కొందరు 2–3 రోజుల వరకు పిండిని ఫ్రిజ్‌లో ఉంచి వాడుతుంటారు. ఇలాంటప్పుడు స్టీలు గిన్నెలో ఉంచితే పిండి కొద్దిగా రంగు మారుతుంది. అలా కాకుండా ప్లాస్టిక్ లేదా సెరామిక్ పాత్రలో పిండిని పోసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ♦ దోసె వేయడానికి ఫ్రిజ్‌లో పిండి వాడాలంటే కనీసం 15 నిమిషాలు ఆ పిండిని బయట ఉంచాలి. ♦ చట్నీతో పాటు తురిమిన ఛీజ్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఇడ్లీ పొడి వంటివి దోసెకు కాంబినేషన్‌గా వడ్డించవచ్చు. -
కోనసీమలో ఘనంగా అట్లతద్ది వేడుకలు
-
అట్లతద్దోయ్ ఆరట్లోయ్...
సందర్భం- నేడు అట్లతద్దె ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదమహాముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. ఇందుకే ఈ నోముకు చంద్రోదయ గౌరీవ్రతమని కూడా పేరు. ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్- ముద్దపప్పోయ్ మూడట్లోయ్...’ ‘పీటకిందా పిడికెడు బియ్యం పిల్లల్లారా జెల్లల్లారా లేచిరండోయ్.. ’ అంటూ ఆటపాటలతో, కోలాహలంగా సాగే నోము అట్లతద్దె. ఈ నోమును కన్నెపిల్లలు సలక్షణమైన భర్త కోసం ఆచరిస్తే, వివాహితలు తమ కాపురం చల్లగా సాగాలని, కడుపు పండాలనీ నోచుకుంటారు. వ్రతవిధానం ఈ వ్రతం చేసేవారు ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో విందారగించి, తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి అమ్మవారికి పది అట్లు నివేదించాలి తర్వాత ఓ ముత్తయిదువకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనమివ్వాలి. (ప్రాంతీయ ఆచారాలను బట్టి ఈ సంఖ్య మారవచ్చు). తర్వాత కింది కథ చెప్పుకుని అక్షతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. వ్రతకథ పూర్వం పాటలీపుత్రాన్ని సుశీలుడనే రాజు పాలిస్తుండేవాడు. వారికి లేకలేక పుట్టిన కుమార్తెకు ‘సునామ’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సునామకు యుక్తవయస్సు రాగానే రాజదంపతులు ఆమెకు ఎన్నో సంబంధాలు చూశారు. అయితే అన్నీ ఏదో ఒక కారణంతో తప్పిపోతుండేవి. దాంతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికెళ్లి ఆత్మహత్యకు సిద్ధమైంది. సరిగ్గా ఆ తరుణంలో ‘‘చంద్రోదయ గౌరీవ్రతం ఆచరించినట్లయితే యోగ్యుడు, సర్వలక్షణ సంపన్నుడైన భర్త లభిస్తాడని, సంసారం సౌఖ్యంగా సాగిపోతుంద’’ని ఒక అదృశ్యవాణి పలుకుతూ, ఆ వ్రతవిధానాన్ని వివరించింది. ఆ మాటలతో ఉత్సాహం తెచ్చుకున్న సునామ ఆశ్వయుజ బహుళ తదియనాడు పొద్దున్నే మేల్కొని, రాత్రి చంద్రోదయం అయ్యేవరకూ కఠిన ఉపవాసం ఉంది. సునామ ఎంతో సుకుమారి కావడంతో సాయంత్రానికల్లా నీరసంతో పడిపోయింది. దాంతో ఆమె సోదరులు చెల్లెలి మీద ప్రేమతో చేరువలో ఉన్న చింతచెట్టుకి ఒక అద్దాన్ని కట్టి, దానికెదురుగా గడ్డిమోపుకు నిప్పంటించి, ఆ మంట వెలుగు అద్దంలో ప్రతిబింబించేలా చేశారు. చెల్లెల్ని లేపి, ‘‘సోదరీ! అదుగో ఆ చింతచెట్టు కొమ్మల్లోంచి చంద్రుడు కానవస్తున్నాడు చూడు’’ అన్నారు. సునామ ఆ వెలుగు చంద్రుడేనని భ్రమించి ఎంగిలిపడింది. తెలియక చేసినప్పటికీ వ్రత ఉల్లంఘన దోషం కారణంగా ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు వయసు ముదిరిన వరులను వెదకడం ఆరంభించారు. దాంతో ఒకనాటి రాత్రి సునామ అడవిలోకి పారిపోయి ఆత్మహత్యకు సిద్ధపడింది. అప్పుడు భూలోక సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమెకు ఎదురై, ఆమెని వారించారు. ఆమె అన్నలు చేసిన పని వల్ల వ్రతోల్లంఘనమయిందనీ, అందువల్లే సరైన సంబంధం కుదరడం లేదని, తిరిగి నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించమని చెప్పి అదృశ్యమయ్యారు. ఈసారి వారు చెప్పిన విధంగా సజావుగా వ్రతాన్ని నిర్వహించింది సునామ. దాంతో ఆమెకు అతి స్వల్పకాలంలోనే అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఉద్యాపన విధానం పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇచ్చి, వారి ఆశీస్సులందుకోవాలి. అట్లే ఎందుకు తినాలంటే... నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి కాబట్టి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారం సాఫీగా సాగుతుంది. గర్భధారణలో సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడేది మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమం కదా, అందులో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. ఈ రెండూ కలిసిన అట్లను వాయన మివ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుందని విశ్వాసం. సంప్రదాయమే కాదు... శాస్త్రీయ దృక్పథం కూడా..! గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున వెన్నెల్లో ఒక చోటికి చేరి బలంగా ఉన్న చెట్లకొమ్మకి ఉయ్యాలలు కట్టి తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. అట్లతద్దిరోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి. అందుకే అట్లతద్దెకు ఆంధ్రదేశంలో అంత ప్రాధాన్యత. - డి.వి.ఆర్