breaking news
assembly budjet
-
కాళ్లు మొక్కితే ఆశీర్వదించండి అంతేగానీ..
హైదరాబాద్: 'గవర్నర్ గారూ.. కాళ్లు మొక్కితే ఆశీర్వదించండి.. అంతేగానీ రాష్ట్రాన్ని ముంచుతుంటే ప్రేక్షకపాత్ర వహించకండి' అన్నారు టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. పచ్చి అబద్దాలను రాస్తే గవర్నర్ యాంత్రికంగా చదివారని విమర్శించారు. 'గవర్నర్ ప్రసంగం చివరిపేజీలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతి రహితంగా.. పారదర్శకంగా నడుస్తోందని ఉంది. ఇంతకన్నా అబద్దం ఉందా' అన్నారు రేవంత్‌రెడ్డి. అవినీతి ఆరోపణలతో ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేశారని ఆయన గుర్తు చేశారు. పారదర్శకతతో ప్రభుత్వం పనిచేస్తే.. అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్‌కు ఎన్ని కాల్స్ వచ్చాయో తెలిపేదని అన్నారు. అలాగే గవర్నర్ ప్రసంగంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారని.. అసలు గవర్నర్ ప్రసంగాన్ని మంత్రివర్గం ఆమోదించిందా అని ప్రశ్నించారు. మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటుచేసి గవర్నర్ ప్రసంగాన్ని ఆమోదించలేదని.. ఇది గవర్నర్ వ్యవస్థనే అపహాస్యం చేయడమని ఆయన దుయ్యబట్టారు. గవర్నర్ గత మూడు ప్రసంగాల్లో ప్రధానంగా ప్రస్తావించిన డబుల్ బెడ్రూం ఇళ్లు, మైనార్టీ రిజర్వేషన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, దళితులకు భూమి లాంటి అంశాలను ఈ ప్రసంగంలో ప్రస్తావించలేదని.. అంటే ఇవేమీ చేయమని గవర్నర్ ప్రసంగం ద్వారా ప్రభుత్వం వెల్లడించిందని రేవంత్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించొద్దని ఆయన గవర్నర్‌ను కోరారు. కనీసం బడ్జెట్లో అయినా గవర్నర్ ప్రసంగంలో కనిపించని కీలక అంశాలకు ప్రాధాన్యత దక్కేలా చూడాలని రేవంత్‌రెడ్డి కోరారు. -
కాళ్లు మొక్కితే ఆశీర్వదించండి అంతేగానీ..