breaking news
Army secrets
-
చంపుకోండి.. కానీ నన్నేం అడగొద్దు!
శ్రీనగర్: ఉగ్రవాదులు తలపై తుపాకీ గురిపెట్టినా ఓ జవాన్ ఆర్మీ రహస్యాలను చెప్పేందుకు నిరాకరించాడు. దీంతో ఉగ్రవాదులు అతడిని దారుణంగా కాల్చిచంపారు. ఈ ఘటన జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకుంది. కుల్గామ్‌లోని ఛురత్ గ్రామానికి చెందిన లాన్స్‌నాయక్ ముఖ్తార్ అహ్మద్ మాలిక్ టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 162వ బెటాలియన్‌లో పనిచేస్తున్నారు. ఈ నెల 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కుమారుడు చనిపోయాడు. దీంతో కుమారుడి కర్మకాండ నిర్వహించేందుకు సోమవారం మాలిక్ ఇంటికి చేరుకున్నారు. ఆ సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా ఆయన ఇంట్లోకి దూసుకెళ్లారు. తలపై తుపాకీ గురిపెట్టి ఆర్మీ స్థావరాలకు సంబంధించిన వివరాలు చెప్పాలని బెదిరించారు. అయితే ఏమాత్రం తొణకని మాలిక్.. ‘కావాలంటే నన్ను చంపుకోండి. కానీ ప్రశ్నలు మాత్రం అడగొద్దు’ అని కరాఖండిగా చెప్పేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఉగ్రవాదులు మాలిక్‌పై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపి పరారయ్యారు. -
అనుష్కతో ఫోన్లోనే పరిచయం
పాకిస్థాన్ నుంచి ఆమె పంపిన డబ్బులనే పటన్ అకౌంట్లో వేశా పటన్ వివరాలిచ్చింది అనుష్కనే రెండోరోజు విచారణలో ఆసిఫ్అలీ హైదరాబాద్ : ‘పాకిస్థాన్ ఏజెంట్ అనుష్క అగర్వాల్‌తో నాకు నేరుగా పరిచయం లేదు.. కేవలం ఫోన్లోనే ఆమె నాతో మాట్లాడేది..’ అని ఆర్మీ రహ స్యాల బహిర్గతం కుట్ర కేసులో నిందితుడైన ఆసిఫ్అలీ నగర నేర పరిశోధక విభాగం అధికారుల విచారణలో వెల్లడించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దేశ ఆర్మీ రహస్యాలను పాకిస్థాన్ ఏజెంట్ అనుష్కకు వెల్లడించిన సికింద్రాబాద్ ఆర్మీ సుబేదార్ పటన్‌కుమార్ పొద్దార్ కేసులో మరో నిందితుడైన ఆసిఫ్‌అలీని చంచల్‌గూడ జైలులో సీసీఎస్ దర్యాప్తు అధికారుల బృందం ఏసీపీ జోగయ్య నేతృత్వంలో మంగళవారం రెండోరోజు విచారించింది. మూత్ర నాళాల వ్యాధితో బాధపడుతున్న అలీని సీసీఎస్ కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించిన నాంపల్లి కోర్టు అతన్ని జైల్లోనే విచారించడానికి అనుమతించిన విషయం తెలిసిందే. దీంతో సోమ, మంగళవారాల్లో దర్యాప్తు అధికారులు ఆయన్ను చంచల్‌గూడ జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గదిలో విచారించారు. కాగా, ఈ విచారణ కోసం వారు ప్రత్యేక ప్రశ్నాపత్రాన్ని రూపొందించుకున్నా రు. ఇంతకుముందు విచారించిన పటన్‌కుమార్ నుంచి రాబట్టిన కొన్ని అంశాల్ని క్రోడీకరించిన అధికారులు అలీని ప్రశ్నిస్తున్నారు. దీంతో కొన్నిసార్లు అతను మౌనంగా ఉంటూ, మరికొన్నిసార్లు కాదు.. అని సమాధానం ఇస్తున్నట్లు తెలిసింది. పటన్తో ఫోన్లో, మెయిల్లో చాటింగ్ చేసిన అనుష్క వివరాలను అలీ నుంచి రాబట్టేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నట్లు సమాచారం. పటన్ వివరాలు, మెయిల్ ఐడీ, బ్యాంక్ అకౌంట్ వివరాల్ని కూడా ఆమే ఇచ్చినట్లు విచారణలో అలీ వెల్లడించినట్లు సమాచారం. ఆమె సూచనల మేరకే తాను పటన్ అకౌంట్లో రూ.70 వేలు వేసినట్లు అలీ తెలిపాడు. అలా ఎందుకు చేశావని ప్రశ్నిస్తే.. చేసిన పనికి ప్రతిఫలంగా తనకూ డబ్బులు అందాయని చెప్పిన అలీ.. ఆ డబ్బులు ఎంత అనేది ఒక్కోసారి ఒక్కోరీతిగా చెప్పినట్లు సమాచారం. విచారణ మరో రెండురోజులు ఇదిలా ఉండగా ఆసిఫ్అలీ ఆనారోగ్యం కారణంగా అతన్ని విచారించడానికి తమకిచ్చిన గడువు సరిపోలేదని, మరో రెండురోజులు పొడిగించాలని సీసీఎస్ అధికారులు నాంపల్లి కోర్టును మంగళవారం కోరారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి మరో రెండురోజులు (బుధ, గురువారం) విచారణ గడువును పొడిగించారు. దీంతో ఈ రెండురోజులు మరింత పకడ్బందీగా అలీని ప్రశ్నించడానికి సీసీఎస్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పాక్ ఏజెంట్‌గా పేర్కొంటున్న అనుష్క అగర్వాల్ ఎవరు.. ఆమె అసలు పేరేమిటి?, ఆమె వలలో ఆసిఫ్అలీ పడటానికి కారణమేమిటి.. ఇంకా ఇందులో ఎవరెవరికి సంబంధాలున్నాయి? కేవలం డబ్బుల కోసమే అలీ ఈ పనికి ఒప్పుకున్నాడా.. మరేమైనా కారణాలున్నాయా? అన్న కోణాల నుంచి సీసీఎస్ దర్యాప్తు ముందుకు సాగనుందని తెలిసింది. కాగా, పీటీ వారెంట్‌పై మీరట్ నుంచి తీసుకొచ్చిన అలీని 18వ తే దీ రాత్రి సీసీఎస్ అధికారులు మళ్లీ అక్కడికే తరలించనున్నారు. ఇదిలావుండగా, ఆర్మీ అధికారులు రెండురోజులపాటు పటన్‌ను విచారించేందుకు కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్మీ అధికారుల విజ్ఞప్తి మేరకు చంచల్‌గూడ జైల్లో ఎప్పుడైనా.. ఏరోజైనా అక్కడి సూపరింటెండెంట్ అనుమతిలో పటన్‌ను విచారించుకోవచ్చని నాంపల్లి కోర్టు తాజాగా ఆదేశించింది. -
ఆసిఫ్అలీ చేతిలో పటన్‌కుమార్ గుట్టు?
సాక్షి, హైదరాబాద్: ఆర్మీ రహస్యాలను పాకిస్థాన్‌కు చెందిన మహిళకు అందజేసిన ఆర్మీ సుబేదార్ పటన్‌కుమార్ పోద్దార్‌కు చెందిన మరిన్ని రహస్యాలు ఇటీవల మీరట్‌లో పట్టుబడ్డ ఆర్మీ సుబేదార్ ఆసిఫ్అలీ వద్ద ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల మీరట్‌లో పోలీసులకు పట్టుబడ్డ ఆసిఫ్‌అలీని హైదరాబాద్ తీసుకువచ్చి విచారించాలని యోచిస్తున్నారు. ఆసిఫ్‌అలీని కస్టడీలోకి తీసుకునేందుకు పి.టి. వారంట్‌ను సీసీఎస్ అధికారులు మీరట్ కోర్టులో వేయనున్నారు. దీని ద్వారా పటన్కుమార్కు సంబంధించిన మరింత సమాచారం తమకు లభ్యం కావచ్చని భావిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాకు చెందిన పటన్‌కుమార్ పూర్వీకులు ఎక్కడి వారు అనే కోణం నుంచి కూడా నిఘా అధికారులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. అదే సమయంలో వీరిద్దరినీ ఆర్మీలో చేర్చుకునే ముందు సివిల్ పోలీసులు సేకరించిన ఎస్బీ రిపోర్టు గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు బంగ్లాదేశ్ కాందిశీకులనే సమాచారాన్ని కూడా నిర్ధారించుకునేందుకు యత్నిస్తున్నారు.