breaking news
Arjuna Pitchaiah
-
పంచెకట్టులో రెచ్చిపోయిన పిచ్చయ్య.. బిత్తరపోయిన బ్రిటిష్ దొరలు
బాల్ బ్యాడ్మింటన్ దిగ్గజం, అర్జున అవార్డు గ్రహీత 104 ఏళ్ల పిచ్చయ్యను ఇంటర్వ్యూ చేసేందుకు ‘సాక్షి’ అనుకోకుండా ఆదివారం ఆయనుంటున్న మనవడి ఇంటికెళ్లింది. పిచ్చయ్య నెమ్మదిగా తన వివరాలు చెప్పారు. ఆయన మనవడు దగ్గరుండి ఆయన చెప్పిన విషయాలను వివరించారు. ‘సాక్షి’తో చివరిసారిగా ఆయన మాటామంతీ.. ‘లగాన్’ సినిమాలో అమీర్ ఖాన్ క్రికెట్ ఆడేందుకు బ్యాట్ పట్టుకుని పంచెకట్టుతో బరిలోకి దిగుతా డు. బ్రిటిష్ దొరలు అతన్ని హేళన చేస్తారు. 2001 నాటి ఈ ముచ్చట చాలామందికి తెలుసు. కానీ సరిగ్గా ఇలాంటి ఉదంతమే నిజ జీవితంలో అంతకు అరవై ఏళ్ల ముందే చోటు చేసుకుంది. వరంగల్ స్పోర్ట్స్: స్వాతంత్య్రానికి పూర్వం 1939– 40లో అప్పటి మద్రాస్‌లో స్టేట్ స్టాఫ్ క్లబ్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీల్లో ఓ ఆటగాడు నిక్కర్, టీ షర్ట్ లాంటి క్రీడా దుస్తులకు భిన్నంగా పంచెకట్టుతో కోర్టులో అడుగు పెట్టాడు. అతడి కాళ్లకు కనీసం బూట్లు కూడా లేవు. అతడిని చూసిన బ్రిటిష్ దొరలు, క్రీడా విశ్లేషకులు.. ‘పొలం దున్నుకునే వాడిని బ్యాడ్మింటన్ కోర్టుకు ఎందుకు రానిచ్చారు’ అని నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ.. మ్యాచ్ ముగిసిన తర్వాత వాళ్లకు అర్థమైంది ‘వీడు వచ్చింది కోర్టును దున్నేయడానికి అని..’ నాటి నుంచి వెనుతిరిగి చూడకుండా కోర్టును దున్నేస్తూ చివరికి బాల్ బ్యాడ్మింటన్‌లో లెక్కకు మించిన అవార్డుల పంట పండించారు. అతనే మన ‘అర్జున’ పిచ్చయ్య. క్లబ్బుల్లో నేర్చుకుని..ఛాంపియన్‌షిప్‌లు గెలిచి పిచ్చయ్య సమకాలీకులెవరూ ఇప్పుడు లేరు. మనవడు చెప్పిన వివరాలు, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పిచ్చయ్య బందరు పట్ట ణంలో మినర్వ క్లబ్, మోహన్ క్లబ్‌లలో బాల్ బ్యాడ్మింటన్ ఆడడం అలవాటు చేసుకున్నారు. 1935–36లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో విజేతగా నిలిచారు. హైదరాబాద్ రాష్ట్రంలో చాదర్‌ఘాట్‌లో జరిగిన పోటీల్లో ఆజంజాహి మిల్లు తరఫున ఆడి గెలిచారు. 1954–55లో హైదరాబాద్‌లోనే జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 15 జాతీయస్థాయి పోటీల్లో కెప్టెన్‌గా వ్యవహరించి 9 ఛాంపియన్షిప్లను గెలుపొందడంలో కీలకపాత్ర వహించారు. హైదరాబాద్ స్టేట్ తరఫున 5, ఆంధ్రప్రదేశ్ తరఫున 9 జాతీయస్థాయి పోటీల్లో ఆడారు. 1966లో జంషెడ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్ తర్వాత పిచ్చయ్య స్టార్ ఆఫ్ ఇండియాగా అవతరించారు. పిచ్చయ్య పేరుపై రాకెట్లు వింబుల్డన్ ఆఫ్ బాల్ బ్యాడ్మింటన్ అని పిలిచే మధురై టోర్నీ ఫైనల్లో నాటి మేటి ఆటగాడు దక్షిణామూర్తిపై విజయం సాధించి విజార్డ్ ఆఫ్ బాల్ బ్యా డ్మింటన్గా పేరుపొందారు. ఆ మ్యాచ్‌లో పిచ్చయ్య ప్రదర్శన చూసి పంజాబ్ జలంధర్‌లో బాల్ బ్యా డ్మింటన్ రాకెట్లు తయారు చేసే కంపెనీ పిచ్చయ్య పేరుపై రాకెట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. అప్పట్లో సొంత ఇల్లే లేదు.. జాతీయస్థాయిలో ఆడిన పిచ్చయ్యకు అప్పట్లో సొం త ఇల్లూ లేదు. అంత తాహతూ లేదు. దీంతో అప్పటివరకు తనకు వచ్చిన వెండి బహుమతులను అమ్మేయగా రూ.19 వేలు రాగా.. వాటితో 1965లో వరంగల్ కృష్ణ కాలనీలో సొంత ఇల్లు కట్టుకున్నట్లు ఆయన స్నేహితులు చెబుతుంటారు. తర్వాత ప్రభు త్వం వరంగల్‌లోని దేశాయిపేటలో 500 గజాల స్థలం కేటాయిస్తే.. పాత ఇల్లు అమ్మి ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఆయనకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. 104 ఏళ్ల వయసులోనూ తన పనులు తానే చేసుకునే వారు. శాకాహారం మాత్రమే తీసుకునేవారు. ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఎక్కడికైనా సైకిల్ పైనే వెళ్లేవారు. -
‘అర్జున పిచ్చయ్య’ ఇక లేరు
వరంగల్ స్పోర్ట్స్: అవార్డునే ఇంటి పేరుగా మలుచుకున్న అర్జున పిచ్చయ్య ఇకలేరు. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పిచ్చయ్య (104) ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాంపూర్ పరిధిలో గల ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలోని తన మనవడి (చిన్న కుమార్తె కొడుకు) ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన అసలు పేరు జమ్మలమడక పిచ్చయ్య. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో 1918లో జన్మించారు. బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బందరులో గడిచింది. క్రీడలపై ఉన్న అమితాసక్తి కారణంగా టెన్త్ ఫెయిల్ అయ్యారు. పదిహేనేళ్ల వయసు వరకు ఫుట్‌బాల్ ఎక్కువగా ఆడేవారు. ఆ తర్వాత అన్నయ్య నారాయణరావు స్ఫూర్తితో బాల్ బ్యాడ్మింటన్ వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ఆ క్రీడలో అర్జున అవార్డును అందుకునే స్థాయికి ఎదిగారు. 1970లో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించగా.. 1972లో అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి చేతుల మీదుగా స్వీకరించారు. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా స్పోర్ట్స్ కోటాలో ఆజంజాహి మిల్లులో ఉద్యోగం కోసం 1947లో వరంగల్‌కు వచ్చిన పిచ్చయ్య ఇక్కడే స్థిరపడిపోయారు. ఈనెల 21న పిచ్చయ్య 104వ జన్మదిన వేడుకలు పలువురు క్రీడ, ఇతర ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఆ రోజు అందరితో ఉత్సాహంగా మాట్లాడిన ఆయన ఆ తర్వాత జ్వరంతో బాధపడుతూ మంచం పట్టి ఆదివారం కన్ను మూశారు. పిచ్చయ్యకు ఇద్దరు కుమార్తెలు కాగా, భార్య సత్యవతి 2007లో మరణించారు.