breaking news
arabella
-
బందరు 'తాజ్'
మచిలీపట్నం టౌన్ (మచిలీపట్నం): షాజహాన్ చక్రవర్తి తన ప్రియురాలైన ముంతాజ్ జ్ఞాపకార్థం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను నిర్మిస్తే బందరు పట్టణంలో బ్రిటీష్ మేజర్ జనరల్ పీటర్ తన ప్రియురాలు అరబెల్లా రాబిన్సన్ కోసం అదే రీతిలో తమ ప్రేమకు ప్రతిరూపంగా 1815వ సంవత్సరంలో ఓ సుందర మందిరాన్ని నిర్మించారు. తాజ్‌మహల్‌లో లేని ఓ విశేషాన్ని అరబెల్లా మందిరంలో ఉంది. అరబెల్లా మృతదేహం దెబ్బతినకుండా ఈజిప్ట్ మమ్మీ తరహాలో ఏర్పాట్లుచేశారు. ఓ అందమైన గాజు పెట్టెలో మృతదేహాన్ని భద్రపరిచి భూమిలో ఓ అరను ఏర్పాటు చేసి దానిలో ఉంచాడు. ప్రియురాలిని చూడలనుకున్నప్పుడు గోడకు ఉన్న ఒక కొయ్య చిలుకను అమర్చి, దానిని తిప్పితే భూమి లోపలి అరలో పెట్టి పైకి వచ్చేలా అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు. మందిరం కథ ఏమిటంటే.. మేజర్ జనరల్ పీటర్ మచిలీపట్నంలో నాటి ఆంగ్లేయ సైన్యాధికారిగా పనిచేశారు. వారి వద్ద కెప్టెన్‌గా పనిచేస్తున్న రాబిన్సన్ కుమార్తె అరబెల్లాను పీటర్ ప్రేమించి వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీనికి అరబెల్లా తండ్రి రాబిన్సన్, మతాధికారులు అంగీకరించలేదు. అయినా వారిద్దరూ సహజీవనం చేశారు. ఈ దశలో పీటర్, రాబిన్సన్ మధ్య కలతలు పెరిగాయి. తండ్రి, ప్రియుడి మధ్య విభేదాల నేపథ్యంలో మానసిక ఒత్తిడితో ఆరోగ్యం దెబ్బతిని 1809 నవంబర్ 6వ తేదీన పీటర్ ఒడిలోనే ఆమె శాశ్వతంగా కన్నుమూసింది. పీటర్ కన్నీటి నడుమ అరబెల్లా మృతదేహాన్ని వివాహ వస్త్రాలతో అలంకరించి అంతిమ వీడ్కోలు జరిపించాడు. అరబెల్లా పాపపు స్థితిలో మరణించిదనే నెపంతో నాటి పరిశుద్ధ యోహాను ఆవరణలో, బందరు కోటలోని ఆంగ్లేయుల శ్మశానవాటికలో మృతదేహాన్ని సమాధి చేసేందుకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆనందపేట సమీపంలో అరబెల్లా మృతదేహాన్ని భద్రపరిచాడు. ప్రేయసి జ్ఞాపకాలు మదిని తట్టినప్పుడల్లా అరబెల్లా మృతదేహాన్ని బయటకు తీసి, తీరని దుఃఖంతో కుమిలిపోయేవాడు. మరణించిన అరబెల్లాను చర్చిలోకి అనుమతించకపోయినా ఆమె మృతదేహాన్ని ఉంచిన చోటే సెయింట్ మేరీస్ చర్చిని నిర్మించాడు. అరబెల్లాను తన ప్రియమైన స్నేహితురాలిగా వర్ణిస్తూ పీటర్ ఓ శిలాఫలకాన్ని సమాధి గోడపై అమర్చాడు. ఆయన మద్రాసుకు బదిలీపై వెళ్తు ఈ పరిశుద్ధ సెయింట్ మేరీస్ చర్చిని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. 1819 నుంచి మతాధికారులు ఆ చర్చిలో అందరూ ప్రార్ధనలు జరుపుకునేలా అనుమతిచ్చారు. ప్రేయసి దూరమైన బాధతో 1819లో పీటర్ మద్రాసులో మృతిచెందాడు. ఆయన పేరుతో మద్రాసులో ఉద్యానవనం ఏర్పాటు చేసి, ఒక రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. పరిశుద్ధ మేరీ చర్చిలో పనిచేస్తున్న పనిమనిషి అనుకోకుండా గోడకు అమర్చిన కొయ్య చిలకను తిప్పడంతో సమాధిపై ఉన్న రాయి తొలగి అరబెల్లా మృతదేహం పైకి రావడాన్ని హఠాత్తుగా చూసి మరణించింది. ఈ విషయం తెలిసిన అప్పటి కలెక్టర్ ఆ ఆరను శాశ్వతం మూయించారు. ప్రస్తుతం చర్చి కూడా మూతపడింది. -
మచిలీపట్నం ప్రేమగాథ
అమర ప్రేమ ప్రేమ ప్రేమనే కోరుకుంటుంది. ప్రేమించే మనసు... మనసునే కోరుకుంటుంది. మనిషి లేకపోయినా ప్రేమను పంచుతుంది మనసు. ప్రేమించే మనిషి కోసం సర్వం అర్పిస్తుంది ప్రేమ. అరబెల్లా - జాన్ ప్యాటర్ల ప్రేమ అలాంటిదే. అరబెల్లా కోసం ప్యాటర్ కట్టిన స్మారక చిహ్నమే అందుకు సాక్ష్యం!! కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం. బంగాళాఖాతంలో అల్పపీడనం పుడితే దాని దిశ, గమనాలను చెప్పడానికి ప్రధానంగా వినిపించే ప్రదేశం మచిలీపట్నం. ఎన్నో అల్పపీడనాలను చూసింది, బంగాళాఖాతం తీరాన ఉన్నందుకు వాయుగుండాల సమాచారానికి కేంద్రమైంది. ఎన్నెన్నో తుఫానులకు అతలాకుతలమైంది. ప్రేమకు ఎదురయ్యేటన్ని ఒడిదొడుకులు మచిలీపట్నానికి కూడా ఎదురయ్యాయి. ఎన్నెన్ని ప్రకృతి విలయాలు వచ్చినా తనను తాను నిలబెట్టుకుంది ఈ పట్టణం. అయితే, ఈ పట్టణంలో ప్రేమబంధంలో చిక్కిన అరబెల్లా- ప్యాటర్లకు మాత్రం వేదనే మిగిలింది. వారి ప్రేమ ఓ విషాదగీతంగా మిగిలింది. అది 19వ శతాబ్దం ప్రారంభం. బ్రిటిష్ పాలనకాలం. మచిలీపట్నం రేవుపట్టణం కావడంతో ఇండియాకు పశ్చిమ దేశాలతో ఎగుమతులు దిగుమతులు విరివిగా జరిగేవి. అందుకు తగ్గట్టు ఫ్రెంచ్, డచ్, బ్రిటిష్ కాలనీలు ఏర్పడ్డాయి. వారి సైనిక స్థావరాలుండేవి. సైనికాధికారులు... కుటుంబాలతో నివసించేవారు. బ్రిటిష్ ఉన్నతాధికారుల కుటుంబాల మధ్య తరచూ గెట్ టు గెదర్లు జరిగేవి. అలాంటి ఓ విందు సమావేశంలో ఒకరినొకరు చూసుకున్నారు అరబెల్లా- జాన్ ప్యాటర్. తొలిచూపులోనే ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగింది. ప్రేమ పరవశం వారి మధ్య బలమైన బంధాన్ని వేసింది. పెద్దల అంగీకారం కరువు! కరువు, దుర్భిక్షం అంటే ఏంటో తెలియని ఊరు అది. కానీ అక్కడ పెద్దలకు పెద్ద మనసు కరువైంది. అరబెల్లా తండ్రి కెప్టెన్ రాబిన్సన్ అక్బర్ పాత్ర పోషించాడు. సలీం అనార్కలి ప్రేమను చిదిమేయడానికి మొఘల్ పాదుషా అక్బర్ నిరంకుశంగా వ్యవహరించినట్లే రాబిన్సన్ కూడా ప్రేమకు ప్రతినాయకుడయ్యాడు. అలాగే నాలుగేళ్లు గడిచాయి. మానసిక వేదనతో అరబెల్లా కుంగిపోసాగింది. ప్యాటర్ మీద ప్రేమ తగ్గడం లేదు, ప్యాటర్కూ అంతే. కనిపించిన ప్రతిసారీ ‘నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాన’ని ఆరాధన పూర్వకంగా అభ్యర్థిస్తున్నాడు ప్యాటర్. ఏళ్లు గడుస్తున్నా తండ్రి మనసు మెత్తబడడం లేదు. క్రమంగా ప్యాటర్లో నిరాసక్తత పెరగసాగింది. తానొక సైనికాధికారి మేజర్ జనరల్ ప్యాటర్ని తప్ప మరేమీ కాదన్నట్లు యాంత్రికంగా మారిపోతున్నాడు. అరబెల్లాకు నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి. తండ్రి ఒప్పుకోకపోయినా సరే ప్యాటర్ను పెళ్లి చేసుకోవడానికే సిద్ధమైంది. ఓ రోజు... అరబెల్లా ఇల్లు వదిలి వచ్చేసింది. అవి ప్యాటర్ జీవితంలో ఆనందక్షణాలు. పెళ్లి గురించి రంగురంగుల కలలు కన్నది అరబెల్లా. ఆ కలలను నిజం చేయడంలో ఆనందం పొందుతున్నాడు ప్యాటర్. ఆమె కోరిక మేరకు లండన్ నుంచి వెడ్డింగ్ గౌన్కూ, రింగ్కూ ఆర్డర్ పంపాడు. పెళ్లి తర్వాత జీవితాన్ని అందంగా ఊహించుకుంటోంది అరబెల్లా. పెళ్లి డ్రస్ వచ్చేసింది. ఇక పై వారంలో పెళ్లి. బ్రిటిష్ అధికారుల గెట్ టు గెదర్‌లో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆహ్వానించాలి. ఎగ్జయిట్‌మెంట్‌తో అరబెల్లాకి ఆ రోజంతా భోజనం చేయాలనిపించడం లేదు. మరుసటి రోజు ఉదయానికి నీరసం. భోజనం లేకపోవడంతోనే అనుకున్నారు. కానీ అది మలేరియా తెచ్చిన నీరసం. అలా మంచం పట్టిన అరబెల్లాకు అదే డెత్బెడ్ అయింది. 1809, నవంబర్ ఆరవ తేదీ ఆమెకు చివరిరోజయింది. తన కోసం అందరినీ వదిలి వచ్చిన అరబెల్లాకు తానేమీ చేయలేకపోయాడు. చేసే అవకాశం ఇవ్వకనే దేవుడు ఆమె ప్రాణాలను తీసుకెళ్లిపోయాడు. అరబెల్లా దేహాన్ని రసాయనాలతో శుభ్రం చేశాడు ప్యాటర్. ఆమె కోరుకున్న వెడ్డింగ్గౌన్ వేసి పెళ్లి కూతురిలా అలంకరించాడు. ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగాడు. అరబెల్లాను పూలచెండును పట్టుకున్నంత జాగ్రత్తగా పైకి లేపి గాజు పెట్టెలో భద్రపరిచాడు. ఇక ఆమెను ఖననం చేయాలి. అయితే... వారి ప్రేమను మత పండిత వర్గం అంగీకరించలేదు. పట్టణంలో ఉన్న ఏ శ్మశానవాటికలోకీ అనుమతివ్వలేదు. కళ్ల ముందు అరబెల్లా ముఖం ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు ఉంది. ప్యాటర్ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఆమె ముఖంలో ఆందోళన పారిపోయి ప్రసన్నత వచ్చింది. అదే ప్రసన్నవదనం కళ్ల ముందు. ‘నిన్నొదిలి నేనెక్కడికీ వెళ్లలేను ప్యాటర్’ అన్నట్లు ఉంది ఆమె ముఖం. అవును... తన కళ్ల ముందు నుంచి అరబెల్లాను ఎవరూ తీసుకెళ్లలేరనే మొండితనం ఆవరించింది. ప్యాటర్ ఓ నిర్ణయానికి వచ్చాడు. పట్టణానికి దూరంగా ఆనందపురంలో డచ్ వారి ఆధీనంలో ఖాళీస్థలం ఉంది. పన్నెండెకరాలకు పైగా ఉన్న ఆ స్థలాన్ని కొన్నాడు. మతపరమైన ప్రార్థనలేవీ లేకనే అరబెల్లాను అందులో ఖననం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లలో (1812 తొలినాళ్లలో) చర్చి నిర్మాణం పూర్తయింది. రోజూ చూసేవాడు! ప్యాటర్ ప్రతిరోజూ ఉదయం ఉద్యోగ విధులకు వెళ్లేముందు చర్చ్‌కి వచ్చి అరబెల్లాను చూసేవాడు, అలాగే సాయంత్రం ఓ సారి చూసుకునేవాడు. చర్చ్‌ని నిర్మించేటప్పుడే ఎప్పుడు కావాలంలే అప్పుడు గాజు పెట్టె పైకి వచ్చేటట్లు ఏర్పాటు చేశాడు. అది ఎలా ఉండేదంటే... పది అడుగుల ఎత్తులో గోడకు ఒక చెక్క పావురాన్ని అమర్చారు. ఆ చెక్క పావురాన్ని పట్టుకుని తిప్పితే గాజుపెట్టె కింద ఉన్న అమరిక మొత్తం పైకి లేస్తుంది. ప్యాటర్ రోజూ నిచ్చెన వేసుకుని చెక్క పావురాన్ని తిప్పి, గాజు పెట్టెలో ఉన్న అరబెల్లాను కళ్లార్పకుండా చూసుకుని, తిరిగి పేటికను మూసేసి వెళ్లేవాడు. అలా కొన్నేళ్లపాటు... అతడికి చెన్నైకి బదిలీ అయ్యే వరకు కొనసాగింది. చెన్నైలో ఉద్యోగం చేస్తూ నెలకోసారి వచ్చి అరబెల్లాను చూసుకునే వాడు ప్యాటర్. అయితే అరబెల్లా కనిపించని చెన్నై నగరంలో ప్యాటర్ ఎక్కువ కాలం జీవించలేకపోయాడు. 1817లో తుదిశ్వాస వదిలాడు. అరబెల్లా జ్ఞాపకాలతోనే జీవించిన ప్యాటర్ను చెన్నై నగరం తన గుండెల్లో జ్ఞాపకంగా దాచుకుంది. చెన్నైలో ఒక పార్కు, ఒక రోడ్డు ఆయన పేరుతో ఉన్నాయి. మచిలీపట్నం - చెన్నపట్నం ఈ అమరప్రేమికుల ప్రేమకు మౌనసాక్ష్యాలు. - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నందం శ్రీనివాస్ అరబెల్లాను చూడలేం! మచిలీపట్నం వెళ్లిన వాళ్లకు అరబెల్లా చర్చ్ (సెయింట్ మేరీస్ చర్చ్) కనిపిస్తుంది, ప్యాటర్ అమర్చిన పావురం బొమ్మ ఉన్న గోడ కనిపిస్తుంది. దాని మీద అరబెల్లా కోసం రాసిన పాలరాతి ఫలకం కనిపిస్తుంది. ఆమెను ఖననం చేసిన చోటు కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అరబెల్లా కనిపించదు. ఎందుకంటే... ఒకసారి చర్చ్ పనివాళ్లలో ఒకరు చెక్క పావురాన్ని తుడవడానికి అటూ ఇటూ తిప్పారు. ఆ పావురాన్ని తిప్పితే శవపేటిక పైకి వస్తుందని తెలియదు. పావురం బొమ్మను తిప్పగానే అరబెల్లా ఉన్న గాజు పెట్టె పైకి లేచింది. భయంతో అక్కడికక్కడే అతడి గుండె ఆగిపోయింది. దాంతో అప్పటి కలెక్టర్ ఆ ఫలకాన్ని శాశ్వతంగా మూయించారు. అరబెల్లా చర్చ్! అరబెల్లా పరలోకాన్ని చేరిన తర్వాత ప్యాటర్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడే వాడు కాదు. అరబెల్లా కోసం ఇంకా ఏదయినా చేయాలని అతడి మనసు తపిస్తుండేది. ఏం చేయాలనేది ఒక రూపు వచ్చాక, ఉద్యోగానికి సెలవు పెట్టి లండన్‌కు వెళ్లాడు. అక్కడ తనకున్న ఆస్తులను అమ్మేసి డబ్బుతో ఇండియాకి వచ్చాడు. ఆమెను ఖననం చేసిన ప్రదేశంలో 18 వేల రూపాయలతో అరబెల్లా స్మారకార్థం చర్చి భవనాన్ని నిర్మించాడు. తాను చెన్నైకి బదిలీ అయి వెళ్లేటప్పుడు దానిని ఈస్ట్ ఇండియా కంపెనీకి స్వాధీనం చేశాడు ప్యాటర్. 1842లో ఆ చర్చ్‌కు సెయింట్ మేరీస్ చర్చ్‌గా పేరు మార్చారు. ఆ నిర్మాణమే అరబెల్లా, ప్యాటర్లను చిరంజీవులను చేసింది. ప్రేమను విశ్వసించే వారు ఆ చర్చ్ ఆవరణలోనే తమ వారిని ఖననం చేస్తుంటారు. రాబిన్సన్ కారణాలివి! అరబెల్లా కంటే జాన్ ప్యాటర్ 18 ఏళ్లు పెద్దవాడు. ఆయనకు అంతకు ముందు పెళ్లయింది. ఇవి పైకి కనిపించిన కారణాలు. అయితే ప్యాటర్ క్యాథలిక్ కాదు ప్రొటెస్టెంట్ అనేది రాబిన్సన్ మనసులో దాగిన అసలు కారణం.