breaking news
anuja Patil
-
మహిళల పోరాటం ముగిసింది
మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: టి20 ప్రపంచకప్‌నుంచి భారత మహిళల జట్టు నిష్ర్కమించింది. సెమీస్ చేరే ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు పోరాడిన భారత్... 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేయగా, భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 111 పరుగులు చేయగలిగింది. ఆఖరి ఓవర్లో విజయానికి 10 పరుగులు అవసరం కాగా, భారత్ 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో వెస్టిండీస్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. టోర్నీలో ఒక్క బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలిచి పాకిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్ చేతిలో ఓడిన భారత్ లీగ్ దశలోనే నిష్ర్కమించింది. కీలక భాగస్వామ్యం: టాస్ గెలిచిన భారత్ వెస్టిండీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. 26 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ స్టెఫానీ టేలర్ (45 బంతుల్లో 47; 5 ఫోర్లు), డాటిన్ (40 బంతుల్లో 45; 5 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 65 బంతుల్లో 77 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే భారత బౌలర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ (4/23), అనూజ (3/16) చెలరేగడంతో విండీస్ 11 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. తొలి బంతితోనే..: లక్ష్యఛేదనలో తొలి బంతికే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ మిథాలీరాజ్ (0) తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు పతనం ప్రారంభమైంది. స్మృతి మందన (27 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించినా, తక్కువ వ్యవధిలో మరో 3 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత అనూజ పాటిల్ (27 బంతుల్లో 26; 1 ఫోర్), జులన్ గోస్వామి (19 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన డాటిన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇంగ్లండ్ విజయం చెన్నై: టి20 మహిళల ప్రపంచకప్‌లో లీగ్ దశను ఇంగ్లండ్ జట్టు అజేయంగా ముగించింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో నెగ్గింది. ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 148 పరుగులు చేసింది. చార్లెట్ ఎడ్వర్డ్స్ (77) రాణించింది. పాకిస్తాన్ 17.5 ఓవర్లలో 80 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సెమీఫైనల్స్‌లో ఆసీస్‌తో ఇంగ్లండ్.. న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడుతాయి. -
తొలి టి20లో భారత మహిళల గెలుపు
34 పరుగులతో ఓడిన లంక రాంచీ: అనూజా పాటిల్ (17 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు; 3/14) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో... శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధిం చింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. జేఎస్సీఏ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (36), సృ్మతి మందన (35) రాణించారు. ఓపెనర్లు మిథాలీ రాజ్ (3), వనిత (12) నిరాశపర్చడంతో భారత్ 4 ఓవర్లలో 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే కౌర్, మందన మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. చివర్లో అనూజా వేగంగా ఆడటంతో టీమిండియాకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది. సుగందిక 3, కౌసల్య 2 వికెట్లు తీశారు. తర్వాత లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 96 పరుగులకే పరిమితమైంది. సురంగిక (41 నాటౌట్) టాప్ స్కోరర్. అనూజ ధాటికి లంక వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడింది. సిరివర్ధనే (18), కరుణరత్నే (14) ఫర్వాలేదనిపించారు. దీప్తి శర్మ 2 వికెట్లు తీసింది. అనూజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టి20 బుధవారం ఇదే వేదికపై జరుగుతుంది.