breaking news
Andhra maha sabha
-
శ్రీబాగ్ ఒడంబడిక అమలే కీలకం!
వర్తమానంలోని అనేక సమస్యలకు చరిత్రలోనే మూలాలు ఉంటాయి. అటువంటి చరిత్రను పనికిమాలినదిగా భావించిన పాలకుల హయాంలో సమస్యలకు పరిష్కారాలు ఎలా లభిస్తాయి? కరవుకాటకాలతో వెనుకబడి పోయిన రాయలసీమ వెతలు ఆంధ్రరాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉన్నాయి. మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన ‘శ్రీబాగ్ ఒడంబడిక’లోని అంశాలను చిత్త శుద్ధితో అమలుకు ప్రయత్నించకపోవడమే ఈ నాటి రాయలసీమ దుఃస్థితికి ప్రధాన కారణం. ఒడంబడిక ప్రకారం దక్కిన రాజధాని ఎటూ చెయ్యి దాటిపోయింది. కనీసం అభివృద్ధికి కీలకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టులన్నా పూర్తవుతాయా?శ్రీబాగ్ ఒప్పందం రాయలసీమ ప్రజల భావోద్వేగాలతో పెనవేసుకున్న అనుబంధం. తొలి భాషా ప్రయుక్త రాష్ట్ర అవతరణకు మూలం. పాలకుల నిరాదరణకు గురైన ఈ ఒడంబడికకు నేటికి 87 సంవత్సరాలు. అప్పట్లో ప్రస్తుత తెలంగాణ నైజాం నవాబు పాలనలో ఉండేది. కోస్తా, రాయలసీమ ప్రాంతాలు మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. భాషాభిమానం, రాజకీయ కారణాలతో తమిళుల ఆధిపత్యంలో ఉన్న మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రంగా విడిపోవాలనే ఆలోచన మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలలో వచ్చింది. ఈ క్రమంలో 1913 (బాపట్ల)లో తొలి ‘ఆంధ్ర మహాసభ’ జరిగింది. అది భాష, సాంస్కృతిక వికాసం కోసం పరితపించిన వేదిక అయినా... అంతర్లీనంగా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు ప్రాంతం విడిపోవాలని దీని నిర్వాహకులకు ఉండేది. కారణాలు ఏమైనా రాయలసీమ ప్రాంతం నుంచి ప్రతినిధులు ప్రారంభంలో సమావేశాలకు హాజరు కాలేదు. అయితే రాయలసీమ భాగస్వామ్యం లేకుండా మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి వేరుపడటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ఆంధ్ర మహాసభ పెద్దలు సీమ ప్రజల మనోగతాన్ని తెలుసుకోవడం కోసం 1917లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సీమలో పర్యటించిన అనంతరం జరిగిన సభలలో సీమ ప్రాంత ప్రతినిధులు పాల్గొన్నారు.మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోవాలన్న మధ్య కోస్తా ఆంధ్ర పెద్దలతో సీమ ప్రాంత పెద్దలు గొంతు కలపలేదు. కారణం అప్పటికే ఆంగ్లేయుల పాలనలో ఉన్న ఆ ప్రాంతం... విద్యాపరంగా అభివృద్ధి చెందింది. అలాగే కాటన్ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీల వల్ల సీమతో పోల్చుకుంటే అభివృద్ధిలో ముందు ఉన్నది. సమీపంలో ఉన్న మద్రాసు నగరాన్ని వదులుకుని అప్పటికే అభివృద్ధిలో మెరుగ్గా ఉన్న కోస్తా ఆంధ్రతో కలిసి రాష్ట్రంగా ఏర్పడటం సీమ పెద్దలకు ఇష్టం లేదు. ఆంధ్రా యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో జరిగిన అనుభవా లతో అనుమానాలు పెరిగాయి. 1926 ఆంధ్రమహాసభ ఆంధ్రా యూనివర్సిటీనీ వెనుకబడిన అనంతపురంలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. మద్రాసు శాసనసభలో ఈ అంశంపై జరిగిన తీర్మానంలో తమిళ శాసన సభ్యులు పాల్గొన వద్దని ఆనాటి ముఖ్యమంత్రి సూచించారు.వాస్తవానికి ఆంధ్ర మహాసభ తీర్మానం ప్రకారం... కోస్తా, సీమ సభ్యులు అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఓటు వేయాలి. అందుకు భిన్నంగా మధ్య కోస్తా సభ్యులు విజయవాడలో ఏర్పాటు చేయాలని ఓటు వేశారు. అయితే ముఖ్యమంత్రి సూచనను పక్కన పెట్టి తమిళ శాసన సభ్యులు కొందరు సీమ సభ్యులకు అనుకూలంగా ఓటు వేయడంతో 25 – 35 ఓట్లతో అనంతపురంలో యూనివర్సిటీ ఏర్పాటుకు తీర్మానం చేశారు. ఆంధ్ర మహాసభ తీర్మానం, అసెంబ్లీ ఆమోదాన్ని కాదని విశాఖలో ఏర్పాటు చేసి తొలి ఉప కులపతిగా రాయలసీమ వారికి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామంతో పప్పూరి రామాచార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి లాంటి వారు... ‘ఉంటే మద్రాసుతో కలిసి ఉందాము లేకపోతె రాయలసీమ రాష్ట్రంగా (ప్రస్తుతమున్న సీమ నెల్లూరు ప్రకాశం జిల్లా, కర్ణాటక లోని బల్లారితో సహా) విడిపోదాం’ అని ప్రతిపాదన చేశారు.ఇదంతా గమనిస్తున్న ఆంధ్రమహాసభలోని పెద్దలు చర్చల నిమిత్తం రెండు ప్రాంతాల సభ్యులతో ఒక కమిటీని నియమించారు. 1937 నవంబర్ 16న మద్రాసు నగరంలోని దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు స్వగృహం (శ్రీబాగ్)లో కమిటీ సమావేశమయ్యింది. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం అవతరించిన తర్వాత పాలనా ప్రాధాన్యతలపై ఒక ఒప్పందం చేసుకున్నారు. అదే ‘శ్రీబాగ్ ఒడంబడిక’. కోస్తా, సీమ ప్రజల పోరాటం... మరో వైపు పొట్టి శ్రీరాములు దీక్ష–ఆత్మార్పణల ఫలితంగా భారత దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న అవతరించింది.శ్రీబాగ్ ఒడంబడికలోని ముఖ్యాంశాలు:1. ఒక ప్రాంతంలో రాజధాని, మరో ప్రాంతంలో హైకోర్టు ఏర్పాటు చేయాలి. ఎంపిక చేసుకునే హక్కు రాయలసీమకు ఉండాలి. 2. కృష్ణా, తుంగభద్రలలో నీటి వినియోగంలో రాయలసీమకు వాటా కేటాయించాలి. అందుకనుగుణంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలి. 3. రెండు ప్రాంతాల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమానత్వాన్ని సాధించేందుకు విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రా యూనివర్సిటీ కింద ఒక కేంద్రాన్ని అనంతపురంలో ఏర్పాటు చేయాలి. 4. జనాభా లెక్కల ప్రకారం కాకుండా సీమ, కోస్తా ఆంధ్రకు సమానంగా నియోజక వర్గాల ఏర్పాటు చేయాలి.ఈ ఒప్పందం ప్రకారం 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేశారు. కానీ, 1956లో తెలంగాణను కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడంతో రాజధాని రాయలసీమ నుంచి తెలంగాణకు మారింది. అలా శ్రీబాగ్ ఒప్పందానికి తూట్లు పడటం ప్రారంభమయ్యింది. రాయలసీమ అభివృద్ధిలో అతి ముఖ్యపాత్ర పోషించే నీటి ప్రాజెక్టులనన్నా పూర్తి చేస్తున్నారా అంటే అదీ జరగడం లేదు. అదేమంటే శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత లేదనీ, అది కాంగ్రెస్ పార్టీలోని రెండు గ్రూపుల మధ్య కుదిరిన ఒప్పందం అనీ కొందరు తప్పుడు ప్రచారం చేస్తు న్నారు. నాటి కాంగ్రెస్ విభిన్న అభిప్రాయాలు ఉన్నవారి సంగమం. కమిటీ సభ్యులు కాంగ్రెస్‌లో ఉన్నంత మాత్రాన ఈ ఒప్పందం ఆ పార్టీ అంతర్గత వ్యవహారంగా తేల్చడం సమంజసమేనా?చదవండి: హానికరమైన కొత్త జాతీయవాదంమద్రాసు ప్రెసిడెన్సీ నుంచి తెలుగు రాష్ట్రం విడిపోవడంలో సీమ ప్రజల త్యాగం ఉన్నది. ప్రస్తుత సీమలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన వారికి ఇప్పటికీ హైదరాబాద్ కన్నా చెన్నై నగరంతోనే అనుబంధం ఎక్కువ. తెలుగు రాష్ట్రం కావాలనే కోరిక పుట్టిన ప్రారంభంలోనే... తమిళులు మదురై కేంద్రంగా తమిళ రాష్ట్రం కోసం తీర్మానం చేశారు. దీనికి కారణం ఎప్పటికైనా చెన్నై తెలుగు వారిదే అవుతుందేమో అని వారి ఆలోచన. నిజానికి పప్పూరి రామా చార్యులు, టీఎన్ రామకృష్ణారెడ్డి ప్రతిపాదన ప్రకారం రాయలసీమ రాష్ట్రం ఏర్పడి ఉంటే (ప్రస్తుత రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, బళ్ళారి, చెన్నై సమీప జిల్లాలతో కలిపి) చెన్నై మహానగరం మనదే అయ్యేది. దీన్నిబట్టి సమీపంలోని చెన్నై నగరాన్ని వదులుకుని తెలుగు రాష్ట్రం కోసం సీమ ప్రజలు త్యాగం చేశారని అర్థం చేసుకోవాలి.చదవండి: వాగ్దానాలు గాలికి వదిలినట్లేనా?ప్రస్తుతం రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం కారణంగా శ్రీబాగ్ ఒప్పందం అంటే రాయలసీమకు రాజధాని మాత్రమే ఆన్న ప్రచారం జరుగుతోంది. ఇది సరికాదు. మరి నీటి ప్రాజెక్టుల సంగతేమిటి? శ్రీశైలం ప్రాజెక్టు నీటిని సత్వరం అందిపుచ్చుకునే విధంగా సిద్ధేశ్వరం ఆలుగునూ, పోతిరెడ్డి పాడునూ వెడల్పు చేయడం; రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నీటిని ఉపయోగించుకునే విధంగా గుండ్రేవుల, కుందూపై రిజర్వాయర్లు నిర్మించడం; గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవడం; చెరువుల పునరుద్ధరించడం వంటి చర్యలే రాయలసీమ కరువుకు శాశ్వత పరిష్కారం. అందుకే రాయలసీమ సమగ్రాభివృద్ధి జరగాలి అంటే కచ్చితంగా శ్రీబాగ్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్రలపై సీమ ప్రాంత సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి అనుగుణంగా పై ప్రాజెక్టులు పూర్తి చేయాలి.శ్రీబాగ్ ఒడంబడికలో పేర్కొన్న విధంగా కృష్ణా, తుంగభద్ర నీటిని సీమకు అందించే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. శ్రీబాగ్ ఒప్పంద స్ఫూర్తితో సీమ సమాజం ఇందుకోసం ముందుకు సాగాలి.- మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త -
తుడుం మోగుతూనే ఉంటుంది మళ్లీ మళ్లీ
బాబేఝరీ... జోడేఘాట్... నిజాం ప్రభువును ఉలిక్కిపడేలా చేసిన గోండు గూడేలు. ఆంధ్రమహాసభ అప్పుడప్పుడే రాజకీయాంశాలపై మాట్లాడు తున్న సమయంలో కొమురం భీం జల్, జంగిల్, జమీన్‌పై హక్కు కోసం పోరాడాడు. ఆదివాసులకు నేతృత్వం వహించి స్వయం పాలన డిమాండ్‌తో నిజాం పాలకుల వెన్నులో వణుకు పుట్టించాడు. ‘మా ఊళ్లో మా రాజ్యం’ అంటూ ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ తాలూకాలోని జోడెన్ ఘాట్, పట్నా పూర్, బాబేఝరి, నర్సాపూర్, కల్లెగాం మొదలైన 12 గూడేల గోండులు జాబేఝరీ లొద్దులో తుడుం మోగించారు. 1940 సెప్టెంబర్ 16న 200 మం ది నిజాం పోలీసులు గాఢ నిద్రలో ఉన్న గోండులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. వెతికి మరీ కాల్చి చంపారు. కొమురం భీం నవల రచయితలు అల్లం రాజయ్య, సాహు పేర్కొన్నట్టు సెప్టెంబర్ 1 నాటికే గోండుల తిరుగు బాటు అణచివేతకు గురికాలేదు. ఆ రోజునే భీం చనిపోలేదు. ఆ పోరాటం సెప్టెంబర్ 16 వరకు సాగి, భీంతోపాటు మరో 30 మంది అమరత్వంతో ఆగి పోయింది. స్థానిక వకీళ్లు, విచారణ కమిటీలు వెల్లడించిన విషయాలతో పాటు, కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డి రాసిన నివేదిక, గోలకొండ పత్రికలో వచ్చిన వార్తలు, స్థానిక న్యాయవాదుల ప్రకటనలు సెప్టెంబర్ 16వ తేదీనే సరైనదని సూచిస్తున్నాయి. ఆదివాసులు పవిత్ర దినంగా భావించే పౌర్ణమినాడు భీం అమరుడయ్యాడని ప్రచారంలో ఉంది. తిథిని బట్టి చూసి నా ఆ ఏడాది సెప్టెంబర్ 16 పూర్వ భాద్రపద పౌర్ణమి రోజే. గోలకొండ పత్రిక అసిఫాబాద్ విలేకరి 1940 అక్టోబర్ 17న రాసిన ‘గోండుల గోడు... కొత్తగా తెలిసిన సంగతులు’ అనే కథనం ప్రకారం...ఒక్క బాబేఝరీలో మాత్రమేగాక మొత్తం జిల్లావ్యాప్తంగా ఘర్పట్టీ, నాగర్పట్టీ, చౌబీనా, బంచ రాయి తదితర శిస్తులను తగ్గించాలని, మాఫీ చేయాలని కోరుతూ భీం తన నలుగురు అనుచరులను పంపాడు. భీం దూతలుగా వచ్చిన ఆ నలుగురిని తాలూక్దార్ మోసంతో బంధించి, ఆ తర్వాత రాత్రి బాబేఝరిపై అమానుష దాడికి పాల్పడ్డాడు. మృతుల సంఖ్య 20 నుంచి 30 మంది వరకు ఉం డొచ్చని అంచనా. 75 ఏళ్ల క్రితం కొమురం భీం రాజేసిన నెగడు ఇంకా మండుతూనే ఉండటానికి కారణం అడవిపై, నీళ్లపై, నేలపై ఆదివాసు లకు హక్కు ఇంకా దక్కకపోవడమే కారణం. 1/70 చట్టాన్ని ధిక్కరించి వేలాది ఎకరాల ఆదివాసి భూములను ఆక్రమించుకున్న వారిని వెళ్లగొ ట్టలేని ప్రభుత్వాలు అడవి బిడ్డలను మాత్రం అడవిలోకి అడుగుపెట్టనివ్వడం లేదు. బాక్సైట్ ఖనిజాల కోసం, ఓపెన్‌కాస్ట్ గనుల కోసం, పోలవరం వంటి ప్రాజెక్టుల కోసం ఆదివాసుల చిరకాల ఆవాసమైన అడవులను కబళిస్తూ సాగి స్తున్న మహావిధ్వంసానికి సమిధలవుతున్నది కూడా వారే. అడవి బిడ్డలను అడవుల నుంచి తరిమేస్తున్నంత కాలం బాబేఝరీ, జోడెన్ ఘాట్లు పునరా వృతమవుతూనే ఉంటాయి. బాబేఝరీ తిరుగుబాటుకు 75 ఏళ్లు నిండిన సందర్భంగా... నుగునూతుల యాకయ్య వరంగల్. ఫోన్: 9010200249