breaking news
Amarasilpi Jakkanna
-
ఉలి అలికిడి విన్నంతనే..
బండరాళ్ల ఊతంగా గుండెలు నిండే మాటలు పలికాడు సి.నారాయణరెడ్డి. అమరశిల్పి జక్కన్న చిత్రం కోసం ఆయన రాసిన ‘ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో / ఈ బండల మాటునా ఏ గుండెలు మ్రోగెనో’ పాటలో రాళ్లు మొత్తం సజీవమూర్తులుగా కనబడతాయి. శిల్పిగా జక్కన్న కూడా చేసింది అదేగా, రాళ్లలో రాగాలు పలికించడం! రాళ్లు ఏ కళంకం అంటకుండా మునీశ్వరుల్లా మూలన ఉన్నాయట. రాయి కదలలేదు, కానీ ఉలి అలికిడికి ఉప్పొంగుతుందట. పైన కఠినంగా ఉన్నా దాన్ని చెక్కే మనిషికి అది వెన్నలా కరిగిపోతుందది. మొత్తంగా దీన్నంతటినీ మనిషి స్వభావానికి అన్వయించాడు సినారె. ‘పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ‘కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు ఉలి అలికిడి విన్నంతనే జలజలమని పొంగిపొరలు ‘పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును ఈ చిత్రానికి సంగీతం సమకూర్చింది ఎస్.రాజేశ్వరరావు. పాడింది ఘంటసాల. 1964లో వచ్చిన ఈ చిత్రానికి బి.ఎస్.రంగా దర్శక నిర్మాత. బి.సరోజాదేవి, అక్కినేని నాగేశ్వరరావు నటీనటులు. -
ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో...
మా ఊరు నల్లగొండ జిల్లాలోని సుద్దాల. మా గ్రామం నుండి నాలుగు కిలోమీటర్లు నడిచి సీతారామపురం గ్రామానికి వెళ్లి చదువుకునేవాళ్లం. ఆ దారిలో నల్లని గుట్టలు ఉండేవి. అక్కడ మేమంతా ఆడుకొనేవాళ్లం. అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను. మొట్టమొదటగా నేను బాగా ఇష్టపడిన పాట అమరశిల్పి జక్కన్న (1964) చిత్రంలోని ‘ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో...’. ఈ పాట విన్నప్పుడల్లా నాలో నాకే ఏవో తెలియని సందేహాలు కలిగేవి. ఈ రాళ్లలో కళ్లు ఎలా ఉంటాయి? ఇలా ఆ పాట నన్ను బాగా ఆలోచింప జేసింది. సి.నారాయణరెడ్డిగారు రాసిన ఈ పాట ‘అమరశిల్పి జక్కన్న’ సినిమాలోకి రాకముందే ‘రామప్ప’ అనే నాటకంలో ఉంది. దానిని పాలగుమ్మి విశ్వనాథంగారు స్వరపరిచారు. సినిమాలో దీనికి మరో బాణీ అందించారు సాలూరి రాజేశ్వరరావుగారు. ఈ పాట నన్ను ఎంతగానో ఇన్‌స్పయిర్ చేసింది. పాట విన్న తర్వాత నాకు గీతరచయితగా మారాలనే కోరిక కలిగింది. అంతేకాదు... టైటిల్స్‌లో నా పేరు సినారెగారి పేరు తర్వాత ఉండాలనే కోరిక కూడా కలిగింది. ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమాతో ఆ కోరిక తీరింది. ఈ నల్లని రాలలో... ఏ కన్నులు దాగెనో/ ఈ బండల మాటున... ఏ గుండెలు మ్రోగెనో... అనే పల్లవిలో కళ్లు చూస్తాయి, రెప్పలు ఆర్పుతాయి, వాటికొక జ్ఞానం ఉంది. అయితే రాళ్లకు అవి ఉండవు కానీ కంటిపాపలలో నల్లదనాన్ని చూసి ఒక సామ్యాన్ని తీసుకున్నారు. కాబట్టి ‘ఈ నల్లని రాలలో’ అని మొదలుపెడతారు. గుండెకి స్పందించే గుణం, ధ్వనించే గుణం ఉంటుంది. కానీ బండకు ఈ రెండు గుణాలు లేవు. స్పందించే గుణం ఉన్నవాటిని స్పందించని గుణం ఉన్నవాటికి ఆపాదించడం ఈ పాట మొత్తంలో మనకు కనిపిస్తుంది. పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి/మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి... ఇది రాళ్ల గురించి రాసిన పాట. రాళ్లు అడవుల్లో కదలకుండా, మెదలకుండా ఉండే జడపదార్థం. అవి ‘పద్మాసనం వేసుకొని తపస్సమాధిలో మునిగి ఉన్న ఋషుల్లాగ ఉన్నాయి’ అనడమనేది అద్భుతమైన ఎక్స్ప్రెషన్. ‘రాత్రి నల్లని రాతి పోలిక’ అంటారు శ్రీశ్రీ. రాతిని ముట్టుకుంటే తెలుస్తుంది. రాత్రిని అనుభవిస్తే తెలుస్తుంది. అలా పోల్చడం గొప్ప విషయం. మునులు ప్రత్యేక ఆశయం కోసం తపస్సు చేస్తారు. చలన పదార్థాన్ని, జడపదార్థమైన రాతితో పోల్చడమనే వినూత్నమైన ఆలోచనా విధానానికి ఈ పాట నిలువుటద్దం. ఇలా పోల్చడం నన్ను బాగా ఆకట్టుకుంది. ‘కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు/ ఉలి అలికిడి విన్నంతనే గలగలమని పొంగిపొరలు’ అనే చరణంలో... ప్రవహించే గుణానికి పలికే శబ్దం ఉంటుంది. ఉదాహరణకు నది ప్రవహిస్తూ గలగలమని శబ్దం చేస్తూంటుంది. అలాంటి శబ్దమే లేని, కదలికే లేని రాళ్లు ఉలి శబ్దం వినగానే గలగలమని ప్రవహిస్తాయి. కదలలేని ఆ రాళ్లకు చెవులు లేవు, రాయి ప్రవహించదు. కానీ చెవులు లేని వాటికి వినబడినట్లు, కదలలేనివి ప్రవహించినట్లు పోల్చుతూ, ఉలి చప్పుడు వినగానే గలగలమని పొంగుతాయనడం అనన్యసామాన్యమైన ఆలోచన. పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును/ జీవమున్న వునిషికన్న శిలలే నయువునిపించును... అసలు రాయి అనేది కఠినమైనది. లోన వెన్న కనిపించును అన్నారు సినారె. రాళ్లు పైకి ఎంత కఠినంగా కనిపించినా, చెక్కుతూ పోతే ఎలా అంటే అలా ఒదిగే ఒక మైనంలాగ ఒదుగుతుందనే విషయం శిల్పాలు చెక్కే శిల్పులకు మాత్రమే తెలిసిన శిల్పరహస్యం. అయితే ఈ విషయం నారాయణరెడ్డిగారే ఎలా పట్టారని నా ప్రశ్న. నా నృషి కురు తే కావ్యం... అంటే కవి... ఋషి అయితే తప్ప కావ్యాన్ని సృష్టించలేడు. ఆయన ఋషి కాబట్టే అంత భావగర్భితంగా రాయగలిగారు. మనిషికి జీవం ఉంది, రాళ్లకు జీవం లేదు. మనుషులకన్నా రాళ్లే గొప్పవని ఒక సార్వకాలీనమైన సామాజిక మధన జనిత సత్యాన్ని వేమనలాగ చివరి వాక్యంలో చేర్చారు. అంటే శిలల కంటే కఠినమైనవాళ్లు ఈ సమాజంలో ఉన్నారన్నారు. ఈ సినిమాలో నాయికా నాయకులకు వివాహమయ్యాక, చిన్న అపోహకు గురై విడిపోతారు. అంటే కథకు అనుసంధానిస్తూ లోక సత్యాన్ని కూడా ఈ పాటలో చెప్పారు సినారె. సంభాషణ : నాగేష్