breaking news
alfred nobel
-
ప్రతి నిమిషం అడిగింది నీ విజయం
ఈరోజు ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతి. ఆ మహానుభావుడి మాటలతోనే స్టోరీలోకి వెళదాం. ‘నాకు వేలాది ఐడియాలు వస్తుంటాయి. అందులో ఏ ఒక్కటో మంచిది కావచ్చు. సక్సెస్ కావచ్చు. ఇంతకు మించిన సంతృప్తి ఏం ఉంటుంది!’ ‘సంతృప్తిని మించిన సంపద లేదు’ హైదరాబాద్‌కు చెందిన ఇరవై ఎనిమిది సంవత్సరాల రాజ్‌కుమార్ స్నేహితులతో కలిసి ‘అగ్రి స్టార్టప్’ ఒకటి మొదలెడదామని రంగంలోకి దిగాడు. అది సక్సెస్ కాలేదు. ఇక అంతే...‘స్టార్టప్’ అనే మాట వినబడగానే బెదిరిపోతాడు. స్టార్టప్ సక్సెస్ కావాలంటే రాసి పెట్టుండాలి అని వేదాంతం కూడా పోతుంటాడు. ఇలాంటి రాజ్‌కుమార్‌లు మీ ఊళ్లోనూ ఉండొచ్చు. కొంతకాలం క్రితం కేరళలోని రేవు పట్టణమైన కొచ్చిలోని ‘ది కిచెన్’ అనే స్వచ్ఛందసంస్థకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది. అదే ఫెయిల్యూర్ ల్యాబ్! సక్సెస్ స్టోరీలు వినడానికి చూపించే ఉత్సాహం ఫెయిల్యూర్స్టోరీల దగ్గరికి రాగానే నీరుగారిపోతుంది. నిజానికి సక్సెస్ కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఫెయిల్యూర్ స్టోరీలు వినాల్సిందే. అనుభవాన్ని మించిన పాఠం ఏముంటుంది! ‘నేను మొదలు పెట్టిన రెండు వెంచర్లు ఫెయిలయ్యాయి. థర్డ్ వెంచర్ సాల్ట్ మ్యాంగో ట్రీ, ఫోర్త్ వెంచర్ ప్లింగ్ మాత్రమే క్లిక్ అయ్యాయి’ అంటాడు ‘ది కిచెన్’ స్థాపకుడు ఆండ్రిన్. కంప్యూటర్ హార్డ్‌వేర్ స్టార్టప్ మొదలుపెట్టాడు నీల్. ఫరవాలేదనిపించింది. అదే ఉత్సాహంతో మరో స్టార్టప్ మొదలుపెట్టాడు. కానీ ఇది తీవ్రమైన నిరాశను మిగిల్చింది. ఏడు నెలల తరువాత ఈ స్టారప్కు చెల్లుచీటి ఇచ్చాడు. అంతమాత్రానా చేతులు దులుపుకోలేదు. ‘ఎక్కడ పొరపాటు జరిగింది’ అని విశ్లేషించుకున్నాడు. ‘చాలామంది స్టార్టప్ ఓనర్లు ఈ పని చేయడం లేదు’ అంటాడు నీల్. ‘అగ్రో బిజినెస్’ స్టార్టప్ మొదలుపెట్టిన రఫీక్ మొదట నష్టాల పాలయ్యాడు. తరువాత లోపాలను సవరించుకొని వ్యాపారాన్ని లాభాల బాట పట్టించాడు. వీరు మాత్రమే కాదు...ముఖేష్దేవ్, జేమ్ప్, జోఫిన్ జోసెఫ్, రికీ జాకబ్...మొదలైన స్టార్టప్ ఓనర్లు తమ విలువైన అనుభవాలను ఈ ఫెయిల్యూర్ ల్యాబ్‌లో పంచుకున్నారు. ‘ఐడియాలు రావడం సులభమే కావచ్చు. కాని వాటిని ఫలవంతం చేయడం అంత సులభమైన విషయమేమీ కాదు’ అంటున్నాడు జీన్ పాల్. బిజినెస్ స్ట్రాటజిస్ట్, మోటివేషనల్ కోచ్‌గా గుర్తింపు సంపాదించిన జీన్‌పాల్ రాసిన ‘ఫ్రమ్ ఐడియా టూ రియాల్టీ’ పుస్తకం బాగా పాప్లర్ అయింది. ది ఎసెన్షియల్స్ ఆఫ్ బిల్డింగ్ ఏ బిజినెస్, ఇట్ స్టార్స్ విత్ పాషన్ అండ్ పర్సస్, సెల్ఫ్ అవేర్నెస్: అండర్స్టాండింగ్ వాట్ డ్రైవ్స్ అండ్ సస్టెన్ యూ, బిల్డింగ్ యువర్ డ్రీమ్ టీమ్ అండ్ బిజినెస్, వై ది వరల్డ్ అండ్ యువర్ బిజినెస్ నీడ్ ఏ మోర్ పాషనెట్ యూ, యువర్ పాషన్ అండ్ పర్పస్ విల్ కీప్ యూ హెల్తీయర్ అండ్ హ్యాపియర్, వై యువర్ స్టోరీ మ్యాటర్స్, డిఫైనింగ్ యువర్ బిజినెస్ మోడల్, గ్రోయింగ్ యువర్ పర్పస్, పాషన్ అండ్ బిజినెస్...వీటిని చాప్టర్లు అనడం కంటే విజయానికి మెట్లు అంటే సరిపోతుంది. ఆకాశంలోకి దూసుకుపోవాలంటే రాకెట్ తయారుచేయగానే సరిపోదు. అందులో ఇంధనం అనివార్యంగా ఉండాలి. ఆ ఇంధనమే ఇన్స్పిరేషన్. ఇది అందించడానికి ‘ఫ్రమ్ ఐడియా టు రియాల్టీ’తో పాటు చూజ్ (ది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ బిఫోర్ స్టార్టింగ్ యువర్ బిజినెస్)–రెయాన్ లివెస్క్, వాట్ ఐ విష్ వెన్ ఐ వాజ్ 20–టినా సిలెగ్, ది ఎంటర్ప్రెన్యూర్ (రోలర్ కోస్టర్)–డారెన్ హార్టి, వాట్ ఇట్ టేక్స్ (హౌ ఐ బిల్డ్ ఏ 100 మిలియన్ డాలర్స్ బిజినెస్ అగేనెస్ట్ వోడ్స్ )–మోయ జోన్స్, స్టార్టింగ్ ఏ బిజినెస్ (లాంచింగ్ ఏ సక్సెస్ఫుల్ స్మాల్ బిజినెస్)–కెన్ కోల్వెల్.....ఇలా ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. పుస్తకం హస్తభూషణం మాత్రమే కాదు... ఆత్మవిశ్వాసం పెంచే ఆయుధం కూడా! ఇక ఆలస్యం ఎందుకు పదండి...ఫెయిల్యూర్ ల్యాబ్స్ నుంచి పాఠాలు నేర్చుకొని గెలుపు జెండా ఎగరేయడానికి. -
ప్రదర్శనకు నోబెల్ వీలునామా
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోబెల్ బహుమతి సృష్టికర్త ఆల్ప్రెడ్ నోబెల్ తాను మరణానికి ముందు రాసిన వీలునామాను త్వరలో ప్రదర్శనకు ఉంచనున్నారు. 1896 మరణించిన ఆయన సాహిత్యం, శాంతి, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్య రంగాల్లో అత్యున్నత కృషి చేసిన వ్యక్తులకు తన పేరు మీద అవార్డును అందించాలని, అందుకోసం తన మొత్తం ఆస్తిని కూడా ఈ అవార్డుల పేరు మీద రాసిపెట్టి చనిపోయారు. అయితే, ఆ వీలునామాను ఇంతవరకు బహిరంగంగా ఎవరూ చూడలేదు. దీంతో ఈ అవకాశాన్ని మార్చి 13 నుంచి స్టాక్ హోమ్‌లో 'లెకసీ' పేరుతో జరగనున్న ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నట్లు నోబెల్ ఫౌండేషన్ పేర్కొంది. చనిపోయే ముందు గొప్ప వ్యక్తులు రాయించిన వీలునామాలన్నీ ఇందులో ప్రదర్శనకు ఉంచనున్నారు. -
పురస్కారం: ఆల్ఫ్రెడ్ నోబెల్ శాంతికాముకుడు
ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది ‘నోబెల్’ పురస్కారం. విజ్ఞానశాస్త్రం, కళలు, వైద్యరంగం, సాహిత్యం, ప్రపంచ శాంతి వంటి రంగాలలో నిష్ణాతులైనవారికిచ్చే గుర్తింపు ఇది. ఈ పురస్కారాన్ని మానవాళికి అత్యంత ప్రయోజనకరమైన ఆవిష్కరణలు చేసిన వారికి ఇస్తారు. ఏటా నామినేషన్లు అక్టోబరులో మొదలవుతాయి. నోబెల్ పురస్కారం ఆవిష్కర్త, వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ (లార్డ్) బెర్నార్డ్ నోబెల్. ఇతడు స్వీడన్ దేశానికి చెందిన రసాయన శాస్త్రజ్ఞుడు. నోబెల్... రసాయన శాస్త్రంలో, ప్రధానంగా విస్ఫోటకాల (ఎక్స్‌ప్లోజివ్స్) రంగంలో అనేక ఆవిష్కరణలు, పేటెంట్ల ద్వారా విశేషంగా ధనం ఆర్జించాడు. ఆ ధనాన్ని ఒకచోట మూలధనంగా ఉంచి, ‘నోబెల్ ఫౌండేషన్’ అనే సంస్థ ద్వారా ఆ మూల ధనంపై వచ్చే వార్షిక వడ్డీని నోబెల్ పురస్కారాల రూపంలో ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఏటా ఈ పురస్కారాలను వివిధ రంగాలలో నిష్ణాతులైన మేధావులకు అందజేయవలసిందిగా వీలునామా రాసి గతించాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్... తాను జీవితకాలమంతా సంపాదించిన ధనాన్ని తృణప్రాయంగా పరిత్యజించటం వెనుక బలమైన కారణమే ఉంది. దానిని తెలుసుకుంటే మానవాళికంతటికీ కనువిప్పు కలుగుతుంది. అందువల్ల ఆల్ఫ్రెడ్ నోబెల్ జీవితగాధను చదివి తీరవలసిందే! ఆల్ఫ్రెడ్ నోబెల్ బాల్యం నోబెల్ శాస్త్రజ్ఞుడి పూర్తి పేరు ఆల్ఫ్రెడ్ బెర్నాడ్ నోబెల్ (తర్వాతి కాలంలో ఈయనకు ‘లార్డ్’ అనే బిరుదు వచ్చింది). ఇతడు స్వీడన్ దేశంలోని స్టాక్‌హోమ్ పట్టణంలో 1833వ సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన జన్మించాడు. ఇతని తండ్రి ఇమ్మాన్యుయేల్ నోబెల్, తల్లి కెరోలీనా ఆండ్రీ. ఇమ్మాన్యుయేల్ ఇంజనీరు, రసాయన శాస్త్రజ్ఞుడు. పేలుడు పదార్థాలు తయారుచేసే కంపెనీకి అధిపతి. ఎనిమిది మంది సంతానంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ నాల్గవవాడు. ఇమ్మాన్యుయేల్ పేలుడు పదార్థాలు తయారుచేసి విక్రయిస్తూ ఉండటంతో, ఆల్ఫ్రెడ్ నోబెల్ కూడా అదే రంగం మీద ఆసక్తి పెంచుకున్నాడు. పేలుడు పదార్థాల తయారీలోనే స్థిరపడ్డాడు. ప్రస్తుతం మనదేశంలో అందరి నోళ్లలోనూ నానుతున్న ‘బోఫోర్స్’ కంపెనీ కూడా ఆల్ఫ్రెడ్నోబెల్ స్థాపించినదే. ఇమ్మాన్యుయేల్ స్థాపించిన కంపెనీకి నష్టాలు వాటిల్లి దివాలా తీయటంతో అతడు స్టాక్‌హోమ్ నగరం విడిచి రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ చేరి, అక్కడ వ్యాపారం కొనసాగించాడు. రష్యాకు నీటిలో పేలే విస్ఫోటకాలను సరఫరా చేశాడు. క్రిమియన్ యుద్ధం ముగియగానే ఆ కంపెనీ మళ్లీ దివాలా తీసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అతడు కంపెనీని తిరిగి స్వీడన్‌కు మార్చాడు. ఆల్ఫ్రెడ్ చిన్నతనం నుంచి రసాయన శాస్త్రం అంటే ఇష్టపడేవాడు. ఆ శాస్త్రంతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, జర్మన్, రష్యన్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. ప్రాథమిక విద్య తర్వాత ఆల్ఫ్రెడ్ పారిస్‌లో హైస్కూల్ విద్యనభ్యసించాడు. 18 ఏళ్ల వయసులో ఉన్నత విద్యకోసం అమెరికా చేరుకున్నాడు. అక్కడ జాన్ ఎరిక్సన్ అనే రసాయన శాస్త్రవేత్త దగ్గర రసాయన శాస్త్రంలో ఉన్నత విద్యనభ్యసించి పరిశోధనలు చేపట్టాడు. అమెరికాలో ‘గ్యాస్మీటర్’ను కనిపెట్టి పేటెంట్ సంపాదించాడు. అదే అతడి మొదటి పేటెంట్. ఇదే తరుణంలో ఇమ్మాన్యుయేల్ కంపెనీ మళ్లీ నష్టాల బాట పట్టడంతో ఆల్ఫ్రెడ్ స్వదేశానికి వచ్చి, సోదరులతో కలిసి తండ్రి కంపెనీని లాభాల బాటలో పెట్టే బాధ్యత తీసుకున్నాడు. కొత్త పేలుడు పదార్థాలను కనుగొనటంలో నిమగ్నమయ్యాడు. అలా తయారైనదే డైనమైట్. డైనమైట్ తర్వాత... ‘నోబెల్’కు ముందు..! డైనమైట్ను కనుక్కున్న తర్వాత, దానిని క్షేమకరంగా ఉపయోగించే పద్ధతుల మీద సోదరులతో కలిసి అనేక ప్రయోగాలు చేశాడు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఈ ప్రక్రియలో నోబెల్ ప్రయోగశాలలో 1888 సంవత్సరంలో భారీ విస్ఫోటనం సంభవించింది. ఆ ప్రమాదంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ తప్పించుకున్నాడు కానీ అతని సోదరుడు ‘లుడ్విగ్ నోబెల్’ మరణించాడు. అయితే ఈ వార్తను ప్రచురించే క్రమంలో పొరపాటు దొర్లింది. పారిస్ నుంచి వెలువడే ఒక ఫ్రెంచి పత్రిక ఈ వార్తను ‘మృత్యు వ్యాపారి, నరహంతకుడు నోబెల్ అస్తమయం’ అని పెద్ద అక్షరాలతో ప్రకటించింది. ఆ వార్త చూసిన ఆల్ఫ్రెడ్ హతాశుడయ్యాడు. తాను నైట్రో గ్లిజరిన్‌ను క్షేమకరమైన విధానంలో విస్ఫోటనకు ఉపయోగించేలా చేద్దామనుకుంటే, ఆ ప్రయత్నం ఇంతటి అపవాదు తెచ్చిందా అని తీవ్రంగా బాధపడ్డాడు. ఆ విచారం నుంచి బయటపడకపోగా జీవితంపై విరక్తిని పెంచుకున్నాడు. మానవాళికి ప్రయోజనం చేకూరే పని ఏదైనా చేయాలని ఆశించాడు. దాని ఫలితమే నోబెల్ ఫౌండేషన్. డైనమైట్ కథ ‘డైనమైట్’ను ఆల్ఫ్రెడ్ నోబెల్ 1867లో కనుగొన్నాడు. డైనమైట్లోని ముఖ్యమైన పేలుడు పదార్థం నైట్రో గ్లిజరిన్. ఇందులోని పేలుడు స్వభావాన్ని మొదట కనుగొన్నది ఆస్కారియో సొబ్రీరో. నైట్రో గ్లిజరిన్‌ను క్షేమకరంగా ఉపయోగించటానికి దానిని కీసెల్ ఘుర్ అనే తేలికగా ఉండే బూడిద వంటి మట్టి కలిపి ప్రయోగించాడు నోబెల్. దానికి ‘డైనమైట్’ పేరుతో పేటెంట్ హక్కులు పొందాడు. ఇలాంటి ప్రయోగాల ద్వారా అతడు 16,87,337 బ్రిటిష్ పౌండ్ల ధనం (సుమారు 472 మిలియన్ల అమెరికన్ డాలర్లు) ఆర్జించాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించి మరికొన్ని... నోబెల్ వివాహం చేసుకోలేదు. ఆయన మరణించేనాటికి 90 కంపెనీలకు వ్యవస్థాపక భాగస్వామి, 355 పేటెంట్లకు హక్కుదారుడు. బోఫోర్స్ కంపెనీని మొదట్లో ఇనుము కర్మాగారంగా ప్రారంభించి, తర్వాత ఆయుధాల ఫ్యాక్టరీగా మార్చాడు. ఇప్పటికీ ఆ కంపెనీ ఆయుధాలు, విమానాలను ఉత్పత్తి చేస్తూనే ఉంది. ‘నోబెల్ బహుమతి’ దిశగా అతడిని ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన కార్యదర్శి ‘బెర్తా’. ఆమె రచయిత్రి కూడ. ఒక్కో నోబెల్ పురస్కారం విలువ సుమారు 3 లక్షల 50 వేల అమెరికన్ డాలర్లు (సుమారు 1 కోటి 75 లక్షల రూపాయలు). ఈ బహుమతిని స్టాక్‌హోమ్‌లో అందజేస్తారు. ఆల్ఫ్రెడ్ నోబెల్, 1896వ సంవత్సరంలో నోబెల్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి, తాను సంపాదించిన ధనంలో 95 శాతం నగదును నోబెల్ పురస్కారాల కోసం వినియోగించడానికి వీలుగా బ్యాంకులో కుదువబెట్టాడు. ఆ ధనం మానవాళికి ఉపయోగపడే విధంగా ఒక నియమావళిని రూపొందించాడు. ఇందుకు అతడికి సాకారం కాని కల కూడా తోడైంది. నోబెల్‌కి చిన్నతనం నుంచి శరీరారోగ్యం బాగుండేది కాదు. దాంతో తాను వైద్యుడై శరీర ధర్మశాస్త్రం (ఫిజియాలజీ) అభ్యసించాలనే ఆశయం నెరవేరలేదు. అందుకే ఆ రంగంలో కృషి చేసిన వారికి బహుమతి ఇవ్వడం ద్వారా ఆ ఆశను నెరవేర్చుకున్నాడు. నోబెల్ ఫౌండేషన్ ద్వారా... భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవ రసాయన శాస్త్రం, జీవ శాస్త్రం, జన్యు శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం వంటి విజ్ఞాన శాస్త్ర విభాగాలు, కంప్యూటర్, ఎలక్ట్రికల్ వంటి ఇంజనీరింగ్ విభాగాలు, చరిత్ర, అర్థశాస్త్రం, సాహిత్యం వంటి ఆర్ట్స్ విభాగాలు, సామాజిక ఆవిష్కరణలు, ప్రపంచ శాంతి మొదలైన విభాగాలలో సేవలందించిన వారికి మొత్తం ఆరు కేటగిరీలలో నోబెల్ బహుమతులు ఇస్తున్నారు. ప్రశాంతంగా జీవించడానికి... నోబెల్ ఫౌండేషన్ రూపకల్పన తర్వాత ఆల్ఫ్రెడ్ నోబెల్ తన చివరి రోజులను అజ్ఞాతంగా గడపటానికి నిశ్చయించుకొని ఇటలీలోని ‘శాన్ రిమో’ అనే ఊరికి వెళ్లాడు. అక్కడ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఆల్ఫ్రెడ్ నోబెల్... సెరిబ్రల్ హెమరేజ్ (మెదడులో రక్తనాళాలు చిట్లడం)కి గురై 1896వ సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన కన్నుమూశాడు. ఆయన సంస్మరణార్థం ఏటా ఇదేరోజున నోబెల్ బహుమతుల ప్రదానం జరుగుతుంది. ఇదీ క్లుప్తంగా ఆల్ఫ్రెడ్ నోబెల్ జీవితం. అతడి జీవితంలో ఆసక్తి కలిగించే మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ మంచి సాహిత్యాభిమాని, రచయిత. రసాయన శాస్త్ర ప్రయోగాలతో తలమునకలై ఉన్నప్పటికీ, కొంత సమయాన్ని సాహిత్య పఠనం, రచనా వ్యాసంగానికి కేటాయించేవాడు. ప్రముఖ సాహితీకారుల రచనలు చదవటంతోపాటు వాటిపై పద్య రూపంలో వ్యాఖ్యలు రాసేవాడు. ఆల్ఫ్రెడ్ నోబెల్ రచనలలో 1895లో రాసిన ‘ద పేటెంట్ బ్యాసిల్లస్’, 1896లో ‘నెమిసిస్’ పేరుతో రాసిన విషాదాంత రూపకం ముఖ్యమైనవి. ఇప్పటి వరకు నోబెల్ అందుకున్న ప్రముఖులలో మనదేశానికి చెందినవాళ్లు 13 మంది. వీరిలో తొమ్మిదిమంది భారతపౌరులు, నలుగురు భారత సంతతికి చెందిన వారు. వారి గురించిన సమగ్రసమాచారంతో కూడిన కథనాలను ప్రతి వారం ఇదే శీర్షికలో తెలుసుకుందాం. - డా॥రెబ్బాప్రెగడ రామాంజనేయులు విశ్రాంత రసాయనాచార్యుడు