breaking news
Air India pee gate case
-
శంకర్ మిశ్రాను పట్టించిన సోషల్ మీడియా.. బెంగళూరులో అరెస్ట్
ఎయిరిండియా విమానంలో వృద్ద మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన కేసులో శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత మహిళ ఫిర్యాదుతో కేసు విచారణ చేపట్టేందుకు బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు మిశ్రాకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు అతని కోసం దేశ వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే లుక్ అవుట్ నోటీసులతో పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మిశ్రా బెంగళూరులో ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ప్రత్యేక బృందాల సాయంతో బెంగళూరుకు చెందిన ఓ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం దేశ రాజధానికి తరలించారు. మిశ్రాను పట్టించిన సోషల్ మీడియా లుక్ అవుట్ నోటీసులతో బెంగళూరులో తలదాచుకున్న శంకర్ మిశ్రా పోలీసులకు దొరక్కుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. క్రెడిట్ కార్డులను వినియోగించుకున్నాడు. అయితే తన స్నేహితులతో కమ్యూనికేట్ అయ్యేందుకు సోషల్ మీడియాను వినియోగించడంతో అతని ఆచూకీ లభ్యమైంది. సోషల్ మీడియా అకౌంట్స్ ఐపీవో అడ్రస్‌లను ట్రేస్ చేసిన పోలీసులు మిశ్రాను అరెస్ట్ చేశారు. (క్లిక్ చేయండి.. అమెజాన్: భారత్‌లో ఊడిన ఉద్యోగాల సంఖ్య ఇది) -
వాట్సాప్ చాట్ విడుదల, మూత్ర విసర్జన ఘటనలో శంకర్ మిశ్రాను ఇరికించారా?
ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు శంకర్ మిశ్రాపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దీంతో అతని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మరోవైపు ఎయిరిండియా విమానం చెల్లించే నష్టపరిహారం కోసమే సదరు వృద్ధ మహిళ ఇలా చేస్తున్నట్లు మిశ్రా ఆరోపిస్తున్నారు. అందుకు ఆధారాలు ఉన్నాయంటూ శంకర్ మిశ్రా - వృద్ధ మహిళ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను మిశ్రా తరుపు వాదిస్తున్న లాయర్లు విడుదల చేశారు. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ కంపెనీ వెల్స్ ఫార్గోలో శంకర్ మిశ్రా చాప్టర్ వైస్ ప్రెసిడెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే విదేశాల్లో స్థిరపడ్డ మిశ్రా భారత్‌కు వచ్చేందుకు న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఎక్కాడు. అప్పటికే పూటుగా మద్యం సేవించి ఉన్న మిశ్రా విచక్షణ కోల్పోయి పక్కసీట్లో ఉన్న వృద్ధ మహిళ దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. అనంతరం తాను చేసింది క్షమించరాని నేరమని, పోలీసులకు ఫిర్యాదు చేయొద్దంటూ బాధితురాల్ని వేడుకున్నాడు. ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. డబ్బుల కోసమే ఇదంతా కానీ జనవరి 4న ఎయిరిండియా సంస్థ మిశ్రాపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పీ-గేట్ వ్యవహారంలో శంకర్ మిశ్రా సైతం తన లాయర్లు ఇషానీ శర్మ, అక్షత్ బాజ్‌పాయ్ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. శంకర్ మిశ్రా - మహిళ మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను బహిర్ఘతం చేశారు. ఆ వాట్సాప్ చాట్ వివరాల మేరకు.. నవంబర్ 28న నిందితుడు బాధితురాల్ని బట్టలు, ఇతర బ్యాగ్‌లను శుభ్రం చేసి నవంబర్ 30న డెలివరీ చేసినట్లు చెప్పారు. అంతేకాదు సదరు మహిళ ప్రయాణికురాలు మిశ్రా మూత్ర విసర్జన చేశాడనే కారణం కాదని, కేవలం ఎయిరిండియా ఎయిర్‌లైన్ చెల్లించే నష్టపరిహారం కోసమే డిసెంబర్ 20న ఫిర్యాదు చేసినట్లు మిశ్రా లాయర్లు ఆరోపిస్తున్నారు. డబ్బు కూడా పంపించాడు తాను చేసిన తప్పును సరిద్దిద్దుకునేందుకు..మహిళ కోరినట్లుగా అంటే నవంబర్ 28న మిశ్రా పేటీఎమ్ ద్వారా డబ్బు చెల్లించాడు. అయితే దాదాపు నెల రోజుల తర్వాత డిసెంబర్ 19న ఆ మహిళ కుమార్తె డబ్బును తిరిగి ఇచ్చిందని లాయర్లు పేర్కొన్నారు. ఎయిరిండియా క్యాబిన్ సిబ్బంది సమర్పించిన వాంగ్మూలాల్లో కూడా ఇద్దరి మధ్య రాజీ కుదిరిందన్న విషయాన్ని ధృవీకరించినట్లు గుర్తు చేశారు. నా ఇష్టానికి విరుద్దంగా మూత్ర విసర్జన సంఘటన తర్వాత ఎయిరిండియా సిబ్బంది మిశ్రాను తన వద్దు తీసుకువచ్చారని విమానయాన సంస్థకు చేసిన ఫిర్యాదులో బాధితురాలు తెలిపింది. శంకర్ మిశ్రాను ల్యాండింగ్‌లో వెంటనే అరెస్టు చేయాలని తాను డిమాండ్ చేసినప్పటికీ, అతనితో క్షమాపణలు చెప్పించేలా క్రూ సిబ్బంది నా ఇష్టానికి విరుద్ధంగా అతనిని నా వద్దకు తీసుకొచ్చారని మహిళ ఫిర్యాదులో రాసింది. ఏడ్చాడు.. ప్రాధేయ పడ్డాడు మూత్ర విసర్జన చేసిన వెంటనే మిశ్రా పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని కాళ్లపై పడ్డాడు. మీరు చేసింది క్షమించరాని నేరం అని మిశ్రాను అనడంతో ఏడుస్తూ ప్రాధేయపడ్డాడని, మిశ్రా చర్యతో షాక్ గురైనట్లు ఎయిరిండియాకు చేసిన ఫిర్యాదులో వెల్లడించింది. అతనిని అరెస్టు చేయాలని పట్టుబట్టడం, విమర్శలు చేయడం నాకు కష్టంగా అనిపించిందని తెలిపింది. ఇక ఆమె షూస్, డ్రైక్లీనింగ్ కోసం డబ్బులు తీసుకునేలా ఎయిర్‌లైన్ సిబ్బంది ఆమె ఫోన్ నంబర్‌ను శంకర్ మిశ్రాకు పంపింది. మిశ్రాకు ఇచ్చే డబ్బుల్ని సైతం తిరిగి వద్దని చెప్పినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.