అశ్విన్ లోటు కనబడలేదు: అగార్కర్
లండన్: చాంపియన్ ట్రోఫిలో భారత్ ఆడిన రెండు మ్యాచుల్లో అశ్విన్ తుది జట్టులో లేకపోయినా అది బౌలింగ్ పై అంతగా ప్రభావం చూప లేదని భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డాడు. గత కొద్దీ కాలంగా భారత బౌలింగ్ విభాగం పేస్ బౌలర్లతో పటిష్టంగా ఉందన్నాడు. టోర్నీకి ముందు కొంత మంది భారత ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోయినా అసలు పోరు మొదలయ్యే సరికి గాడిలో పడ్డారని అగార్కర్ పేర్కొన్నాడు. శ్రీలంక పై భారత్ ఓడినా టైటిల్ కోహ్లీ సేనదే అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్ గడ్డపై బాల్ స్వింగ్ అవ్వకున్నా.. బంతులు వైవిధ్యంగా వేసే బూమ్రా, ఉమేశ్ యాదవ్‌లు జట్టుకు బలమన్నాడు. ఇక బ్యాటింగ్‌లో ఓపెనర్స్ శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు అధ్భుతంగా రాణిస్తున్నారని కితాబిచ్చాడు. గత కొద్ది కాలంగా అంతగా ఆకట్టుకొని రోహిత్ ఫామ్‌లోకి రావడం జట్టుకు శుభపరిణామని అగార్కర్ తెలిపాడు. ఇక ఆదివారం భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్ ఇరు జట్లకు కీలకం అని అభిప్రాయపడ్డాడు. రెండు జట్లు బలంగా ఉన్నాయని, ఎవరూ రాణిస్తే వారినే విజయం వరిస్తుందని అగార్కర్ పేర్కొన్నాడు.