breaking news
Adventure sport
-
రాష్ట్రంలో బంగీ జంప్!
సాక్షి, హైదరాబాద్: బంగీ జంప్.. నడుముకు తాడులాంటి దాన్ని కట్టుకుని అంతెత్తు నుంచి కింద ఉన్న నీటిలోకి దూకే ఓ సాహస విన్యాసం. మన దేశంలో అంతగా ప్రాచుర్యంలో లేనప్పటికీ విదేశాల్లో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే సాహస క్రీడ. ఇప్పుడలాంటి అద్భుత అవకాశం మన రాష్ట్రంలో అందుబాటులోకి వస్తోంది. అయితే, విదేశాల్లో ఉన్నట్టుగా ఏ కొండ అంచు నుంచో దూకేలా మాత్రం కాదు. అలనాడు నిజాం జమానాలో రూపుదిద్దుకుని వయసైపోయి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఓ పురాతన వంతెన పైనుంచి. సాహస క్రీడలంటే ఎంతో ఆసక్తి చూపే యువతను ఆకట్టుకునేందుకు రాష్ట్రంలో అడ్వెంచర్ టూరిజంను అభివృద్ధి చేయాలనుకున్న ప్రభుత్వం.. ఈ వంతెనను అందుకు వేదిక చేసుకోవాలని నిర్ణయించింది. ఆర్మూరు-నిర్మల్ మధ్య సోన్ వద్ద గోదావరిపై 1936లో ఓ భారీ వంతెనను నిర్మించారు. కిలోమీటరుకు మించిన పొడవున్న ఈ వంతెన నిర్మాణ కౌశలం కూడా కళాత్మకంగా ఉంటుంది. ఇంతకాలం సేవలందించిన ఈ వంతెన వయసైపోయిందన్న ఉద్దేశంతో ప్రభుత్వం దానికి సమాంతరంగా కొత్త వంతెనను నిర్మించి వినియోగంలోకి తెచ్చింది. ప్రస్తుతం పాత వంతెన మీదుగా వాహనాలను అనుమతించడం లేదు. కానీ ఇప్పటికీ అది పటిష్టంగానే ఉంది. దిగువన గోదావరి, చుట్టూ అందమైన ప్రకృతి, కళాత్మకంగా నిర్మితమై ఉన్న ఆ వంతెనను సాహస క్రీడలకు వినియోగించుకోవాలని ఇటీవల పర్యాటక శాఖ భావించింది. దీనికి ప్రభుత్వం అనుమతించడంతో కార్యాచరణకు సిద్ధమైంది. ఆ వంతెన మీదుగా నదిలోకి మినీ బంగీ జంపింగ్‌కు అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. దీంతోపాటు వంతెన దిగువన నుంచి పైకి రాక్ క్లైంబింగ్లాంటివి ఏర్పాటు చేయనున్నారు. వంతెన మీద ఆ ప్రాంత సంప్రదాయాల్ని ప్రతిబింబించే ప్రదర్శనలు, చేతి వృత్తుల ఉత్పత్తులతో ప్రదర్శనలు, ఇతర మేళాలు ఏర్పాటు చేయనున్నారు. దాని మీదుగా కేవలం సైక్లిస్టులు, పాదచారులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. త్వరలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఆ వంతెన ప్రాంతాన్ని సందర్శించి స్థానిక అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ప్రస్తుతం దిగువన గోదావరిలో నీళ్లు లేవు. వచ్చే వానాకాలంలో నీళ్లు చేరిన తర్వాత అవి ఎప్పుడూ నిల్వ ఉండేలా దిగువన మినీ రబ్బర్ డ్యాం నిర్మించే యోచనలో ఉన్నారు. -
‘ఉట్టి’.. ఇకపై సాహసక్రీడ..!
ప్రకటించిన బీజేపీ సర్కార్ సాక్షి, ముంబై: ఉట్టి ఉత్సవాలను ‘సాహస క్రీడ’ల జాబితాలో చేర్చాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం క్రీడా శాఖ మంత్రి వినోద్ తావ్డే ప్రకటించారు. ఉట్టి ఉత్సవాల్లో గోవిందా బృందాల మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది. నిర్వాహకులు అందజేసే నగదు బహుమతి, ఇతర పారితోషికాలకు ఆశపడి బృంద సభ్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. అనేక మంది పైనుంచి కిందపడి గాయపడడం, మృతి చెందడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉట్టి ఉత్సవాన్ని సాహస క్రీడల జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ముంబై హైకోర్టు ఉట్టి ఉత్సవాలపై అనేక ఆంక్షలు విధించింది. కోర్టు నిర్ణయాన్ని నగరంలోని అన్ని సార్వజనిక గోవిందా బృందాలు వ్యతిరేకించాయి. దీంతో కోర్టు కొన్ని నియమాలు సడలించడంతో ఈ ఏడాది ఎప్పటిలానే ఉత్సవాలు నిర్వహించారు. కాని ఈ ఉట్టి ఉత్సవాలను సాహస క్రీడా జాబితాలో చేర్చాలనే డిమాండ్ మరోసారి తెరమీదకు వచ్చింది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో మానవ పిరమిడ్లు నిర్మించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కాని మన దేశంలో అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎక్కడ కనిపించదు. కాగా, దీన్ని సాహస క్రీడల జాబితాలో చేర్చడంవల్ల నియమ, నిబంధనాల్లో స్వల్ప మార్పులు చేయాల్సి ఉంటుంది. కొన్ని నిబంధనలతో కూడిన ప్రత్యేక జాబితాను తయారుచేయాల్సి ఉంటుంది. దీంతో ఈ క్రీడను గోవిందా బృందాలు మరింత సురక్షితంగా ఆడేందుకు వీలుపడనుందని తావ్డే అభిప్రాయపడ్డారు. ఎన్సీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్ అసెంబ్లీ సభాగృహంలో గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నించిన ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాడ్ను శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేశారు. శాసన సభలో కరువుపై చర్చల్లో భాగంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతుండగా ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ పోడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో సభను 15 నిమిషాలపాటు వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం మళ్లీ సమావేశాలను ప్రారంభించినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ఏ మాత్రం వెనక్కితగ్గలేదు. కాగా, సభ్యుల ఆందోళన సమయంలో పోడియంలోకి అవాడ్ దూసుకెళ్లడంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గిరీష్ బాపట్ స్పందించారు. ఆయనను సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించారు. అనంతరం జితేంద్ర అవాడ్ను శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ హరిబావు బాగడే ప్రకటించారు.