breaking news
Aditya Sriram
-
ఒకరు కాదు... అయిదుగురు
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాల హవా నడుస్తోంది. మంచి కథ కుదిరితే మల్టీస్టారర్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి హీరోలు వెనకాడడం లేదు. కానీ, ఇద్దరు మహా అయితే ముగ్గురు హీరోలు కలసి నటిస్తుంటారు. తాజాగా ఐదుగురు హీరోలతో ఓ సినిమా రూపొందనుందని సమాచారం. తొలి చిత్రం ‘భలే మంచి రోజు’తో హిట్ అందుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. కథ కూడా రెడీ అయిందట. ఇప్పటికే నారా రోహిత్, సందీప్ కిషన్, నాగశౌర్యలకు కథ వినిపించగా వారు ఓకే అన్నారనీ, మిగిలిన ఇద్దరు హీరోలను ఎంపిక చేసే పనిలో దర్శకుడున్నారని తెలుస్తోంది. ఐదుగురిలో ఒక పెద్ద వయస్సు ఉన్న హీరో కథకి అవసరమట. సో, ఆ హీరోని ఫైనలైజ్ చేసే పని మీద ఉన్నారట. ఇప్పుడొస్తున్న రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా కొత్త తరహా కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు భోగట్టా. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. -
‘భలే మంచి’ కాంబినేషన్!
సహజమైన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న యువ హీరో నాని. గత ఏడాది చివరలో వచ్చిన గమ్మత్తై ప్రయత్నం ‘భలే మంచి రోజు’తో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యువకుడు - శ్రీరామ్ ఆదిత్య. త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రానుందని కృష్ణానగర్ కబురు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద్‌ప్రసాద్ ఈ ‘భలే మంచి’ కాంబినేషన్లో సినిమా తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నారట! గతంలో షార్ట్ ఫిల్మ్స్ రూపకల్పనలో సిద్ధహస్తుడై, విభిన్న తరహా ‘భలేమంచి రోజు’ లాంటి సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్ట్స్ సిద్ధం చేసుకున్న శ్రీరామ్ ఆదిత్య ఓ మంచి స్క్రిప్ట్‌తో నానిని ఇంప్రెస్ చేశారట. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఇంకా పేరు ఖరారు కాని చిత్రంలో నాని నటిస్తున్నారు. ఆ తరువాత విరించి వర్మ దర్శకత్వంలో కొత్త సినిమాకు కూడా అంగీకరించారు. భవ్య క్రియేషన్స్ నిర్మించే సినిమా రానున్న జూలైలో సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. -
కృష్ణవంశీ తర్వాత నువ్వే అన్నారు!
సినిమా డెరైక్టర్ కావాలనుకుని బంగారంలాంటి జాబ్ వదిలేసుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. తండ్రి కూడా ఫుల్ సపోర్ట్. దాంతో తాను రాసుకున్న కథతో ఏడాది పాటు ఇండస్ట్రీ అంతా తిరిగాడు. చివరకు ఓ మంచి రోజున విజయ్, శశిధర్‌లను కలిశాడు. కట్ చేస్తే... ‘భలే మంచి రోజు’ సినిమాకు డెరైక్టర్ అయిపోయాడు. సుధీర్‌బాబు హీరోగా రూపొందిన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఈ దర్శకుడి మనోభావాలు... సినిమా చూసి మా అమ్మా, నాన్న ఎగ్జైట్ అయ్యారు. ‘చాలా బాగా తీశావ్‌రా’ అని నాన్న హగ్ చేసుకున్నారు. నేను పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. నాకు డెరైక్షన్ అంటే ఇష్టం. అందుకే ఫేస్బుక్, గూగూల్లో పని చేస్తున్నప్పుడు కథలు రాసుకున్నాను. జాబ్ చేస్తూనే ఓ ఎనిమిది షార్ట్ ఫిలింస్ చేశాను. వాటిలో ఒకదానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. చివరకు జాబ్ మానేసి, డెరైక్షన్ ట్రై చేశా. ఒక విభిన్న చిత్రం చేయాలనే ఆలోచనతో ‘భలే మంచి రోజు’ కథ రాసుకున్నాను. ఒక్క రోజులో జరిగే కథ కావడంవల్ల స్క్రీన్‌ప్లే పకడ్బందీగా ఉండాలి. ఈ కథ వినగానే సుధీర్‌బాబుతో చేద్దామని విజయ్ అన్నారు. సుధీర్‌బాబు ఈ చిత్రానికి పర్ఫెక్ట్ అనిపించింది. నేను చేసిన షార్ట్ ఫిలింస్ చూసి ఆయన అవకాశం ఇచ్చారు. నా అదృష్టం కొద్దీ మంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు కుదిరారు. పరుచూరి గోపాలకృష్ణగారైతే ‘కృష్ణవంశీ తర్వాత నటీనటుల నుంచి ఆ స్థాయిలో నటన రాబట్టుకున్నది నువ్వే’ అన్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య పాత్ర అభ్యంతరకరంగా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఆ పాత్ర మాట్లాడిన కొన్ని డైలాగ్స్ తీసివేశాం. అందుకే వల్గర్‌గా అనిపిస్తోంది. ఆ డైలాగ్స్ వినిపించి ఉంటే, అలా అనిపించి ఉండేది కాదు. ప్రస్తుతం నా దగ్గర నాలుగైదు కథలు ఉన్నాయి. నా తదుపరి చిత్రం గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు. అందుకని ఏ కథతో సినిమా చేస్తాననేది ఇప్పుడే చెప్పలేను. -
భలే మంచి రోజు
ఒకే ఒక్క రోజులో కలిసిన వ్యక్తుల ద్వారా ఓ వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పు వస్తుంది? అతను కలిసిన వ్యక్తులకు ఆ రోజు ఎందుకు మంచి రోజు అవుతుంది? దానికి కారణమైన సంఘటనలేంటి? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘భలే మంచి రోజు’. సుధీర్‌బాబు, వామిక జంటగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో విజయ్, శశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నవంబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వేగాన్ని అందుకొన్నాడు.. విజేత అయ్యాడు!
వేగవంతంగా దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో... ఏ రంగంలోనైనా వేగాన్ని అందిపుచ్చుకొంటేనే పోటీలో ఉన్నట్టు. మొన్నటి వరకూ... ఒక యువకుడు సొంతంగా షార్ట్ఫిలిమ్ తీయడమే గొప్ప. అయితే ఇప్పుడు చాలా మంది ఆ పనిచేసేస్తున్నారు. మరి అదే షార్ట్‌ఫిలిమ్‌ను వేగవంతంగా తీస్తే... కౌంట్‌డౌన్ పెట్టుకొని కొన్ని గంటల్లోనే పూర్తి చేస్తే... దాంతో అవార్డును అందుకొంటే... కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ ఛాన్స్‌కు దగ్గరైతే... అతడు వేగాన్ని అందిపుచ్చుకొన్న వ్యక్తి అవుతాడు. విజేత అవుతాడు. శ్రీరామ్ ఆదిత్య అలాంటి ఛాంపియనే! తన షార్ట్ఫిలిమ్ ‘ది కాన్స్పిరసీ’ ద్వారా ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ లో ‘బెస్ట్ డెరైక్టర్’ అవార్డును అందుకొన్న యువకుడితను. శ్రీరామ్, అతడి స్నేహితులు కలిసి రూపొందించిన ఆ సినిమా ఈ పోటీల్లో ‘బెస్ట్ ఫిలిమ్’గా కూడా నిలిచింది. ఈ నేపథ్యంలో శ్రీరామ్ గురించి, అతడి సినిమా గురించి... ‘ది కాన్స్పిరసీ’ శ్రీరామ్ ఆదిత్య స్వీయదర్శకత్వంలో రూపొందించిన ఎనిమిదో షార్ట్ఫిలిమ్. హైదరాబాద్‌లోని గోకరాజు రంగరాజు కాలేజ్‌లో బీటెక్ చదివే రోజుల నుంచి సినిమాలంటే అతనికి తగని ప్రీతి. ఎప్పటికైనా డెరైక్టర్ కావాలనేది అతని కల. మరి డెరైక్టర్ కావాలంటే ఫిలింనగర్ చుట్టూ చక్కర్లు కొట్టడానికి కన్నా మునుపు.. తనకు ఆ కల కనడానికి అర్హత ఉందని నిరూపించుకోవాలనుకొన్నాడతను. అందుకోసమే తన ఆలోచనలను తెరకెక్కించడం మొదలు పెట్టాడు. అలా తెరకెక్కినదే ‘చైల్డ్ లేబర్’ అనే షార్ట్ఫిలిమ్. చదువుకొనే సమయంలోనే శ్రీరామ్ రూపొందించిన ఆ సినిమా సౌతిండి యన్ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్‌గా నిలిచింది. దానికీ అవార్డు లభించింది. మరి శ్రీరామ్‌కు అంతకు మించిన ప్రోత్సాహం అవసరం లేకపోయింది. ఇంట్లో కూడా పూర్తి మద్దతు లభించడంతో, షార్ట్ఫిలిమ్లతో గుర్తింపు సంపాదించుకొనే ప్రక్రియను ముమ్మరం చేశాడు. ఈ క్రమంలోనే చదువు పూర్తి అయ్యింది.. గూగుల్‌లో ఉద్యోగం వచ్చింది, అటు నుంచి ఫేస్‌బుక్‌లోకి మారాడు. ఆ సంస్థల్లో పనిచేయడం ఎంతోమంది యువతకు కలల పంట. అయితే శ్రీరామ్ కల మాత్రం ‘సినిమా’. అందుకే ఉద్యోగాన్ని వదిలేసి.. సినిమా లక్ష్యంగా కార్యాచరణ మొదలు పెట్టాడు. ఈ క్రమంలో షార్ట్ఫిలిమ్ పోటీలపై దృష్టి సారించాడు. దేశంలో నగరాల వారీగా జరిగే బుల్లి సినిమాల పోటీల్లో తన ప్రయత్నాలు చేయసాగాడు. ఎక్కడికి వెళ్లినా శ్రీరామ్ తన ప్రత్యేకతను అయితే నిరూపించుకొంటూ వస్తున్నాడు. ఇప్పటి వరకూ శ్రీరామ్ ఎనిమిది షార్ట్‌ఫిలిమ్‌లు రూపొందించగా, నాలుగింటికి అవార్డులు వచ్చాయి! అవన్నీ కూడా 48 గంటల వ్యవధిలో రూపొందించిన సినిమాలే కావడం విశేషం! ప్రస్తుతం శ్రీరామ్ రూపొందించిన ‘ది కాన్స్పిరసీ’కి ఒక అంతర్జాతీయ స్థాయి సంస్థ అవార్డు రావడం, అది అమెరికాలో జరిగే ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శనకు అవకాశం దక్కించుకోవడంతో పాటు.. ఇండియన్ జ్యూరీలో కాన్స్ ఫిలిమ్ ఫెస్టివల్లో ప్రదర్శన కోసం కూడా పోటీలో ఉంది. మరి కాన్స్‌కు వీసా గనుక పొందితే శ్రీరామ్ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి లభించే అవకాశం ఉంది. షార్ట్‌ఫిలిమ్స్‌తో మంచి గుర్తింపు లభించిన నేపథ్యంలో ఫీచర్ ఫిలిం రంగంలోకి ప్రవేశించి... పూర్తిస్థాయిలో సినీ దర్శకుడు అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు శ్రీరామ్. తను సినిమా రంగానికి సరిపోయే వ్యక్తినేనని నిర్ధారణ చేసుకొని ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తున్నాడు. కథలను సిద్ధం చేసుకొని సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడు. సరైన సహకారం లభిస్తే మంచి సినిమాలను తీర్చదిద్దగలననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలో శ్రీరామ్ విజయవంతం అవుతాడని ఆశిద్దాం. ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ అనే ఈ అంతర్జాతీయ స్థాయి సంస్థ నగరాల వారీగా షార్ట్ఫిలిమ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తూ ఉంటుంది. అందులో భాగంగా హైదరాబాద్ యువత నుంచి ఎంట్రీలను కోరింది. ఈ అవకాశాన్ని శ్రీరామ్ సద్వినియోగం చేసుకొన్నాడు. కాంపిటీషన్ అంటే.. ముందస్తు ఏర్పాట్లతో వెళ్లడం కాదు. ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ వాళ్లు చెప్పిన కాన్సెప్ట్‌తో, వాళ్లు చెప్పిన ఒక పాత్రతో, కొన్ని పరిధుల మేరకు మెప్పించాలి! ఈ విషయంలోనే శ్రీరామ్ బృందం విజయవంతమైంది. ఒకే పాత్రతో..అది కూడా నిద్రపోతున్నట్టుగా చూపుతూ ఈ లఘుచిత్రాన్ని రూపొందించారు. బుక్, స్కేటింగ్ బోర్డ్, క్లాక్, గిటార్, స్మార్ట్‌ఫోన్ వంటి వస్తువులతో ఈ సినిమాను రూపొందించి మార్కులు కొట్టేసింది శ్రీరామ్, బృందం. దాదాపు 40 నుంచి 50 షార్ట్ ఫిలిమ్లు పోటీ పడగా వాటిల్లో ఇది అత్యుత్తమమైనదిగా నిలిచింది. ఈ లఘు ప్రయత్నానికి సౌమిత్ లంక (సంగీతం, వాయిస్ ఓవర్), అవినాష్ మట్టా (ఎడిటింగ్), ప్రసాద్ కళ్ళేపల్లి (సినిమాటోగ్రఫీ), ఇంకా దుర్గ, గౌతమ్‌లు శ్రీరామ్‌కు అండగా నిలిచారు. ఇక, తెరపై కనిపించే ఒకే ఒక్క పాత్రలో అంకుర్ నటించాడు. అవార్డుల పంట మహీంద్రా కంపెనీ వాళ్లు తమ కారు ఒకదాన్ని మార్కెట్లో ప్రవేశపెడుతూ, ఆ కారును ఉపయోగించుకొంటూ లఘు చిత్రాలను రూపొందించాలనే పోటీని నిర్వహించింది. అందులో శ్రీరామ్ దర్శకత్వం వహించిన ‘ద డ్రైవ్’ దేశంలోనే ఉత్తమ 20 షార్ట్ ఫిలిమ్స్‌లో ఒకటిగా నిలిచింది. అంతకన్నా మునుపే ‘రన్ వీ రీల్’ కాంపిటీషన్ కోసం 48 గంటల్లో రూపొందించిన లఘుచిత్రానికి ప్రైజ్ వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు రూపొందించిన షార్ట్ ఫిలిమ్‌కు కూడా అవార్డు దక్కింది. ఇప్పుడు ద్వితీయ ప్రయత్నంలో ‘48 అవర్ ఫిలిమ్ ప్రాజెక్ట్’ లభించింది.