హీరోయిన్‌గా ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ స్థానం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అతి తక్కువ కాలంలోనే ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాలు చేసిన మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఈమె ఈ స్థాయికి అంత సులభంగా రాలేదు. తొలి రోజుల్లో అవకాశాల కోసమే చాలా కష్టపడింది.
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. ప్రతి సినిమాలో ఐశ్వర్య రాజేష్ తన నటనతో అందరినీ మంత్రముగ్దుల్ని చేసింది.
30 సినిమాలు చేసిన తర్వాత కథానాయికగా అవకాశాలు రావడం మొదలెట్టాయి.
ఇప్పుడు బడ్జెట్ చిత్రాలకు తొలి ఛాయిస్ ఈమెనే అన్నంతగా ఎదిగింది. ఇటీవల ఒక కార్యక్రమంలో తన మనసులో చాలా కాలంగా నిగూడమైన ఆవేదనను వెల్లడించింది.
తాను అనుకుంది ఇంతవరకు జరగలేదని వాపోయింది.
ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్న తరువాత విజయ్ సేతుపతి, శివకార్తికేయన్, ధనుష్.. ఈ ముగ్గురు హీరోలే ఎక్కువగా అవకాశాలు కల్పిస్తూ సపోర్టుగా నిలుస్తున్నారంది.
అయితే పెద్ద హీరోలు ఎవరూ తనను పట్టించుకోవట్లేదని, ఎంత బాగా నటించినా తనను నటిగా అంగీకరించడం లేదని వాపోయింది.
దీంతో ఒక దశలో చాలా ఆవేదనకు గురయ్యానని చెప్పుకొచ్చింది.
ఆ తరువాతే తాను మహిళా ఇతివృత్తంతో కూడిన కథా చిత్రాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపించడం మొదలెట్టానని చెప్పుకొచ్చింది.
అలా ఆ తరహా చిత్రాలు 20 వరకు చేశానని తెలిపింది.
ఆ చిత్రాల రిజల్ట్ ఏమైనా తన నటనకు ప్రశంసలు లభిస్తున్నాయని, అదే తనకు ప్రశాంతతను చేకూర్చుతుందని పేర్కొంది.
తన నటన గురించి అందరికీ తెలుస్తున్నా ఇప్పటికీ పెద్ద హీరోలు తనకు అవకాశాలు కల్పించడం లేదని ఇంకా చెప్పాలంటే వారు తనను పట్టించుకోవడం లేదంటోంది.
స్టార్ హీరోల కంటికి తాను నటిగానే కనిపించడం లేదని ఐశ్వర్య రాజేష్ పేర్కొంది.


