కుక్కలున్నాయి జాగ్రత్త | Sakshi
Sakshi News home page

కుక్కలున్నాయి జాగ్రత్త

Published Mon, Jan 22 2018 9:42 AM

dogs attack on 10members in ysr district - Sakshi

మొరిగే కుక్క కరవదంటారు. కానీ ఇప్పుడు మొరగని కుక్కలే కాదు.. మొరిగేవి సైతం పిక్కలు పట్టుకుని పీకుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం ప్రజల్ని వెంటపడి మరీ కరుస్తున్నాయి. నడిచి వెళ్లేవారే కాదు ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారినీ వదలడం లేదు. శునకాల దెబ్బకు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. కుక్కల బెడద నివారించండి మహాప్రభో అని ప్రజలు అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వారిలో ఏమాత్రం చలనం లేదు.

సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలోని రాజంపేట పట్టణంలో శనివారం ఏకంగా 10 మంది పిచ్చికుక్క కాటుకు గురై అసుపత్రి పాలయ్యారు. రాయచోటిలోనూ ఆదివారం పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేయడంతో ఐదుగురు చిన్నారులు గాయాలపాలయ్యారు. వీరిలో మాసూద్‌ అనే మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడగా.. చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. జిల్లాలోని పలు చోట్ల ఇలాంటి సంఘటనలు సర్వ సాధారణంగా మారాయి. జిల్లాలో నెలకు 200 మందికి పైగా కుక్కకాటుకు గురవుతున్నారు. 

కడప నగర పాలక సంస్థతోపాటు, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, జమ్మలమడుగు, రాయచోటి, పులివెందుల, యర్రగుంట్ల, మైదుకూరు తదితర పట్టణాల్లో వీధి కుక్కలు యధేచ్ఛగా సంచరిస్తున్నాయి. గ్రామాల్లో పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిల్లాలో ఏకంగా 2 లక్షల వరకు వీధి కుక్కలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటికి మున్సిపాలిటీ, పంచాయతీ పాలకులు ఏటా టీకాలు వేయించాల్సి ఉంది. ఇందుకోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చూపిస్తున్నారు. కానీ ఫలితం లేదు. శని, ఆదివారాల్లో రాజంపేట, రాయచోటి పట్టణాల్లో పిచ్చికుక్కల స్వైరవిహారమే ఇందుకు ఉదాహరణ. అధికారులు మాత్రం వాటి నివారణ పేరుతో లక్షల్లో నిధులను కాజేస్తున్నారనే విమర్శలున్నాయి.

బెంబేలెత్తుతున్న ప్రజలు..
జిల్లాలో వీధి కుక్కల సంఖ్య గణనీయంగా పెరిగింది.  రాత్రి అయ్యేసరికి రోడ్డు మీద ప్రయాణం నరకంగా మారుతోంది.  వీధి కుక్కలను నియంత్రించాల్సిన అధికారులు నామమాత్ర చర్యలతో మిన్నకుంటున్నారు. న్యాయస్థానాలు ఇతర సంస్థల నుంచి వచ్చిన సూచనలను సాకుగా చూపుతూ.. ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకోవడం లేదు.

నియంత్రణకు చర్యలేవి..
వాస్తవానికి వీధి కుక్కల నియంత్రణకు ఉన్నత న్యాయస్థానం నిర్ధిష్ట సూచనలు చేసింది. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించి క్రమంగా వాటిలో సంతానోత్పత్తిని తగ్గించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. పిచ్చికుక్కలను మాత్రమే లేకుండా చేయవచ్చు. ఇందుకోసం ఒక్కో కుక్క కోసం దాదాపు రూ. 500 వరకు కేటాయిస్తున్నారు. అధికారులు మాత్రం కాగితాల్లోనే పనులు చేశామంటూ చూపుతూ నిధులు మింగేస్తుండడంతో వీధి కుక్కలు చెలరెగిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వీధి కుక్కల స్వైర విహారం
రాయచోటి రూరల్‌ : రాయచోటి పట్టణ పరిధిలోని కొత్తపల్లె ప్రాంతంలో ఆదివారం ఉదయం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. వీధిలోని చిన్నారులు, పెద్దలపై విచక్షణా రహితంగా దాడి చేశాయి. ఈ దాడిలో కొత్తపల్లె ప్రాంతం ఫైర్‌ స్టేషన్‌ సమీపంలోని రియాజ్‌ కుమార్తె 3వ తరగతి చదువుతున్న మసూద్‌ తీవ్రంగా గాయపడింది. ముఖంపైన, గొంతుపైన తీవ్రగాయాలు కావడంతో కడప రిమ్స్‌కు తరలించారు. దీంతో పాటు అదే ప్రాంతానికి చెందిన చిన్నారులు నితిన్, ముబషీర్, వరాధిలు కుక్కల కాటుకు గాయపడ్డారు. మట్లికి చెందిన జలజ (5)ను కూడా కుక్కలు తీవ్రంగా కరిచి గాయపరిచాయి. గాయపడిన వారికి రాయచోటి ఆసుపత్రిలో చికిత్స చేశారు. మసూద్‌ అనే చిన్నారి మాత్రం తీవ్రగాయాలతో కడప రిమ్స్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతోంది. 

Advertisement
Advertisement