లక్ష్మీ మాట.. రాజేసిన మంట | Women Congress President Lakshmi Hebbalkar was in trouble | Sakshi
Sakshi News home page

లక్ష్మీ మాట.. రాజేసిన మంట

Sep 1 2017 10:07 AM | Updated on Mar 18 2019 9:02 PM

లక్ష్మీ మాట.. రాజేసిన మంట - Sakshi

లక్ష్మీ మాట.. రాజేసిన మంట

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌ చిక్కుల్లో పడ్డారు.

►  ఒక వేడుకలో మహారాష్ట్రకు అనుకూల వ్యాఖ్యలు
 ► భగ్గుమన్న కన్నడ సంఘాలు, విపక్షాలు
►  పలుచోట్ల నిరసనలు
► తప్పయితే క్షమించాలి: లక్ష్మీ హెబ్బాళ్కర్‌


మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌ చిక్కుల్లో పడ్డారు. కీలకమైన తరుణంలో మహారాష్ట్ర అనుకూల వ్యాఖ్యలు చేయడం పలు వర్గాల ఆగ్రహానికి గురైంది. లక్ష్మీ అలా అనలేదని, ఆమె మాటలను వక్రీకరించారని కొందరు కాంగ్రెస్‌ నేతలు సర్దుబాటు చేయబోగా, ఆమె మాటలతో పార్టీకి సంబంధం లేదని పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ ప్రకటించడం గమనార్హం.

సాక్షి, బెంగళూరు:
కన్నడనాడు కోసం ప్రత్యేక జెండా, ప్రత్యేక సాంస్కృతిక విధానం, కన్నడకు పెద్దపీట.. ఇలా సీఎం సిద్ధరామయ్య కన్నడతత్వానికి ఎర్రతివాచీ పరుస్తుంటే, అధికార కాంగ్రెస్‌ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. బెళగావి తమదేనంటూ మహారాష్ట్ర, మరాఠాలు నినదిస్తుండడం చేస్తుండడం తెలిసిందే. దీనిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.

కాగా, ఆగస్టు 27న బెళగావిలోని బసరికట్టె గణేశోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ హెబ్బాళ్కర్‌ మాట్లాడుతూ.....‘బెళగావి మహారాష్ట్రకు చేరుతుందంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే అందరికంటే ముందు నేను మహారాష్ట్ర పతాకాన్ని చేతపట్టి ‘జై మహారాష్ట్ర’ అనే నినాదం చేస్తాను’ అనే ప్రకటించారు. ఈ ఆడియో క్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మీ హెబ్బాళ్కర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విపక్ష బీజేపీతో పాటు రాష్ట్రంలోని వివిధ కన్నడ సంఘాలు సైతం ఆమెపై మండిపడుతున్నాయి.  కర్ణాటకను కించపరిచేలా మాట్లాడారని కన్నడ సంఘాలు విమర్శించాయి.

సీఎం కర్ణాటక భూమి, నీరు, సంస్కృతి పరిరక్షణకు పాటు పడుతున్నామని చెబుతుంటే, అదే పార్టీకి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌ ద్వంద్వ నీతిని తెలియజేస్తోందంటూ విపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్‌ పార్టీ నేతలు మాత్రం లక్ష్మీ హెబ్బాళ్కర్‌ వ్యాఖ్యల్లో దురుద్దేశం ఏదీ లేదని సమర్థించాయి.

కాంగ్రెస్‌కు సంబంధం లేదు :∙పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌
రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్‌ వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, కాంగ్రెస్‌ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్‌ స్పష్టం చేశారు. గురువారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. లక్ష్మీహెబ్బాళ్కర్‌ రాష్ట్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే విషయం తమకు తెలియదని ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లు పరిశీలించిన అనంతరం స్పందిస్తామని అన్నారు. తప్పుడు చిరునామాతో టీఏ, డీఏలు పొందినట్లు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తిమ్మాపూర్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరుపుతామన్నారు. సినీహీరో దర్శన్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల గురించి తమకు తెలియదని అన్నారు.  

తప్పయితే క్షమించాలి: లక్ష్మీ
తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో లక్ష్మీ హెబ్బాళ్కర్‌ సైతం ఈ విషయం పై స్పందించారు. తన వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని సరిగా అర్థం చేసుకోలేక పోయారని, ఏది ఏమైనప్పటికీ తన వ్యాఖ్యల ద్వారా ఎవరికైనా బాధ కలిగితే తనను క్షమించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement