breaking news
Lakshmi Hebbalkar
-
కేబినెట్ విస్తరణలో లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు చేదు అనుభవం
హుబ్లీ: పోటాపోటీగా జరిగిన డీకే.శివకుమార్ మంత్రివర్గ విస్తరణలో అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవది బెళగావి కుందాతో నోటిని తీపి చేసుకున్నారు. సవదికి మంత్రి పదవి దక్కగా దీనిపై ఆశ పెట్టుకున్న పలుకుబడి కలిగిన మహిళా నాయకురాలు, మాజీ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మొత్తానికి శివకుమార్ కేబినెట్లో బెళగావి జిల్లాకు రెండు స్థానాలు దక్కాయి. ఈ రెండు స్థానాలు చిక్కోడి లోక్‌సభ పరిధిలోకి రాగా, బెళగావి లోక్‌సభకు మొండి చేయి చూపారని ఆ ప్రాంత కార్యకర్తలు అసంతృప్తితో రగిలి పోతున్నారు. సవదిని వరించిన అదృష్టం జిల్లాలోని 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాను సవది, లక్ష్మీ, అశోక్ పట్టణ, మహంతేష్ కౌజలిగి మంత్రిగిరి కోసం జోరుగా లాబీయింగ్ చేశారు. దీంతో సహజంగానే ఎవరికి మంత్రి పదవి లభిస్తుందన్న కుతూహలం నెలకొనగా, చివరికి లక్ష్మణ సవదికి అమాత్య పదవి దక్కింది. ఇప్పటికే చిక్కోడి లోక్‌సభ పరిధిలోని యమనకమరడి అసెంబ్లీ స్థానం ఎమ్మెల్యే సతీష్ జార్కిహోళికి తొలి దశలోనే డీకే.మంత్రి వర్గంలో స్థానం లభించింది. రెండో విస్తరణలో కూడా అదే లోక్‌సభ స్థానం పరిధిలోని అథణి ఎమ్మెల్యే లక్ష్మణ సవదిని మంత్రి పదవి వరించింది. బెళగావి లోక్‌సభకు మొండిచేయి రెండు మంత్రి స్థానాలు చిక్కోడి పాలు కావడంతో బెళగావి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం లభించక పోవడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసే సూచనలు ఉన్నాయి. మహిళా కోటాలో తనకు మంత్రి పదవి లభిస్తుందన్న నమ్మకంతో ఉన్న లక్ష్మి హెబ్బాళ్కర్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇంతకు ముందు మంత్రిగా పని చేసిన అనుభవం, పార్టీ సంఘటితత్వానికి శ్రమించిన తీరు తనకు లాభిస్తుందని భావించిన ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడంతో మద్దతుదారుల్లో తీవ్ర నిరాశ ఛాయలు అలుముకున్నాయి. దీంతో లక్ష్మి అభిమానులు పలు చోట్ల తమ ఆందోళనను వ్యక్త పరిచి పార్టీ హైకమాండ్‌పై ఆక్రోశించారు. -
లక్ష్మీ మాట.. రాజేసిన మంట
► ఒక వేడుకలో మహారాష్ట్రకు అనుకూల వ్యాఖ్యలు ► భగ్గుమన్న కన్నడ సంఘాలు, విపక్షాలు ► పలుచోట్ల నిరసనలు ► తప్పయితే క్షమించాలి: లక్ష్మీ హెబ్బాళ్కర్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ చిక్కుల్లో పడ్డారు. కీలకమైన తరుణంలో మహారాష్ట్ర అనుకూల వ్యాఖ్యలు చేయడం పలు వర్గాల ఆగ్రహానికి గురైంది. లక్ష్మీ అలా అనలేదని, ఆమె మాటలను వక్రీకరించారని కొందరు కాంగ్రెస్ నేతలు సర్దుబాటు చేయబోగా, ఆమె మాటలతో పార్టీకి సంబంధం లేదని పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ ప్రకటించడం గమనార్హం. సాక్షి, బెంగళూరు: కన్నడనాడు కోసం ప్రత్యేక జెండా, ప్రత్యేక సాంస్కృతిక విధానం, కన్నడకు పెద్దపీట.. ఇలా సీఎం సిద్ధరామయ్య కన్నడతత్వానికి ఎర్రతివాచీ పరుస్తుంటే, అధికార కాంగ్రెస్ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని తీవ్ర ఇరకాటంలో పడేశాయి. బెళగావి తమదేనంటూ మహారాష్ట్ర, మరాఠాలు నినదిస్తుండడం చేస్తుండడం తెలిసిందే. దీనిపై ఎప్పటి నుంచో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. కాగా, ఆగస్టు 27న బెళగావిలోని బసరికట్టె గణేశోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ హెబ్బాళ్కర్ మాట్లాడుతూ.....‘బెళగావి మహారాష్ట్రకు చేరుతుందంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇస్తే అందరికంటే ముందు నేను మహారాష్ట్ర పతాకాన్ని చేతపట్టి ‘జై మహారాష్ట్ర’ అనే నినాదం చేస్తాను’ అనే ప్రకటించారు. ఈ ఆడియో క్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మీ హెబ్బాళ్కర్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విపక్ష బీజేపీతో పాటు రాష్ట్రంలోని వివిధ కన్నడ సంఘాలు సైతం ఆమెపై మండిపడుతున్నాయి. కర్ణాటకను కించపరిచేలా మాట్లాడారని కన్నడ సంఘాలు విమర్శించాయి. సీఎం కర్ణాటక భూమి, నీరు, సంస్కృతి పరిరక్షణకు పాటు పడుతున్నామని చెబుతుంటే, అదే పార్టీకి చెందిన మహిళా విభాగం అధ్యక్షురాలు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ ద్వంద్వ నీతిని తెలియజేస్తోందంటూ విపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం లక్ష్మీ హెబ్బాళ్కర్ వ్యాఖ్యల్లో దురుద్దేశం ఏదీ లేదని సమర్థించాయి. కాంగ్రెస్‌కు సంబంధం లేదు :∙పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్ స్పష్టం చేశారు. గురువారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. లక్ష్మీహెబ్బాళ్కర్ రాష్ట్ర వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే విషయం తమకు తెలియదని ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వీడియో క్లిప్పింగ్‌లు పరిశీలించిన అనంతరం స్పందిస్తామని అన్నారు. తప్పుడు చిరునామాతో టీఏ, డీఏలు పొందినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్సీ తిమ్మాపూర్పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరుపుతామన్నారు. సినీహీరో దర్శన్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల గురించి తమకు తెలియదని అన్నారు. తప్పయితే క్షమించాలి: లక్ష్మీ తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో లక్ష్మీ హెబ్బాళ్కర్ సైతం ఈ విషయం పై స్పందించారు. తన వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని సరిగా అర్థం చేసుకోలేక పోయారని, ఏది ఏమైనప్పటికీ తన వ్యాఖ్యల ద్వారా ఎవరికైనా బాధ కలిగితే తనను క్షమించాలని కోరారు.


