నేతన్న రాత మారుస్తాం

నేతన్న రాత మారుస్తాం - Sakshi


చేనేత, మరమగ్గ కార్మికులను ఆదుకునేందుకు త్రిముఖ వ్యూహం: సీఎం కేసీఆర్‌

- సబ్సిడీలు.. ఆర్థిక సాయం.. ప్రభుత్వం తరఫున కొనుగోళ్లు

- కార్మికులకు నెలకు రూ.15 వేలకు తగ్గకుండా వేతనం అందాలి

- పవర్‌లూమ్‌ యజమానులకు చేయూతనిస్తాం

- కార్మికుల కోసం పొదుపు పథకం అమలు చేస్తాం

- సిరిసిల్లలో అపెరల్‌ పార్క్, 4 గోదాములు ఏర్పాటు చేస్తాం

- నిల్వలకు సహకార బ్యాంకు ద్వారా రుణ సదుపాయం కల్పిస్తాం

- నేత పరిశ్రమ, కార్మికుల సంక్షేమానికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్‌


చేనేత మగ్గాలు, మర మగ్గాల కార్మికులందరూ మంచి జీవితం గడిపేందుకు అవసరమైన విధానం రూపొందిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నేత కార్మికుల జీవితాల నుంచి దుఃఖం పోవాలని, వారి తలరాతలు మారాలని ఆకాంక్షించారు. వారి సంక్షేమం, నేత పరిశ్రమ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాబోయే బడ్జెట్లోనే అందుకు నిధులు కేటాయిస్తామని మాటిచ్చారు. ‘‘రాష్ట్రంలో ఇకపై ఏ ఒక్క నేత కార్మికుడు కూడా ఆత్మహత్య చేసుకోకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ప్రతీ కుటుంబం గౌరవంతో బతికే వేతనం పొందాలన్నది సంకల్పం. ఈ వృత్తిపై జీవించే పద్మశాలీల సంక్షేమానికి త్రిముఖ వ్యూహం అనుసరిస్తాం. చేనేత మగ్గాలపై పనిచేసే వారున్నారు.. మరమగ్గాల్లో కూలీలుగా పనిచేస్తున్న వారున్నారు.. వృత్తిని వదిలి ప్రత్యామ్నాయ ఉపాధి చూసుకున్నవారున్నారు.. వీరందరి కోసం త్రిముఖ వ్యూహంతో చర్యలు చేపడతాం..’’అని తెలిపారు.నేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారమిక్కడ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సలహాదారు వివేక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్, కో ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్‌ రవీందర్‌ రావు, సిరిసిల్ల కలెక్టర్‌ కృష్ణ భాస్కర్, సిరిసిల్ల నుంచి వచ్చిన పవర్‌ లూమ్‌ పరిశ్రమకు చెందిన దాదాపు 40 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వీరందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న సీఎం త్రిముఖ వ్యూహంతో నేత కార్మికులను ఆదుకుంటామని స్పష్టం చేశారు.నూలు, రసాయనాలపై సబ్సిడీ

ప్రతి మగ్గాన్ని లెక్కించి చేనేతపై ఆధారపడిన వారిని గుర్తించాలని అధికారులకు సీఎం సూచించారు. ‘‘నారాయణపేట, గద్వాల, పోచంపల్లిలో కళాత్మక వస్త్రాలు తయారు చేసే వారున్నారు. అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న ఆ వస్త్రాలను తయారీ చేసే వారిని ప్రోత్సహించే విధానం రూపొందించాలి. చేనేత మగ్గాలపై సాధారణ వస్త్రాలు నేసే వారికి అవసరమైన ఆర్థిక తోడ్పాటు అందించాలి. నూలు, రసాయనాలను సబ్సిడీపై అందించాలి. వారు తయారు చేసే వస్త్రాలన్నింటినీ ప్రభుత్వం తరఫునే కొనుగోలు చేయాలి. మార్కెటింగ్‌ సమస్యలు రాకుండా చూడాలి’’అని అన్నారు.నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి: ముఖ్యమంత్రి కేసీఆర్‌

తెలంగాణ ఉద్యమ సమయంలో చేనేత కార్మికుల దీనావస్థను చూసి రెండుసార్లు కళ్లవెంట నీళ్లు వచ్చాయని సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. ‘‘కరీంనగర్‌ ఎంపీగా ఉన్పప్పుడు ఓ రోజు పేపర్లో సిరిసిల్లలో ఒకేరోజు 11 మంది చేనేత కార్మికుల మృతి అనే వార్త వచ్చింది. అది చూడగానే మనసు చలించింది. ఏడ్చినంత పనైంది. తిండికి లేక కార్మికులు మరణించడం బాధనిపించింది. సిరిసిల్ల కార్మికులకు ఎంతో గొప్ప పేరుంది. వారిలా చావడమేంటి.. అని ఆలోచించాను. ప్రభుత్వం నుంచి సాయం అందే పరిస్థితి లేదు.అప్పుడు నేనే పూనుకొని టీఆర్‌ఎస్‌ తరఫున రూ.50 లక్షలు సిరిసిల్లకు పంపా. అక్కడున్న సొసైటీ ఆ డబ్బులను అవసరమున్న వారికిచ్చి ఆదుకుంది. మరో సందర్భంలో పోచంపల్లిలో ఏడుగురు కార్మికులు మరణించారనే వార్త చూసిన. ఆ కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కార్మికుల బాధలు చూసి ఏడ్చిన. నేనే స్వయంగా భిక్షాటన చేసిన. రూ.4 లక్షలు జమచేసి వారికి అందజేసిన. ఈ బాధ తెలంగాణలో కొనసాగవద్దనేది నా ఆకాంక్ష. అందుకోసమే ఈ ప్రయత్నం’’అని ముఖ్యమంత్రి అన్నారు.
పవర్‌ లూం కార్మికులకు రూ.15 వేల వేతనం

‘‘రాష్ట్రంలో పవర్‌లూమ్‌లు సిరిసిల్లలో ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. రేపియర్‌ మగ్గాల స్థాయికి పవర్‌లూమ్‌లను ఆధునీకరించాలి. ఇప్పుడున్న మరమగ్గాలతో రోజుకు 40 మీటర్ల బట్ట ఉత్పత్తి అయితే, రేపియల్‌ మగ్గాల ద్వారా 150 మీటర్లకుపైగా తయారవుతుంది. దీంతో యజమానులకు లాభాలొస్తాయి. ఈ ఫలితం కార్మికులకు దక్కాలి. కార్మికులకు ప్రతి నెలా రూ. 15 వేలకు తగ్గకుండా వేతనం అందాలి. రూ.15 వేల నుంచి రూ. 20 వేల ఆదాయం తప్పక రావాలి’’అని సీఎం చెప్పారు.‘‘పవర్‌లూమ్‌లు నడిపే యజమానులకు అవసరమైన చేయూతను ప్రభుత్వం అందిస్తుంది. త్రిఫ్ట్‌ స్కీమ్‌ (పొదుపు పథకం) అమలు చేయాలి. కార్మికుడు ఎంత మొత్తం పొదుపు చేస్తే అదే నిష్పత్తిలో యజమానులు, ప్రభుత్వం కూడా అతని పేరిట జమ చేయాలి. ఈ పొదుపు డబ్బు కార్మికుడి కుటుంబానికి ఉపయోగపడాలి. వేతనాలను బ్యాంకుల ద్వారానే చెల్లించాలి. పవర్‌లూమ్‌ పరిశ్రమను ప్రోత్సహించడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు దుస్తులు, హాస్టళ్లు, హాస్పిటళ్ల దుప్పట్లు, ఇతర యూనిఫారాలు తెలంగాణ నేత కార్మికులు ఉత్పత్తి చేసినవే వాడుతారు. నూలు, రసాయనాలపై ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది’’అని సీఎం అన్నారు. కుటుంబాలను పోషించే పరిస్థితి లేకపోవడంతో చాలామంది పద్మశాలీలు వృత్తిని వదిలి ఇప్పటికే ప్రత్యామ్నాయ ఉపాధి ఎంచుకున్నారు. దీంతో ఆసక్తి ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.రెడీమేడ్‌ దుస్తుల రంగంలోకి మహిళలు

సిరిసిల్లలో అపెరల్‌ పార్కు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నేత కుటుంబాల్లోని మహిళలకు అవసరమైన శిక్షణ ఇచ్చి వారిని రెడీమేడ్‌ దుస్తుల తయారీ రంగంలోకి దింపుతామన్నారు. అపెరల్‌ పార్కు ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌కు సూచించారు. నూలు, వస్త్రాలను నిల్వ చేసుకునేందుకు సిరిసిల్లలో నాలుగు గోదాములు నిర్మిస్తామన్నారు. నిల్వ చేసుకునే యజమానులకు సహకార బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పించాలన్నారు. పవర్‌లూమ్‌లకు రుణ సౌకర్యం కల్పించేందుకు మొదటి ఏడాది రూ.100 కోట్లు సిద్ధంగా ఉంచాలని సహకార బ్యాంకును సీఎం ఆదేశించారు. సిరిసిల్ల టెక్స్‌టైల్‌ పార్కులో మూత పడ్డ పరిశ్రమలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.నంబర్‌ వన్‌గా వరంగల్‌ టెక్స్‌టైల్‌ పార్కు

వరంగల్‌లో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలో నేత పరిశ్రమకు మహర్దశ వస్తుందని సీఎం చెప్పారు. ‘‘షోలాపూర్‌లో చద్దర్లు, సూరత్‌లో చీరలు, తిర్పూరులో ఇతర వస్తువుల తయారీ జరుగుతుంది. ఈ మూడింటి సమాహారంగా వరంగల్‌ పార్కు నెలకొల్పుతాం. మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలోని బృందం ఇటీవలే తిర్పూరు సందర్శించి వచ్చింది. అదే పద్ధతిలో వరంగల్‌ టెక్స్‌ టైల్‌ పార్కు ఉంటుంది. దేశంలోనే నంబర్‌ వన్‌ టెక్స్‌టైల్‌ పార్కుగా దీన్ని తీర్చిదిద్దుతాం. సిరిసిల్ల పవర్‌ లూమ్స్‌ను వరంగల్‌ టెక్స్‌టైల్‌ పరిశ్రమకు అనుసంధానం చేస్తాం’’అని వివరించారు.స్వాగతించిన సిరిసిల్ల ప్రతినిధులు

సమావేశానికి హాజరైన పద్మశాలి సంఘం నాయకుల, నేత పరిశ్రమ ప్రముఖులు సీఎం నిర్ణయాలను స్వాగతించారు. ప్రభుత్వం చేయూత అందితే తాము కార్మికులకు నెలకు రూ.15 వేలకు తక్కువ కాకుండా వేతనం బ్యాంకులో వేస్తామని సీఎం సమక్షంలో అంగీకరించారు. ఈ సందర్భంగా నూలుతో తయారు చేసిన దండను, వస్త్రాలను, చేనేత మగ్గాన్ని ముఖ్యమంత్రికి బహూకరించారు. అనంతరం సీఎం వారందరితో కలిసి భోజనం చేశారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top