అక్కను చూడగానే జీపులోంచి దూకేసింది!

అక్కను చూడగానే జీపులోంచి దూకేసింది!


ఒలింపిక్స్‌లో అసమాన పోరాటపటిమను చాటిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు సోమవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఘనస్వాగతం లభించింది. అగర్తలా విమానాశ్రయం నుంచి స్థానిక మైదానం వరకు వేలమంది అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. కోచ్ బిశ్వేష్వర్‌ నందితో కలిసి ఓపెన్ టాప్ జీపులో ఆమె స్వాగతోత్సవం దాదాపు 12 కిలోమీటర్లు సాగింది. దాదాపు ఐదువేల మంది ఈ ర్యాలీలో పాల్గొని ఆమెకు జయజయధ్వానాలు చేశారు.  మైదానంలో ఆమెకు త్రిపుర ప్రభుత్వం ఘనసత్కారం నిర్వహించింది.



ఆమె విజయోత్సవ ర్యాలీలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానులతో కలిసి తనకు స్వాగతం పలుకుతున్న అక్కను చూడగానే దీప హృదయం ఉప్పొంగిపోయింది. వెంటనే ఓపెన్ జీపులో నుంచి అమాంతం కిందకు దూకేసింది. ఎంతైనా టాప్ క్లాస్ జిమ్నాస్ట్ కదా! ఎలాంటి ఇబ్బంది పడకుండా అలవోకగా జీపులోంచి దిగి.. పరిగెత్తుకెళ్లి తన సోదరిని ఆమె హత్తుకుంది. తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమానురాగాలను ఈ ఘటన చాటింది.



52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత సాధించిన తొలి క్రీడాకారిణిగా దీప సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రమాదకరమైన విన్యాసం ప్రోడునోవా విభాగంలో అద్భుత ప్రతిభాపాటవాలు చాటి ఆమె ఫైనల్‌కు వెళ్లింది. కేవలం 0.15 పాయింట్ల తేడాతో పతకం కోల్పోయిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో దీప పతకం గెలువకపోయినా.. తన పోరాటస్ఫూర్తితో 120 కోట్ల భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది.

 

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top