breaking news
Rio Olympic
-
అక్కను చూడగానే జీపులోంచి దూకేసింది!
ఒలింపిక్స్‌లో అసమాన పోరాటపటిమను చాటిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు సోమవారం త్రిపుర రాజధాని అగర్తలాలో ఘనస్వాగతం లభించింది. అగర్తలా విమానాశ్రయం నుంచి స్థానిక మైదానం వరకు వేలమంది అభిమానులు ఆమెకు స్వాగతం పలికారు. కోచ్ బిశ్వేష్వర్ నందితో కలిసి ఓపెన్ టాప్ జీపులో ఆమె స్వాగతోత్సవం దాదాపు 12 కిలోమీటర్లు సాగింది. దాదాపు ఐదువేల మంది ఈ ర్యాలీలో పాల్గొని ఆమెకు జయజయధ్వానాలు చేశారు. మైదానంలో ఆమెకు త్రిపుర ప్రభుత్వం ఘనసత్కారం నిర్వహించింది. ఆమె విజయోత్సవ ర్యాలీలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. అభిమానులతో కలిసి తనకు స్వాగతం పలుకుతున్న అక్కను చూడగానే దీప హృదయం ఉప్పొంగిపోయింది. వెంటనే ఓపెన్ జీపులో నుంచి అమాంతం కిందకు దూకేసింది. ఎంతైనా టాప్ క్లాస్ జిమ్నాస్ట్ కదా! ఎలాంటి ఇబ్బంది పడకుండా అలవోకగా జీపులోంచి దిగి.. పరిగెత్తుకెళ్లి తన సోదరిని ఆమె హత్తుకుంది. తోబుట్టువుల మధ్య ఉండే ప్రేమానురాగాలను ఈ ఘటన చాటింది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత సాధించిన తొలి క్రీడాకారిణిగా దీప సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రమాదకరమైన విన్యాసం ప్రోడునోవా విభాగంలో అద్భుత ప్రతిభాపాటవాలు చాటి ఆమె ఫైనల్‌కు వెళ్లింది. కేవలం 0.15 పాయింట్ల తేడాతో పతకం కోల్పోయిన ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. రియో ఒలింపిక్స్‌లో దీప పతకం గెలువకపోయినా.. తన పోరాటస్ఫూర్తితో 120 కోట్ల భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రివార్డులు ప్రకటిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆమెకు రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. -
సింధు రజితం గెలుపుపై హర్షం
బిజినేపల్లి: రియో ఒలింపిక్ బ్యాట్మింటన్‌లో తెలుగు తేజం సింధు ఫైనల్లో రజితం పతకం సాధించడంపై పాలెం నేతాజీ యువజన సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. బ్యాట్మింటన్‌లో ఫైనల్లో సింధు స్వర్ణ పతకం సాధించేందుకు ఎంతగానో కషి చేసినా ఫలితం దక్కకపోవడం బాధాకరమన్నారు. ఏది ఏమైనా దేశంలో వ్యక్తిగత రజితం పతకం సింధు సాధించడం గొప్ప విషయమన్నారు. హర్షం ప్రకటించిన వారిలో శ్రీనివాస్‌గౌడ్, సిరిజంగం శ్రీనివాసులు, శ్రీనివాస్, నాగరాజు, జ్ఞానేశ్వర్, కష్ణ, రేణుగౌడ్ ఉన్నారు. -
జర్మనీకి షాకిచ్చిన బ్రెజిల్
రియో డిజెనీరో: నేమర్ మెరుపులతో బ్రెజిల్ మెరిసింది. సొంత గడ్డపై జరుగుతున్న ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారిగా ఫుట్‌బాల్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. శనివారం మారకనా మైదానంలో జరిగిన ఫైనల్ పోరులో జర్మనీని ఓడించిన బ్రెజిల్ పసిడిని ముద్దాడింది. బ్రెజిల్ షూటౌట్లో 5-4తేడాతో జర్మనీపై గెలిచింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు తలో గోల్ నమోదు చేయకపో్వడంతో షూటౌట్ అనివార్యమైంది. ఇందులో జర్మనీని నిలువరించిన బ్రెజిల్ చాంపియన్‌గా అవతరించింది.దాంతోపాటు రెండేళ్ల కిందట సొంతగడ్డపై జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో జర్మనీ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఆ వరల్డ్ కప్ లో బ్రెజిల్ 1-7 గోల్స్ తేడాతో ఓటమిపాలైంది. ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ ఆటగాడు నేమర్ ఆద్యంతం రాణించాడు. ఫస్ట్ హాఫ్‌లో ఫ్రీకిక్ ద్వారా గోల్ చేసి బ్రెజిల్‌ను ఆధిక్యంలో నిలిపాడు. అయితే, 59వ నిమిషంలో జర్మనీ కెప్టెన్ మాక్స్ మెయర్ గోల్ చేయడంతో స్కోరు సమమైంది. ఆ తరువాత బ్రెజిల్-జర్మనీలు తమ డిఫెన్స్‌తో ఆకట్టుకోవడంతో నిర్ణీత వ్యవధిలో మరో గోల్ రాలేదు. ఆపై మరో ఆరు నిమిషాలు అదనపు సమయంలో ఇరు జట్లు గోల్ చేయకపోవడంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు పెనాల్టీ షూటౌట్లో జర్మనీ ఆటగాడు ఒకసారి విఫలమవ్వగా.. బ్రెజిల్ ఐదుసార్లు గోల్ చేసింది. దీంతో 5-4 తేడాతో బ్రెజిల్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఒలింపిక్స్ ఫుట్‌బాల్ గేమ్‌లో బ్రెజిల్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. గతంలో మూడుసార్లు(1984, 88, 2012 ) ఒలింపిక్స్ ఫైనల్ కు చేరిన బ్రెజిల్ రజతంతో సంతృప్తి పడింది. కాగా నాల్గో ప్రయత్నంలో స్వర్ణాన్ని సాధించడంలో బ్రెజిల్ సఫలమై తమ దేశంలో అభిమానులకు రెట్టింపు జోష్‌ను అందించింది. -
సందీప్ తోమర్ అవుట్
రియో డి జనీరో: పురుషుల 57కేజీ ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ సందీప్ తోమర్ పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్స్‌లో తను రష్యాకు చెందిన విక్టర్ లెబెడేవ్ చేతిలో 3-7 తేడాతో ఓడాడు. ఆరు నిమిషాల ఈ బౌట్లో సందీప్ ఏ దశలోనూ ప్రత్యర్థిపై పట్టు సాధించలేకపోయాడు. ఆదిలోనే 5-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన విక్టర్ పైచేయి సాధించాడు. అయితే ఆ తర్వాత విక్టర్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోవడంతో సందీప్‌కు రెప్‌చేజ్ అవకాశం కూడా లేకుండాపోయింది. దీంతో తను రియో నుంచి నిష్ర్కమించాల్సి వచ్చింది. 34వ స్థానంలో సందీప్ కుమార్ 50 కి.మీ రేసు నడక ఫైనల్లో సందీప్ కుమార్ 4:07:55 టైమింగ్‌తో 34వ స్థానంలో నిలిచాడు. విజేతగా నిలిచిన మటెజ్ టోత్కన్నా తను 26 నిమిషాల 57 సెకన్ల ఆలస్యంగా లక్ష్యాన్ని చేరుకున్నాడు. 80 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ రేసును 48 మంది మాత్రమే పూర్తి చేయగలిగారు. -
నా కెరీర్లో ఇదే బెస్ట్ మోమెంట్!
రియో డిజెనీరో: రియో ఒలింపిక్స్ విమెన్ సింగిల్స్ విభాగంలో సెమీస్‌లోకి అడుగుపెట్టిన భారత షట్లర్ పీవీ సింధు తన విజయప్రస్థానాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని భావిస్తోంది. లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన చైనా షట్లర్ యిహన్ వాంగ్‌ను వరుస సెట్లలో ఓడించి సెమీస్‌లోకి ప్రవేశించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. తన కెరీర్లో ఉత్తమ విజయాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుందని పేర్కొంది. సెమీస్‌లో జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహరాపై కూడా మంచి ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిపింది. 'రియో ఒలింపిక్స్‌లో ఈ విజయం సాధించడం ఓ భిన్నమైన భావనను కలిగిస్తోంది. ఇది నా కెరీర్లో బెస్ట్ మూమెంట్. మున్ముందు మరిన్ని విజయాలు వస్తాయని నేను ఆశిస్తున్నా' అని సింధు పేర్కొంది. వరల్డ్ నంబర్ 10 ర్యాంకర్ అయిన సింధు.. సైనా తర్వాత ఒలింపిక్స్ సెమీస్‌లోకి అడుగుపెట్టిన తొలి భారతీయ షట్లర్‌గా రికార్డు సృష్టించింది. హోరాహోరీగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సహనంతో చివరివరకు పోరాడటం వల్లే తనకు విజయం దక్కిందని ఆమె పేర్కొంది. -
సింధు అయినా మన ఆశల్ని నిలబెట్టాలి!
రియో ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు అదృష్టం అన్నది ఒక్కసారి కూడా భారత్ వైపు నిలబడలేదు. మొదట షూటర్ అభినవ్ బింద్రా త్రుటిలో పతకం చేజార్చుకొని నాలుగోస్థానానికి పరిమితమయ్యాడు. ఆ తర్వాత సానియా-బోపన్న జోడీ కూడా సెమీస్‌కు వెళ్లినా పతకం తేలేకపోయారు. ఎన్నో ఆశలు రేకెత్తించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ కూడా ఫైనల్ అద్భుత విన్యాసాలు చేసినా పతకం సాధించకుండా నిరాశగా వెనుదిరిగింది. నాలుగో స్థానానికి పరిమితమైంది. భారత షూటర్లు, బాక్సర్లు, అథ్లెట్లు రియో ఒలింపిక్స్‌లో తమ పోరాటం ముగించుకొని ఉత్త చేతులతో ఇంటిదారి పట్టారు. ఈ నేపథ్యంలో షటర్లపై దేశ ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు. వారి ఆశల్ని, ఆకాంక్షల్ని నిలబెడుతూ అద్భుతమైన పోరాటస్ఫూర్తి కనబర్చిన సింధు బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీస్‌లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్ లో ప్రపంచ నంబర్-2, చైనా క్రీడాకారిణి యిహాన్ వాంగ్‌పై 22-20, 21-19 తేడాతో గెలుపొంది సెమీస్‌లోకి అడుగుపెట్టింది. చైనా గోడను విజయవంతంగా దాటిన సింధుకు ట్విట్టర్లో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సెమీస్‌లోకి చేరిన సింధు అయిన పతకం సాధించాలని నెటిజన్లు ఆకాంక్షించారు. ఆమె విజయం కోసం ప్రార్థించారు. సెలబ్రిటీలు, క్రీడాకారులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు సింధు విజయం హర్షం వ్యక్తం చేశారు. సింధు నిజమైన చాంపియన్ అంటూ కొనియాడుతూ నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. Very well played Sindhu...God bless for your next match too — Randhir Singh (@RANDHIR1946) August 16, 2016 @Pvsindhu1 congratulations to u for reaching the semi finals -
పోకెమాన్ గో ‘గో..’
రియో డి జనీరో: ఒలింపిక్స్ జరిగే నగరంలో క్రీడల సందడి విపరీతంగా ఉంటుంది. అందరూ స్టేడియాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ రియోలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడి వాళ్లు చేతిలో ఫోన్లు పట్టుకుని ‘గేమ్’ ఆడుతూ ఒలింపిక్స్‌ను పట్టించుకోవడం లేదు. దీనికి కారణం పోకెమాన్ గో. యువత అంతా చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకుని పోకెమాన్లను వెతికి పట్టుకునేందుకు వీధుల వెంబడి తిరుగుతున్నారే కానీ అత్యంత ప్రతిష్టాత్మక గేమ్స్ తమ దగ్గరే జరుగుతున్నాయనే ఆలోచనలో లేరు. గేమ్స్‌కు రెండు రోజుల ముందు బ్రెజిల్లో పోకెమాన్ గో ఆప్‌ను విడుదల చేశారు. అంతే.. క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే.. రియో పార్క్ దగ్గర శనివారం వందలాది మంది తమ చేతిలో మొబైల్ ఫోన్లు పట్టుకుని ఇలాగే వెతుకుతూ కనిపించారు. రియోలో ఈ గేమ్‌ను 20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నట్టు అంచనా. -
రిసెప్షనిస్టే కదా అనుకున్నాడు కానీ.. !
రియో ఒలింపిక్స్ లో పతకం సాధించిన బెల్జియం జూడో క్రీడాకారుడికి చేదు అనుభవం ఎదురైంది. మాంఛి కండలు తిరిగిన ఈ క్రీడాకారుడు ఓ హోటల్ రిసెప్షనిస్టును తేలికగా తీసుకున్నాడు. మహిళే కదా అని ఆమెను తోసి హోటల్ లోకి వెళ్దామని ప్రయత్నించాడు. కానీ ఆమె ఒక్కటే ఒక్క పంచ్ ఇచ్చింది. దెబ్బకు అతడి కన్ను వాచి నల్లగా కమిలిపోయింది. ఆ మహిళా రిసెప్షనిస్ట్ బ్రెజిల్ మార్షల్ ఆర్ట్స్ గా పేరొందిన జుజిత్సు నిపుణురాలు. ఆమె గురించి తెలియక దూకుడు చూపబోయిన అతనికి ఒక్కసారిగా చుక్కలు కనబడ్డాయి. బ్రెజిల్ క్రీడాకారుడు డిర్క్ వాన్ టిచెల్ట్ (32) 72 కిలోల జూడో విభాగంలో ఒలింపిక్స్ రజత పతకం సాధించాడు. ఈ ఆనందంలో సోమవారం రాత్రి విజయోత్సవం చేసుకుంటున్న అతడికి చేదు అనుభవం ఎదురైంది. ఓ గుర్తుతెలియని మహిళ అతని ట్రైనర్ జేబులోంచి సెల్ ఫోన్ దొంగలించి.. సమీపంలో ఉన్న బెస్ట్ వెస్ట్రర్న్ ప్లస్ హోటల్ లోకి పరారైంది. ఆమెను వెంబడిస్తూ హోటల్ లోకి వెళ్లబోయిన డిర్క్ ను రిసెప్షనిస్టు నిలువరించింది. దీంతో ఆమెతో డిర్క్ వాగ్వాదానికి దిగాడు. దొంగకు రిసెప్షనిస్టుగా అండగా నిలుస్తున్నదని ఆరోపిస్తూ.. ఆమెను తప్పించుకొని హోటల్ లోకి వెళ్లేందుకు డిర్క్ ప్రయత్నించాడని, దీంతో ఆమె ఒక్క పంచ్ ఇచ్చిందని, ఆ దెబ్బకు అతని కన్ను నల్లగా కమిలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
రియో.. వెలుగుల్లో చీకట్లు
ఆటపాటలతో ఎల్లప్పుడూ కళకళలాడుతుంటుంది. హింసా నేరాలు అధికమే అయినా సాంబా కార్నివాల్‌తో ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేస్తుంది. అక్కడి జనం తమకు ఆర్థిక ఇబ్బందులున్నా ఆత్మీయ ఆతిథ్యంతో మనసులు కొల్లగొడతారు. ప్రపంచ క్రీడా సంరంభం నిర్వహణ అవకాశం దక్కించుకుని ఆనందంతో కేరింతలు కొట్టారు. కానీ.. రియో ఒలింపిక్ జ్యోతి వెలుగుల చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి. ప్రపంచ జనం బ్రెజిల్ వైపు భయంభయంగా చూస్తున్నారు. అక్కడ ఏ దోమ కుడుతుందో.. ఎక్కడ జికా వైరస్ బారిన పడతామో అన్న ఆందోళన. ఆ దేశంలో ఏ దారిలో ఎలా దోపిడీకి గురవుతామోనన్న భయం. దేశాధ్యక్షురాలిని అవిశ్వాసం పెట్టి పదవీచ్యుతురాలిని చేయటం.. మరొక మాజీ అధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలతో విచారణ! ఈ రాజకీయ సంక్షోభంతో రగులుతున్న దేశాన్ని.. అంతకన్నా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కుదేలు చేస్తోంది! ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు క్షీణిస్తున్నాయి.. నిత్యావసరాల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న రియో నగరమే ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన దుస్థితి!! ఈ పరిస్థితుల్లో అసలు మా దేశంలో ఈ ఆటలేం వద్దని బ్రెజిల్ వాసులే మండిపడుతున్నారు. ఆటల కోసం తమ దేశానికి రావద్దని ప్రజలే పోపొమ్మంటున్నారు. వచ్చిన క్రీడాకారులపై రాళ్లూ విసురుతున్న ఘటనలూ కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ క్రీడల నిర్వహణకు పెడుతున్న వ్యయంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని.. కోలుకోవటం చాలా కష్టమని అక్కడి ప్రజల భయాందోళన!! అయినా.. కళ్లు మిరుమిట్లు గొలిపే కాంతులతో ఒలింపిక్స్ మొదలయ్యాయి. ఆ రియో ఒలింపిక్స్ వెలుగుల చుట్టూ కమ్ముకున్న చీకట్లపై ‘సాక్షి’ ఫోకస్... - సెంట్రల్ డెస్క్ ♦ ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నడుమ బ్రెజిల్ ఒలింపిక్స్ ♦ ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా దేశ ప్రజల ఆందోళనలు ♦ ఆర్థిక పరిస్థితి బాగున్నపుడు ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ ♦ ఐదేళ్లుగా ఆర్థిక దుస్థితి.. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ♦ ఆపై గుదిబండగా మారిన ఒలింపిక్స్ ఏర్పాట్ల వ్యయం ♦ మరోవైపు రాజకీయ అనిశ్చితి.. దేశాధ్యక్షురాలిపై అభిశంసన ♦ మరో మాజీ దేశాధ్యక్షుడిపై అవినీతి ఆరోపణలతో విచారణ ♦ ఒలింపిక్స్ వల్ల కీడే ఎక్కువని 63 శాతం ప్రజల వ్యతిరేకత ♦ అయినా.. ఘనంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహిస్తున్న బ్రెజిల్ అభివృద్ధి వెలిగిపోయిన దశ... ఆర్థికంగా చూస్తే.. పోర్చుగీసు వలస పాలనలో చెరకును వాణిజ్య పంటగా భారీ ఎత్తున సాగుచేశారు. పంచదారను యూరప్‌కు ఎగుమతి చేసేవారు. అనంతరం 18వ శతాబ్దం చివరికి కాఫీ సాగు, ఎగుమతులతో మళ్లీ నిలదొక్కుకుంది. అనేక ఎత్తుపల్లాల్లో పయనిస్తూ.. సంస్కరణలు, ప్రణాళికలతో 20వ శతాబ్దం ఆరంభంలో గణనీయమైన ఆర్థికవృద్ధిని సాధించింది. రియో తీరంలో చమురు వెలికి తీయటం దీనికి తోడ్పాటునిచ్చింది. నిజానికి 2001లో ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నాలుగు దేశాలుగా.. ఇండియా, రష్యా, చైనాలతో పాటు బ్రెజిల్ కూడా గుర్తింపు పొందాయి. ఈ నాలుగు దేశాలూ బ్రిక్ కూటమిగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత వీటికి దక్షిణాఫ్రికా కూడా జతకలవటంతో కూటమి పేరు బ్రిక్స్‌గా మారింది. అమెరికా వంటి అగ్రరాజ్యాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుని కుంటి నడక నడుస్తుండగా.. బ్రెజిల్ స్థిరమైన ఆర్థికవృద్ధి రేటును కొనసాగించింది. ఆ క్రమంలోనే.. ప్రపంచ ఫుట్ బాల్ క్రీడలకు, ప్రపంచ ఒలింపిక్స్‌కు తాము ఆతిథ్యమిస్తామని ముందుకొచ్చింది.వరుసగా రెండు భారీ కార్యక్రమాలు.. 2014లో ఫుట్‌బాల్ క్రీడల నిర్వహణకు, 2016లో ఒలింపిక్స్ నిర్వహణకు పలు ఇతర దేశాలతో పోటీ పడి అవకాశం దక్కించుకుంది. దక్షిణ అమెరికా ఖండంలో ఒలింపిక్స్ నిర్వహణకు అవకాశం లభించిన తొలి దేశంగా నిలిచింది. 2009లో ఆ అవకాశం లభించిన రోజు.. బ్రెజిల్ ప్రజలు ప్రత్యేకించి రియో డీ జెనీరియో నగర వాసులు ఆనందోత్సాహాల్లో తేలిపోయారు. ఆ క్రీడల నిర్వహణ.. దేశానికి కీర్తిప్రతిష్టలు తేవటమే కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి కూడా దోహదపడతాయని.. పర్యాటకం పెరుగుతుందని, ఉద్యోగాలు పెరుగుతాయని అంతా భావించారు. ఆర్థిక సంక్షోభం.. ఆపై పెను భారం..! అయితే.. గత దశాబ్దంలో ప్రపంచాన్ని ఆవరించిన ఆర్థిక మాంద్యం ప్రభావం బ్రెజిల్‌పై కూడా పడింది. 2011 ఆరంభంలో బ్రెజిల్ ఆర్థికవృద్ధి మందగించటం మొదలైంది. ప్రధాన ఎగుమతులైన సోయా, చమురు, పంచదారల ధరలు పడిపోయాయి. అదే సమయంలో బ్రెజిల్ ప్రభుత్వ చమురు సంస్థ పెట్రోబ్రాస్‌పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దేశ జీడీపీ (స్థూల జాతీయోత్పత్తి)లో ఒక్క పెట్రోబ్రాస్ వాటానే 5 శాతం ఉంటుంది. ఆ సంస్థ భారీ స్థాయిలో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. లక్షల కోట్ల డాలర్లు బకాయిపడింది. దీంతో అమెరికాలో ఈ సంస్థ షేర్ హోల్డర్లు సంస్థపై కేసు వేశారు. ఈ పరిణామాలతో ఆర్థిక స్థితి మరింత క్లిష్టం కావటంతో పాటు రాజకీయ సంక్షోభమూ రాజుకుంది. రెండూ కలగలసి పరిస్థితి మరింత దిగజారింది. వేతనాలు పడిపోయాయి. నిరుద్యోగం పెరిగింది. ఆర్థికవృద్ధి ఉజ్వలంగా ఉన్నపుడు తీసుకున్న గృహ రుణాలను చెల్లించలేక బ్రెజిల్ మధ్యతరగతి సతమతవుతోంది. ఈ పరిస్థితుల్లో 2016 ఒలింపిక్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేయటం కోసం భారీ ఎత్తున నిధులు వెచ్చించటం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లయింది. ఇతర ముఖ్యమైన అవసరాలకు నిధులను కత్తిరించి మరీ క్రీడా మైదానాలు, రహదారుల వంటి మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం కేటాయించాల్సి వచ్చింది. అది కూడా అంతంత మాత్రం నిధులే సమకూరాయి. ఉదాహరణకు.. కొన్ని క్రీడా పోటీలను నిర్వహించే గ్వానాబారా బేను శుభ్రం చేయటానికి 400 కోట్ల డాలర్లు వెచ్చించాలని తొలుత రియో డి జెనీరియో నగరం నిర్ణయించింది. కానీ.. చివరికి కేవలం 1.7 కోట్ల డాలర్లు మాత్రమే ఖర్చుపెట్టగలిగింది. ఈ నేపథ్యంలో.. ఒలింపిక్స్ ఏర్పాట్లు సకాలంలో పూర్తికావటం లేదని, నాణ్యత లోపించిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. పరిస్థితి ఎంతగా దిగజారిందంటే.. ఈ ఏడాది జూన్‌లో రియోలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 9 కోట్ల డాలర్ల సాయం అడిగారు. మొత్తం మీద బ్రెజిల్.. గత 80 ఏళ్లలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోంది. ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో వినియోగదారుల్లో విశ్వాసం సడలిపోయి పరిస్థితి మరింతగా క్షీణించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో 2014 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల నిర్వహణ సమయంలోనే నిరసనలు వెల్లువెత్తాయి. నిజానికి స్థానిక ప్రయాణ చార్జీల పెంపుపై మొదలైన ఆందోళనలు.. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలతో ముదిరిపోయాయి. అదే సమయంలో ఫుట్‌బాల్ క్రీడా ఏర్పాట్లకు నిధులు వ్యయం చేయటంపైనా నిరసనలు పెల్లుబికాయి. ఇప్పుడు ఒలింపిక్స్ ఏర్పాట్ల కోసం ప్రజావసరాలకు నిధులు కోతపెట్టి అటు మళ్లించటంతో జనంలో ఆగ్రహం పెల్లుబికింది. పైగా.. ఈ ప్రపంచ క్రీడల నిర్వహణ కోసం తొలుత వేసిన అంచనా కన్నా దాదాపు రెట్టింపు ఎక్కువగా మొత్తం 1,200 కోట్ల డాలర్ల వ్యయం అవుతుందని లెక్కగట్టారు. ఇన్ని నిధులను వెచ్చించినా ఒలింపిక్స్ వల్ల తమకు ఒరిగేది ఏమీ ఉండకపోగా.. ఈ ఊబి నుంచి బయటపడటానికి ఎంత కాలం పడుతుందో.. పరిస్థితి ఇంకెంత దిగజారుతుందో అన్న ఆందోళన ప్రజలను పీడిస్తోంది. గతంలో లండన్‌లో ఒలింపిక్ క్రీడలకు 1,500 కోట్ల డాలర్లు వ్యయం చేసినా.. ఆశించిన అభివృద్ధి దక్కలేదని, ఆ క్రీడా మైదానాలన్నీ ఇప్పుడు నిరుపయోగంగా పడి ఉన్నాయని ఉదహరిస్తున్నారు. అలాగే.. గ్రీస్ కూడా ఒలింపిక్స్ నిర్వహించిన తర్వాత ఆ వ్యయ భారంతో ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిందన్న విషయాన్నీ గుర్తుచేస్తున్నారు. ఇలాంటపుడు ఒలింపిక్స్ నిర్వహించవద్దని.. ఆ నిధులను దేశంలో పాఠశాలలు, ఆస్పత్రుల కోసం వెచ్చించవచ్చని సామాన్య పౌరుల మనోగతం. ఇలా దేశ వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒలింపిక్స్ నిర్వహణపై ఇటీవల ఒక అభిప్రాయ సర్వే నిర్వహించగా.. దానివల్ల జరిగే మేలు కంటే హానే ఎక్కువగా ఉంటుందని 63 శాతం మంది బ్రెజిల్ పౌరులు ఆందోళన వ్యక్తంచేశారు. బ్రెజిల్ చరిత్ర క్లుప్తంగా... బ్రెజిల్... దక్షిణ అమెరికా ఖండంలోని ఈ దేశం విస్తీర్ణపరంగా ప్రపంచంలో ఐదో అతి పెద్ద దేశం. భారతదేశం కన్నా దాదాపు మూడు రెట్లు పెద్దది. అయినా జనాభా 20 కోట్ల పై చిలుకు మాత్రమే. దేశంలో అధికార భాష పోర్చుగీసు. జనాభాలో 99 శాతం మంది ఆ భాష మాట్లాడతారు. పదిహేనో శతాబ్దంలో యూరప్ వలసలు మొదలవటానికి ముందు.. ఇప్పటి బ్రెజిల్లో దాదాపు 2,000 వరకూ స్థానిక ఆదివాసీ జాతులు నివసించేవి. వారంతా పాక్షిక సంచార జాతులుగా ఉంటూ వేట, చేపలు పట్టడం, ఆహార సేకరణ, సంచార వ్యవసాయం ఆధారంగా జీవించేవారు. యూరప్ నుంచి.. ప్రత్యేకించి పోర్చుగీస్ నుంచి వలసల వెల్లువ రాకముందు ఈ ఆదివాసీ జనాభా సుమారు 24 లక్షల మందిగా ఉన్నట్లు అంచనా. కానీ ఇప్పుడా సంఖ్య కేవలం ఎనిమిది లక్షల చిల్లరకు కుదించుకుపోయింది. జాతుల సంఖ్య కూడా సుమారు 200కు తగ్గిపోయింది. యూరప్ నుంచి వచ్చిన వ్యాధులు బారిన పడి లక్షలాది మంది చనిపోగా.. చాలా మంది ‘బ్రెజిల్ జనాభా’లో కలిసిపోయారు. తొలుత పోర్చుగీస్ వలసదారులు, ఆఫ్రికా నుంచి బానిసలుగా తెచ్చిన నల్లవారు అధికంగా ఉండగా.. అనంతర కాలంలో యూరప్, అరబ్, జపాన్ దేశాల నుంచీ వలసలు వచ్చి స్థిరపడ్డారు. వీరందరి సమ్మేళనంతో బ్రెజిల్ విలక్షణ సాంస్కృతికతను, జాతీయతను సంతరించుకుంది. 1533 నుంచి పోర్చుగీసు సామ్రాజ్య వలస పాలనలో ఉన్న బ్రెజిల్ అనేక రాజకీయాల పరిణామాల అనంతరం 1889లో గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. అనేక పరిణామాల అనంతరం గణతంత్రం నిలదొక్కుకుంది. దేశంలో రాజకీయ అనిశ్చితి... ఒకవైపు ఆర్థిక సంక్షోభం ముదురుతోంటే.. మరొక వైపు దానికి పెనవేసుకుని రాజకీయ సంక్షోభం కూడా తీవ్రమైపోయింది. దేశ తొలి మహిళా అధ్యక్షురాలైన దిల్మా రౌసెఫ్‌పై అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షం తీసుకొచ్చిన అభిశంసన తీర్మానాన్ని ఈ ఏడాది మే నెలలో దేశ సెనేట్ ఆమోదించింది. దీంతో ఆమెను అధ్యక్ష పదవి నుంచి సస్పెండ్ చేశారు. అభిశంసన విచారణ తుది ప్రక్రియ ఇంకా జరగాల్సి ఉంది. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల సందర్భంగా దేశ ఆర్థిక పరిస్థితి బాగున్నట్లు చూపేందుకు అధికారిక బడ్జెట్ లెక్కలను తారుమారు చేశారని.. ప్రభుత్వ రంగ బ్యాంకుల నిధులను వినియోగించారని ఆమెపై ఉన్న ఆరోపణలు. దిల్మా గతంలో పెట్రోబ్రాస్ సంస్థకు అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఎంతో ప్రజాదరణ గల లులా డసిల్వా తర్వాత 2011లో బ్రెజిల్ అధ్యక్ష పదవిని చేపట్టిన దిల్మా అప్పుడు ఎన్నికల కోసం పెట్రోబ్రాస్ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలూ ఎదుర్కొన్నారు. మరోవైపు మాజీ అధ్యక్షుడైన లులాపైన కూడా పెట్రోబ్రాస్ నిధులను దుర్వినియోగం చేశారని, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో విచారణ ప్రారంభించారు. ఇంకా ప్రభుత్వంలోని మంత్రుల పైనా, పార్లమెంటు సభ్యులపైనా భారీ ఆరోపణలు, విచారణలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉపాధ్యక్షుడు మైఖేల్ టైమర్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నప్పటికీ.. రాజకీయ అస్థిరత తీవ్రమవుతూ ఆర్థిక సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేస్తోంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా.. బ్రెజిల్ ఒలింపిక్స్‌ను నిర్వహిస్తోంది. ఒకవైపు నిరసనలు వెల్లువెత్తుతున్నా.. దేశంలోని క్రీడాభిమానులు కూడా ఆటల పోటీలను వీక్షించేందుకు పోటెత్తుతున్నారు. వణికిస్తున్న జికా వైరస్... ప్రపంచాన్ని వణికిస్తోన్న జికా వైరస్.. బ్రెజిల్లో, అందులోనూ రియో డీ జెనీరియోలో విస్తరించినంతగా ప్రపంచంలో మరెక్కడా విస్తరించలేదు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ వైరస్ కారణంగా పుట్టబోయే పిల్లల్లో అనేక అవయవ లోపాలు తలెత్తుతున్న పరిస్థితి ప్రపంచాన్ని కలవరపెడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోనే బ్రెజిల్లో 1.65 లక్షల జికా కేసులు నమోదయ్యాయి. అందులో నాలుగో వంతు కేసుల్లో రియో రాష్ట్రంలోనివే. ఈ అంశం ఒలింపిక్స్‌ను స్వయంగా వీక్షించాలనుకునే క్రీడాభిమానులనే కాదు.. ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులనూ భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ భయంతోనే కొంతమంది క్రీడాకారులు కూడా ఈసారి ఒలింపిక్స్‌కు దూరంగా ఉన్నారు. బ్రెజిల్.. హత్యల రాజధాని!? మామూలుగానే బ్రెజిల్లో హత్యలు, దోపిడీలు, హింస సంబంధిత నేరాలు ఎక్కువ. అసలు హత్యలు అధికంగా జరిగే దేశాల్లో ప్రపంచ రాజధానిగా బ్రెజిల్‌నే చెప్పవచ్చంటూ.. సెంటర్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ అండ్ క్రిమినల్ జస్టిస్ అనే సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే బ్రెజిల్ నగరాల్లో అత్యధిక హత్యలు జరుగుతాయని చెప్పింది. అయితే.. దేశంలోని నగరాలన్నిటిలో రియో భద్రమైన నగరమని కాస్త ఊరటనిచ్చింది. పైగా.. ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ఇటీవల నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. విదేశీ పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలు జరుగుతున్న ఘటనలూ వెలుగుచూస్తున్నాయి. రియో రాష్ట్రంలో పోలీసుశాఖ నిధుల్లో మూడో వంతు కోత పెట్టిన ఫలితంగా.. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో నేరాల సంఖ్య 15 శాతం పెరిగిపోయింది. పోలీసులు సమ్మెకు దిగారు. పోలీసు సిబ్బందే.. ‘నరకానికి స్వాగతం.. రియో డీ జెనీరోకు ఎవరు వచ్చినా క్షేమంగా ఉండరు’ అని రాసిన బ్యానర్లను పట్టుకుని అంతర్జాతీయ విమానాశ్రయం ఎదుట నిలబడ్డ దుస్థితి. -
డబుల్స్‌లో బోపన్న ర్యాంక్ మెరుగు
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ ఆటగాడు రోహన్ బోపన్న రియో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాలు మెరుగుపడుతున్నాయి. సోమవారం విడుదల చేసిన ఏటీపీ తాజా ర్యాంకింగ్స్‌లో బోపన్న రెండు స్థానాలు మెరుగుపర్చుకుని 11వ స్థానంలో నిలిచాడు. రోమ్ మాస్టర్స్ టోర్నీలో సెమీస్‌కు చేరడంతో బోపన్న-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జంటకు 360 పాయింట్లు లభించాయి. టాప్-10లో ఉండే ఆటగాడు ఒలింపిక్స్‌లో తన భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉండటంతో బోపన్న ఇప్పుడు ర్యాంక్‌ను మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టిపెట్టాడు. వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్ నాలుగు స్థానాలు ఎగబాకి 50వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. సాకేత్ 125వ ర్యాంక్‌లో ఉన్నాడు.