పూడ్చిపెట్టకండి.. త్వరలో నేను బతికిరావొచ్చు! | Sakshi
Sakshi News home page

పూడ్చిపెట్టకండి.. త్వరలో నేను బతికిరావొచ్చు!

Published Fri, Nov 18 2016 12:45 PM

పూడ్చిపెట్టకండి.. త్వరలో నేను బతికిరావొచ్చు!

నన్ను పూడ్చిపెట్టకండి. నా శరీరాన్ని ఐస్‌లో భద్రపరచండి. భవిష్యత్తులో క్యాన్సర్‌కు చికిత్స కనుగొనవచ్చు. అప్పుడు నేను బతికే అవకాశం ఉంటుంది.. ఇది ఇటీవల మృతిచెందిన 14 ఏళ్ల బాలిక చివరి కోరిక. ఆమె కోరికను బ్రిటన్‌ కోర్టు మన్నించింది. 
 
లండన్‌కు చెందిన ఈ బాలిక గత ఏడాది ఆగస్టులో క్యాన్సర్‌ బారిన పడింది. తెలివైన అమ్మాయిగా పేరుతెచ్చుకున్న ఆమె అన్ని వైద్యచికిత్సలు విఫలమవ్వడంతో నెలరోజుల తర్వాత ప్రాణాలు విడిచింది. అయితే, తాను చనిపోయేముందు బ్రిటన్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ పీటర్‌ జాక్సన్‌కు లేఖ రాసింది. ‘నేను జీవించాలనుకుంటున్నా. చాలాకాలం జీవించాలనుకుంటున్నా. నాకు సోకిన క్యాన్సర్‌కు భవిష్యత్తులో చికిత్స కనుగొనవచ్చు. అప్పుడే నేను మేలుకుంటాను. క్రియోజెనిక్‌ (ఐస్‌తో గడ్డకట్టించే) పద్ధతిలో నా శరీరాన్ని పరిరక్షించడం ద్వారా వందేళ్ల తర్వాత అయిన నాకు చికిత్స అందించే నన్ను మేలుకొలిపే అవకాశం ఉండొచ్చు’ అని ఆమె పేర్కొంది. ఆమె చివరికోరికను మన్నించిన జస్టిస్‌ పీటర్‌ జాక్సన్‌..  ఇలాంటి కేసు రావడం ఇంగ్లండ్‌లోనే తొలిసారి అని, ప్రపంచంలో కూడా ఇదే తొలి కేసు కావొచ్చునని పేర్కొన్నారు.

బాలిక మౌలిక ప్రిజర్వేషన్‌ ఆప్షన్‌ (క్రియోజెనిక్‌)ను ఎంచుకుంది. ఇందుకోసం 46వేల డాలర్ల (రూ. 31.31లక్షల) ఖర్చు అవుతుంది. విడాకులు తీసుకున్న బాలిక తల్లిదండ్రులు ఆమె చివరికోరికపై భిన్నంగా స్పందించారు. ఇలాంటి పద్ధతిని ఎంచుకోవడానికి బాలిక తండ్రి నిరాకరించగా, తల్లి మాత్రం తన బిడ్డ చివరి కోరిక నెరవేరాలని ఆకాంక్షించింది. తల్లి అభిప్రాయానికే కోర్టు మొగ్గుచూపింది.  

Advertisement
Advertisement