ప్రాజెక్టులన్నింటికీ ఒకే ఒప్పందం | The implementation of Interstate agreements | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులన్నింటికీ ఒకే ఒప్పందం

Mar 5 2016 3:27 AM | Updated on Sep 3 2017 7:00 PM

ప్రాజెక్టులన్నింటికీ ఒకే ఒప్పందం

ప్రాజెక్టులన్నింటికీ ఒకే ఒప్పందం

గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగలపై నిర్మించనున్న ఐదు బ్యారేజీలకు సంబంధించి మహారాష్ట్రతో కుదుర్చుకోనున్న....

అంతర్రాష్ట్ర ఒప్పందాల అమలుకు సీఎంల స్థాయిలో బోర్డు
సాక్షి, హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగలపై నిర్మించనున్న ఐదు బ్యారేజీలకు సంబంధించి మహారాష్ట్రతో కుదుర్చుకోనున్న అంతర్రాష్ట్ర ఒప్పంద పత్రం తయారీ తుది దశకు వచ్చింది. స్థూలంగా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఒకే ఒప్పంద పత్రం ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా పరస్పర సమన్వయం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న దృక్పథంతో ఒప్పంద పత్రాన్ని రూపొందిస్తోంది. అంతర్రాష్ట్ర ఒప్పందాల అమలుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల స్థాయిలో అంతర్రాష్ట్ర బోర్డు కీలకంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతోంది.

ఎలాంటి సమస్యలకైనా బోర్డు చేసే నిర్ణయమే తుది పరిష్కారం కావాలని భావిస్తోంది. అయితే ఒక్కో ప్రాజెక్టు పరిధిలో ఉండే సమస్యలు, వాటిని చర్చించేందుకు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో స్టాండింగ్ కమిటీ, ప్రాజెక్టు అధికారుల స్థాయిలో చర్చలు జరిపేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేలా ఒప్పందాన్ని రూపొందించనుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు ఏడాదికోసారి బోర్డు చైర్మన్‌గా వ్యవహరించేలా రొటేషన్ విధానాన్ని పాటించాలనే నిబంధనను ఒప్పందంలో పొందుపరచనుంది.

మరోవైపు మహారాష్ట్రతో ఒప్పందం విషయమై నీటిపారుదలశాఖ కార్యదర్శి ఎస్‌కే జోషీ ఇప్పటికే ముంబై వెళ్లి ఒప్పంద పత్రాలపై మహారాష్ట్ర అధికారులతో చర్చించారు. ఈ భేటీలో ‘మేడిగడ్డ’ ఎత్తు అంశంపైనా చర్చలు జరిపినట్లు తెలిసింది. ‘మేడిగడ్డ’ను 103 మీటర్ల ఎత్తులో కాకుండా ఒకట్రెండు మీటర్లు తక్కువ ఎత్తులో నిర్మించాలని మహారాష్ట్ర నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై ఈ నెల 7న జరిగే భేటీలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement