breaking news
International projects
-
‘మహా’ సంబురం!
♦ ఏడాదిగా చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం ♦ ఒప్పందంతో దశాబ్దాల కల సాకారం ♦ లెండి, ప్రాణహిత ప్రాజెక్టులకు మేలు ♦ సరిహద్దు ప్రాజెక్టులకు అనుమతులు సులభం ♦ కేసీఆర్‌కు అభినందనలు తెలిపేందుకు నేతలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ-మహారాష్ర్ట ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి రెండు రోజులుగా జరిపిన చర్చలతో మంగళవారం చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డి.శ్రీనివాస్, మంత్రులు హరీష్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్నలు, ఇతర ఉన్నతాధికారుల ప్రయత్నం ఫలించింది. సోమవారం మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుతో ముంబై రాజ్‌భవన్‌లో చర్చలు జరిపిన కేసీఆర్ బృందం.. మంగళవారం అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో ముంబైలోని సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన కీలక ఫైళ్లపై సంతకాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించి న ఆరు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఈ ఒప్పందం జరగ్గా.. జిల్లాకు చెందిన లెండి ప్రాజెక్టు, ప్రాణహిత ప్రాజెక్టులు ఉండటం జిల్లా ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. దశాబ్దాల కల సాకారం.. ప్రాజెక్టుల నిర్మాణంపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరడంతో దశాబ్దాల కల సాకారమైనట్లుగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిగా ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ నేతృత్వంలో మూడు పర్యాయాలు మంత్రుల బృందాలు అక్కడి సీఎంను కలిశాయి. సీఎం కేసీఆర్ రెండు సార్లు లేఖలు కూడా రాశారు. ఎట్టకేలకు సోమవారం, మంగళవారం రెండు రోజులు జరిపిన చర్చలు సఫలం కావడం, ప్రాజెక్టుల నిర్మాణంలో అడ్డంకులు తొలగేలా రెండు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, ఫడ్నవీస్‌లు ఒప్పందం సంతకాలు చేయడం చరిత్రాత్మక ఘట్టంగా చెప్తున్నారు. కాగా, జిల్లా సరిహద్దు ప్రాంతానికి పడమర గోదావరి నది ఆనుకొని ఉంది. ఈ నదిపై జిల్లా ప్రాంతంలో అనేక లక్షలాది ఎకరాల భూములు సాగులో ఉన్నాయి. తాగునీటికి కూడా ఇది ప్రధానంగా ఉంది. దీనిపై ప్రాజెక్టుల నిర్వహణ సంబంధించి మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కీలకంగా మారింది. ఈ ఒప్పందంతో ఈ నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్మాణ, సాగు, తాగునీరుకు గతంలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం దొరికినట్లయ్యింది. జిల్లాలో గోదావరి నది 110 కిలోమీటర్లు ప్రవేశించి కరీంనగర్ జిల్లాలో ప్రవేశిస్తుంది. ఇది నది గుండా ఇప్పటికే సాగు, తాగునీరు అందుతుంది. దీనిపై లెండి, ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులు నిర్మాణ దశలో కొనసాగుతున్నాయి. మహా ఒప్పందంతో ఈ ప్రాజెక్టులకు ఆటంకాలు తొలగిపోనున్నాయి. మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మహా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనితో ఇరురాష్ట్రాల మధ్య అంతరంగాలు, ఆటంకాలు తొలగిపోనున్నాయి. రాష్ట్రంలో తొలి అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటు చేసుకోవడం ప్రథమం. నీటి అవసరాలు, ప్రాజెక్టులకు సంబంధించి ఈ బోర్డు పరిశీలన చేపడుతుంది. స్వాగతం పలికేందుకు జిల్లా నేతలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర జలవివాదాలకు పుల్‌స్టాఫ్ పెడుతూ చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుని రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు జిల్లా నుంచి పెద్దమొత్తంలో ప్రజాప్రతినిధులు, నాయకులు హైదరాబాద్ విమానాశ్రయానికి తరలి వెళ్లారు. కీలక ఒప్పందాలతో స్వరాష్ట్రానికి తిరిగి వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని సోమవారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి పిలుపునిచ్చారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బిగాల గణేష్‌గుప్త, బాజిరెడ్డి గోవర్ధన్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డిలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. నాలుగు దశాబ్దాలుగా పరిష్కారం కాని వివాదాలను పరిష్కరించుకొని గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లించేందుకు మహా ఓప్పందం జరిగిందని, గతంలో ఒప్పందాలు కుదిరినా కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటిని ఒకే గొడుకు కిందికి తీసుకరావడం మంచి నిర్ణయమని నేతలు అభిపాయ పడుతున్నారు. గత ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలన్నింటికి రెండు ప్రభుత్వాలు కట్టుబడి ఉండేలా నిర్ణయాలు జరగడం, కొత్తగా చేపట్టబోయే ప్రాజెక్టుల సాంకేతిక అంశాలన్నింటిని నూతనంగా ఏర్పడిన బోర్డు పరిష్కారం చేయాలనడం మంచి పరిణామాలని వారు పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ఒప్పంద.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గోదావరి ప్రాజెక్టులపై మహారాష్ట్రతో ఏర్పర్చుకున్న తొలి అంతర్రాష్ట్ర బోర్డుగా వారు పేర్కొన్నారు. -
ప్రాజెక్టులన్నింటికీ ఒకే ఒప్పందం
అంతర్రాష్ట్ర ఒప్పందాల అమలుకు సీఎంల స్థాయిలో బోర్డు సాక్షి, హైదరాబాద్: గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగలపై నిర్మించనున్న ఐదు బ్యారేజీలకు సంబంధించి మహారాష్ట్రతో కుదుర్చుకోనున్న అంతర్రాష్ట్ర ఒప్పంద పత్రం తయారీ తుది దశకు వచ్చింది. స్థూలంగా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి ఒకే ఒప్పంద పత్రం ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలైనా పరస్పర సమన్వయం, చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్న దృక్పథంతో ఒప్పంద పత్రాన్ని రూపొందిస్తోంది. అంతర్రాష్ట్ర ఒప్పందాల అమలుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల స్థాయిలో అంతర్రాష్ట్ర బోర్డు కీలకంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దుతోంది. ఎలాంటి సమస్యలకైనా బోర్డు చేసే నిర్ణయమే తుది పరిష్కారం కావాలని భావిస్తోంది. అయితే ఒక్కో ప్రాజెక్టు పరిధిలో ఉండే సమస్యలు, వాటిని చర్చించేందుకు నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శుల స్థాయిలో స్టాండింగ్ కమిటీ, ప్రాజెక్టు అధికారుల స్థాయిలో చర్చలు జరిపేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేసేలా ఒప్పందాన్ని రూపొందించనుంది. ఇరు రాష్ట్రాల సీఎంలు ఏడాదికోసారి బోర్డు చైర్మన్‌గా వ్యవహరించేలా రొటేషన్ విధానాన్ని పాటించాలనే నిబంధనను ఒప్పందంలో పొందుపరచనుంది. మరోవైపు మహారాష్ట్రతో ఒప్పందం విషయమై నీటిపారుదలశాఖ కార్యదర్శి ఎస్కే జోషీ ఇప్పటికే ముంబై వెళ్లి ఒప్పంద పత్రాలపై మహారాష్ట్ర అధికారులతో చర్చించారు. ఈ భేటీలో ‘మేడిగడ్డ’ ఎత్తు అంశంపైనా చర్చలు జరిపినట్లు తెలిసింది. ‘మేడిగడ్డ’ను 103 మీటర్ల ఎత్తులో కాకుండా ఒకట్రెండు మీటర్లు తక్కువ ఎత్తులో నిర్మించాలని మహారాష్ట్ర నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై ఈ నెల 7న జరిగే భేటీలో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.