అమ్మా, ది గ్రేట్ బాహుబలి | Tamil Nadu CM Jayalalithaa's 'Baahubali' poster for Chennai floods sparks anger | Sakshi
Sakshi News home page

అమ్మా, ది గ్రేట్ బాహుబలి

Dec 4 2015 1:45 PM | Updated on Sep 3 2017 1:29 PM

అమ్మా, ది గ్రేట్ బాహుబలి

అమ్మా, ది గ్రేట్ బాహుబలి

సహాయక చర్యల్లో తలమునకలు కావాల్సిన అధికార ఏఐడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు అమ్మ జపంలో తరించిపోతున్నారు.

చెన్నై: కుండపోత వర్షాలకు చెన్నై నగరమంతా కకావికలమై ప్రజలు అహోరాత్రులు కూడు, గూడు లేకుండా అల్లాడిపోతుంటే కార్యరంగంలోకి దూకి సహాయక చర్యల్లో తలమునకలు కావాల్సిన అధికార ఏఐడీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు కొందరు అమ్మ జపంలో తరించిపోతున్నారు. నీట మునిగి పోతున్న ప్రజలను అమ్మ మాత్రమే కాపాడుతోందన్న అర్థంలో పోస్టర్లు వేసి గురుభక్తిని చాటుకుంటున్నారు. తిరునల్వేలి ఎమ్మెల్యే ముత్తుకరప్పన్ ఒక్క అడుగు ముందుకేసి అమ్మను బాహుబలిలాగా ఫొటోషాపులో చిత్రీకరించి ఆ ఫొటోలను పెద్దపెద్ద బిల్ బోర్డులపై ఏర్పాటు చేసి అమ్మా ది గ్రేట్ అంటున్నారు.

భారీ వర్షంలో వరద నీటిలో కొట్టుకుపోకుండా ఒంటిచేత్తో చంటిపాపను ఒడ్డుకు చేరుస్తున్న బాహుబలిలాగా ఆ పోస్టర్లో అమ్మను చిత్రీకరించారు. అమ్మ మాత్రమే ఇలాంటి సాహసం చేస్తోందన్న భావంతో కామెంట్ కూడా రాశారు. జయలలిత పట్ల తమకున్న వీరాభిమానాన్ని చాటుకోవడం తమిళనాట కొత్తేమి కాదు. అమ్మ కోసం శరీరాలను చేతులారా తగులబెట్టుకున్న వాళ్లు, శిలువకు శరీరాలను దిగేసికున్న వారూ లేకపోలేదు. ఇప్పుడు అసందర్భంగా అమ్మను బాహుబలిలా చిత్రీకరించడం పట్ల సోషల్ మీడియా మండిపడుతోంది.

వరదల్లో చిక్కుకున్న చెన్నై మహానగరాన్ని ప్రత్యక్షంగా వీక్షంచడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెలికాప్టర్ నుంచి పరిస్థితిని పరిశీలిస్తున్న దృశ్యాన్ని కూడా ఫొటోషాపులో మార్ఫింగ్‌చేసి సాక్షాత్తు పీఐబీ విడుదల చేయడం ఇప్పటికే వివాదమైన విషయం తెల్సిందే. గతంలో జయలలిత హెలికాప్టర్‌లో వరద పరిస్థితిని వీక్షించినప్పుడు కూడా ఇలాంటి మార్ఫింగే చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement