కేరళకు మోదీ క్షమాపణలు | Sakshi
Sakshi News home page

కేరళకు మోదీ క్షమాపణలు

Published Mon, Dec 14 2015 6:52 PM

సోమవారం కేరళలోని త్రిసూర్ లో బీజేపీ బహిరంగ సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ - Sakshi

త్రిసూర్: ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 19 నెలల తర్వాతగానీ కేరళ రాష్ట్రానికి రాలేకపోయానని, అందుకే కేరళకు క్షమాపణలు చెబుతున్నానని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం త్రిసూర్ పట్టణంలో భారతీయ జనతాపార్టీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. కేరళలో బీజేపీ దారుణ రాజకీయ హింసను ఎదుర్కున్నదన్నారు.

'దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళలో భారతీయ జనతాపార్టీ ఘోర రాజకీయ హింసను ఎదుర్కొంది. ఇతర పార్టీల చేతుల్లో వందలాది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరులకు నివాళులర్పిస్తున్నా. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి. కార్యకర్తల కృషితో కేరళలో బీజేపీకి ఆదరణ పెరిగింది. ప్రజలు మన పట్ల నమ్మకాన్ని ప్రదర్శిస్తున్నారు' అంటూ భావోద్వేగంగా మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ.

ప్రకృతి అందాలకే కాక, మానవ వనరులకూ నిలయంగా ఉన్న కేరళ నుంచి లక్షలాది యువత ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో తమ ప్రతిభ చాటుకుంటున్నదని, తన విదేశీ పర్యటనల సందర్భంలో కేరళ ఎన్నారైలతో ముచ్చటించిన విషయాలను మోదీ గుర్తుచేసుకున్నారు. విదేశాల్లో కేరళీయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆదేశాధినేతలతో మాట్లాడి పరిష్కరించేందుకు ఎన్డీఏ సర్కార్ కృషిచేస్తున్నదనన్నారు. కేరళ యువశక్తి, వారి ప్రతిభాపాటవాలు.. తాము తలపెట్టిన 'మేక్ ఇన్ ఇండియా'ను ముందుకు నడిపిస్తాయనడంలో ఎలాంటి సందేహంలేదని ప్రధాని అన్నారు. ప్రధాని ప్రసంగంలో మరికొన్ని ముఖ్యాంశాలు..


- 2022లో భారత్ 75వ స్వాతంత్ర్యదినోత్సవాన్ని జరుపుకోనుంది. ఆలోగా ప్రతి పౌరుడి సొంత ఇంటి కలను సాకారం చేయాలన్నది నా కల.
- కేరళలో మత్యకారుల అభివృద్ధి కోసం త్వరలో భారీ పథకాన్ని ప్రారంభిస్తాం
- ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా కేరళలోని 2.25 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2100 కోట్లు సమకూరాయి.

Advertisement
Advertisement