నా కిడ్నీ చోరీ చేశారు.. | organ theft in tamilnadu | Sakshi
Sakshi News home page

నా కిడ్నీ చోరీ చేశారు..

Apr 21 2015 7:43 PM | Updated on Sep 3 2017 12:38 AM

తనకు తెలియకుండా కిడ్నీని దొంగిలించారంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన సంఘటన తమిళనాడులో మంగళవారం చోటుచేసుకుంది.

చెన్నై: తనకు తెలియకుండా కిడ్నీని దొంగిలించారంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదుచేసిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం... తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తిరునల్లూరులో ఉన్న ఒక నూనెమిల్లు కర్మాగారంలో ఎన్.రాజవేలు(40)  అనే వ్యక్తి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ కర్మాగార యజమాని ప్రకాశంకు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు సమాచారం. కిడ్నీ మార్పిడికి అదే కర్మాగారంలోని వందమంది కార్మికులకు రక్త పరీక్షలు నిర్వహించి 'ఓ పాజిటివ్' గ్రూపు ఉన్న రాజవేలును కిడ్నీ దానం చేయాలని కోరారు. ఇందుకు రూ.20 లక్షలు ఇస్తామని ఆశ చూపారు. అయితే కిడ్నీ దానానికి రాజవేలు ససేమిరా అన్నాడు.


ఈ క్రమంలో గత నెల 9వ తేదీన రాజవేలుకు మత్తు మందు ఇచ్చి చెన్నైలోని ఒక ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల తరువాత రాజవేలు స్పృహలోకి రాగానే యజమాని తరఫు వ్యక్తులు అతని చేతిలో రూ.25 వేలు పెట్టారు. వద్దని చెప్పడంతో రూ.లక్ష ఇస్తామన్నారు. అయినా నిరాకరించడంతో డబ్బులు బ్యాంకులో వేస్తామని, ఊరు వదిలి వెళ్లిపోవాలని.. లేదంటే ప్రాణాలతో ఉండవని బెదిరించారు. తన రేషన్కార్డు, ఓటరు కార్డు స్వాధీనం చేసుకున్న యజమాని మనుషులు తనకు తెలియకుండా కిడ్నీని దొంగలించి ఆయనకు అమర్చారని, ఇప్పుడు తనను బెదిరిస్తున్నారని పేర్కొంటూ జిల్లా కలెక్టర్ కేఎస్ పళనిస్వామికి బాధితుడు రాజవేలు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ సిఫార్సు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

పోల్

Advertisement