తరార్‌వన్నీ అబద్ధాలు | Mehr Tarar tweets, expresses shock at Sunanda Pushkar's death | Sakshi
Sakshi News home page

తరార్‌వన్నీ అబద్ధాలు

Jan 18 2014 2:55 AM | Updated on Sep 18 2019 3:04 PM

తరార్‌వన్నీ అబద్ధాలు - Sakshi

తరార్‌వన్నీ అబద్ధాలు

అదేం చిత్రమో! కేంద్ర మంత్రి శశిథరూర్‌కు సంబంధించి ట్విటర్‌లో మెసేజ్‌ల యుద్ధం చేసిన పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్, థరూర్ భార్య సునంద పుష్కర్... ఇద్దరూ కర్మ సిద్ధాంతాన్నే నమ్మారు.

భారతీయులకిది తెలిస్తే తట్టుకోలేరు
ఎలా రాసిపెడితే అలా జరుగుతుంది
ఆయనకోసం ఎవరొచ్చినా నేను అడ్డుపడను
చివరి గంటల్లో సునంద పుష్కర్ వరస ట్వీట్లు
తనకు మాటలు రావటం లేదన్న తరార్
 
న్యూఢిల్లీ:  అదేం చిత్రమో! కేంద్ర మంత్రి శశిథరూర్‌కు సంబంధించి ట్విటర్‌లో మెసేజ్‌ల యుద్ధం చేసిన పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్, థరూర్ భార్య సునంద పుష్కర్... ఇద్దరూ కర్మ సిద్ధాంతాన్నే నమ్మారు. ‘‘కర్మ సిద్ధాంతంపై నాకు నమ్మకం ఉంది. ఏదైతే అది కానీండి’’అని మెహర్ తరార్ ట్వీట్ చేయగా... మరణించడానికి కొన్ని గంటల ముందు సునంద కూడా ఇదే చెప్పారు. ‘‘ఏది ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికేం తెలుసు మనం నవ్వుతూ వెళ్లిపోవడమే’’ అన్నారు. సునంద శుక్రవారం తెల్లవారు జామున 5.50 నుంచి 6 మధ్యలో పలు ట్వీట్లు చేశారు. గురువారం రాత్రి 12  సమయంలో ట్వీట్లు చేశాక... వాటిపై వ్యక్తమైన స్పందనలకు శుక్రవారం తెల్లవారుజామున చురుగ్గా జవాబులిచ్చారు.
 
మెహర్‌వన్నీ అబద్ధాలు...
భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 12 గంటల సమయంలో సునంద ఒక ట్వీట్ చేశారు. ఆజ్‌తక్ చానెల్ యాంకర్ రాహుల్ కన్వల్‌ను ఉద్దేశిస్తూ... ‘మీ షో చూశా. మీకొకటి చెప్పాలనుకున్నా. మెహర్ తరార్ అన్నీ అబద్ధాలు చెప్పింది. కావాలంటే ఆమె ఈమెయిల్స్, బ్లాక్‌బెర్రీ మెసేజ్‌లు నా దగ్గరున్నాయి. నేను అబద్ధం చెప్పను’’ అని దాన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే దానికి సుధీర్ శివ్‌హరి అనే వ్యక్తి స్పందిస్తూ... ‘మేమ్! మీరూ, థరూర్ కలిసి తరార్‌తో కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనండి. బాగుంటుంది’’ అన్నాడు. సునంద గట్టిగా నవ్వేస్తూ... ‘‘అదెన్నటికీ జరగదు’’ అన్నారు. ఇదే సునంద చివరి ట్వీట్. ఉదయం దాదాపు 6 గంటల సమయంలో ఈ మెసేజ్ ఇచ్చాక ఆమె ఫోన్ నుంచి ట్విటర్‌కు మరో మెసేజ్ రాలేదు. ఈ ట్వీట్‌కన్నా ముందు ఆమె మరిన్ని ట్వీట్లు చేశారు.

మెహర్ తరార్ గురించి పలువురు వేసిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. ‘గతంలో ఐపీఎల్ వివాదం. ఇపుడు తరార్ వివాదం. మీరు శశి థరూర్‌ను రాజకీయంగా దిగజారుస్తున్నారే? అయినా ఐఎస్‌ఐ ఏజెంట్... ఇతరత్రా పదాలు శశి డిక్షనరీలోనే లేవు. ఆయన ఈ-మెయిల్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారంటున్నారుగా’’ అంటూ ఒక ఫాలోవర్ అడిగిన ప్రశ్నలకు... అది శశినే అడగండి అని గట్టిగా నవ్వుతూ జవాబివ్వటం గమనార్హం.
 
ఆసుపత్రిలో ఉన్నారా
సునంద ఆసుపత్రిలో ఉన్నారని శశిథరూర్ చెప్పినట్లు శుక్రవారం వార్తలు వెలువడ్డాయి. దీనిపై ఓ ఫాలోవర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆసుపత్రి బెడ్ నుంచి ట్వీట్లు చేస్తున్నారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరో అభిమాని మీ ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సునంద జవాబులిస్తూ... ‘‘కిమ్స్‌కు (కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్) వెళ్లా. చాలా పరీక్షలు చేశారు. ఎవరికి తెలుసు? మనమైతే నవ్వుతూనే ఉండాలి’’ అని జవాబిచ్చారు.

తాను ఢిల్లీలోనే ఉన్నానని, శశితో కలిసి గురువారమే కేరళ నుంచి వచ్చానని మరో ట్వీట్‌లో వివరించారు. వారం కిందట మెహర్ తరార్ ఢిల్లీకి వచ్చిన సంగతి తనకు తెలుసునని చెప్పారు. అన్నిటికన్నా ముఖ్యంగా ‘‘ఏదో ఒకరోజు భారతీయులకు నిజం తెలుస్తుంది. వారు దాన్ని తట్టుకోలేరని నాకు తెలుసు... ఇన్షా అల్లా’’ అని సునంద చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకుంది.
 
నేనే చివరి దాన్నవుతా
ట్విటర్‌లో ఓ ఫాలోవర్ సునందకు సలహా ఇచ్చారు. ‘‘మేమ్! కొన్నాళ్లు ఈ ట్విటర్‌కు దూరంగా ఉండండి. మున్ముందు కూడా శశితో చాలా మంది మహిళలు ప్రేమలో పడతారు’’ అని పేర్కొన్నారు. దానికి సునంద బదులిస్తూ... ‘‘అలాంటివి నేను లెక్క చెయ్యను. నా భర్త కోసం వేరే మహిళ వచ్చి నిలదీసే పరిస్థితే వస్తే వాళ్లను ఆపటంలో నేను ఆఖర్న ఉంటా’’ అని స్పష్టంచేశారు.  
 
ఓ మైగాడ్...: తరార్
సునంద పుష్కర్ మరణ వార్త వెలువడ్డాక... శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్ తన సెల్‌ఫోన్ నుంచి ట్వీట్ చేశారు. ‘‘వాట్ ద హెల్! సునందా... ఓ మైగాడ్’’ అంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేనిప్పుడే లేచా. సునంద విషయం చూశా. ఇది  చెప్పలేనంత భయానకమైనది. ఏం చెప్పాలో తెలియటం లేదు. సునంద ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నా’’ అన్నారు.  తరార్ ఈ ట్వీట్ చేసిన వెంటనే ఆమె ఫాలోవర్లు ‘‘మేమ్! కొన్నాళ్లు సోషల్ నెట్‌వర్కింగ్‌కు దూరంగా ఉండండి. ట్విటర్‌కు దూరంగా ఉండండి. మీరు ట్వీట్లు చేస్తూ ఉంటే పరిస్థితి ఘోరంగా తయారవుతుంది’’ అంటూ సలహాలివ్వటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement