ఆ వైద్య సీట్లన్నీ ఎన్నారై కోటాలోకే! | medical seats all in nir quota | Sakshi
Sakshi News home page

ఆ వైద్య సీట్లన్నీ ఎన్నారై కోటాలోకే!

Aug 24 2015 1:42 AM | Updated on Sep 3 2017 8:00 AM

ఆ వైద్య సీట్లన్నీ ఎన్నారై కోటాలోకే!

ఆ వైద్య సీట్లన్నీ ఎన్నారై కోటాలోకే!

ప్రైవేటు మెడికల్ కౌన్సెలింగ్‌లో భర్తీ కాని యాజమాన్య కోటాలోని 202 డెంటల్ సీట్లు ఎన్నారై కోటాలోకి మారనున్నాయి.

సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు మెడికల్ కౌన్సెలింగ్‌లో భర్తీ కాని యాజమాన్య కోటాలోని 202 డెంటల్ సీట్లు ఎన్నారై కోటాలోకి మారనున్నాయి. అలాగే అదే కోటాలోని 505 ఎంబీబీఎస్ సీట్లల్లో అన్నీ భర్తీ అయినా ఈ నెలాఖరుకల్లా వాటికి నాలుగేళ్ల ఫీజు బ్యాంకు గ్యారంటీ చూపించాల్సి ఉంటుంది. గ్యారంటీ చూపని విద్యార్థుల సీట్లు రద్దయి అవి కూడా ఎన్నారై కోటాలోకి చేరతాయి. అప్పుడు ఇష్టానుసారంగా కాలేజీ యాజమాన్యాలు భర్తీ చేసుకోవచ్చు. వాటికి బేరం పెట్టే పనిలో యాజమాన్యాలు సిద్ధమయ్యాయి.

సీటు రద్దు చేసుకునే విద్యార్థులకు ప్రత్యేక నజరానా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఎన్నారై కోటాలోకి వచ్చే ఎంబీబీఎస్ సీటును రూ. కోటిన్నర వరకు బేరం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.  ఈ నెల 21, 22 తేదీల్లో ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లోని బీ కేటగిరీకి చెందిన 505 ఎంబీబీఎస్, 350 బీడీఎస్ సీట్లకు అత్యంత గోప్యంగా ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఎంబీబీఎస్‌లో చేరిన విద్యార్థులు మొదటి ఏడాది రూ. 9 లక్షల ఫీజుతో చెల్లింపుతోపాటు మిగిలిన నాలుగేళ్ల కోర్సు ఫీజు రూ. 36 లక్షలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. అలాగే బీడీఎస్‌లో మొదటి ఏడాది ఫీజు రూ. 4 లక్షల చెల్లింపుతోపాటు మిగిలిన మూడేళ్లకు రూ. 12 లక్షలు గ్యారంటీ అడిగారు. ఈ నెలాఖరు నాటికి బ్యాంకు గ్యారంటీతో వస్తేనే చేరిన సీటు ఉంటుందని... లేకుంటే రద్దవుతుందని యాజమాన్యాలు తేల్చిచెప్పాయి.

కౌన్సెలింగ్‌లో అన్ని ఎంబీబీఎస్ సీట్లల్లో విద్యార్థులు చేరినా బ్యాంకు గ్యారంటీ ఇవ్వకుంటే అవి నెలాఖరుకు రద్దు అవుతాయి. ప్రభుత్వ జీవో ప్రకారం ఆ సీట్లన్నీ ఎన్నారై కోటాలోకి మారిపోతాయి. ఇక బీడీఎస్‌లో 350 యాజమాన్య సీట్లల్లో 202 సీట్లు భర్తీ కాలేదు. అయితే బీడీఎస్‌కు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో ప్రభుత్వ అనుమతి తీసుకొని ప్రత్యేక నోటిఫికేషన్ జారీచేయాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. వాటిని ఎన్నారై ఫీజుకే అంటగట్టాలని యోచిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement