కుక్క కరిస్తే.. కేన్సర్ అంటూ బిల్లులు! | fake bills in the name of cancer claimed for dog bite in karnataka | Sakshi
Sakshi News home page

కుక్క కరిస్తే.. కేన్సర్ అంటూ బిల్లులు!

Aug 18 2016 3:06 PM | Updated on Sep 29 2018 3:55 PM

కుక్క కరిస్తే.. కేన్సర్ అంటూ బిల్లులు! - Sakshi

కుక్క కరిస్తే.. కేన్సర్ అంటూ బిల్లులు!

కుక్క కరిచినందుకు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని.. దానికి ఏకంగా కేన్సర్ చికిత్స పొందినట్లుగా బిల్లులు పెట్టారు.

కుక్క కరిచినందుకు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుని.. దానికి ఏకంగా కేన్సర్ చికిత్స పొందినట్లుగా బిల్లులు పెట్టారు. మంచి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా గుండె ఆపరేషన్లు చేయించుకున్నట్లు చూపించారు. ఇలాంటి ఘనుల్లో నలుగురిని కర్ణాటక సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు పొందేందుకు ఇలా నకిలీ బిల్లులు పెట్టిన స్కాంను వాళ్లు ఛేదించారు.

దాదాపు వంద వరకు ఫోర్జరీ బిల్లులు పెట్టి.. ఏకంగా రూ. 3 కోట్ల మొత్తాన్ని నొక్కేసినట్లు పోలీసులు కనుగొన్నారు. బెంగళూరులోని 30 ప్రముఖ ఆస్పత్రులలో ఈ వ్యవహారం జరిగిందని, ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది, ఆస్పత్రుల పాత్ర కూడా ఉన్నట్లు తాము అనుమానిస్తున్నామని సీఐడీ అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతానికి ఈ కుంభకోణం విలువ రూ. 3 కోట్లేనని అనుకుంటున్నా, ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.  ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని విచారిస్తామని తెలిపారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కొన్ని బిల్లుల్లో తేడాలు గమనించి.. దానిపై విధానసభ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసును సీఐడీకి బదిలీ చేయగా మొత్తం డొంకంతా కదిలింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా దీనిపై 54 కేసులు నమోదయ్యాయి. అమొగప్ప తిప్పన్న మొరటగి, సిఎం నాగరాజ శెట్టి, ఎంకే కిరణ్ కరియప్ప, శంకర్ సిద్దశెట్టి అనే నలుగురిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. వీరిలో లమొగప్ప అనే వ్యక్తి వేర్వేరు పేషెంట్ల పేరుతో ఏకంగా 75 బిల్లులు పెట్టాడని తేలింది. సాధారణంగా మంత్రి గానీ, ఎమ్మెల్యే గానీ రికమండ్ చేస్తేనే లబ్ధిదారులకు నిధులు విడుదల చేస్తారు. ఈ కేసుల్లో కాంగ్రెస్, బీజేపీ, జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, వాళ్లకు అసలు ఈ విషయం తెలుసో లేదో తమకు తెలియదని సీఐడీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement