‘పర్యావరణ’ రుసుము ఇక సరళం | 'Environmental' fees are no longer simple | Sakshi
Sakshi News home page

‘పర్యావరణ’ రుసుము ఇక సరళం

Feb 25 2016 1:08 AM | Updated on Sep 3 2017 6:20 PM

భారీ భవనాల నిర్మాణంపై పర్యావరణ ప్రభావిత రుసుము చెల్లింపులను ప్రభుత్వం సరళీకృతం చేసింది.

* పదివేల చదరపు అడుగులకు పైగా స్థలంలో నిర్మించే భవనాలకు వర్తింపు
సాక్షి, హైదరాబాద్: భారీ భవనాల నిర్మాణంపై పర్యావరణ ప్రభావిత రుసుము చెల్లింపులను ప్రభుత్వం సరళీకృతం చేసింది. 10,000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంగల స్థలంలో నిర్మించే భారీ భవనాలపై ప్రతి చదరపు అడుగుకు రూ.3 చొప్పున ఈ రుసుమును విధించాలని ఆదేశిస్తూ రాష్ట్ర భూగర్భ గనుల శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భారీ భవనాల నిర్మాణంలో ఉపయోగించే నిర్మాణ సామగ్రి తయారీ కోసం  పెద్ద మొత్తంలో వినియోగించే సహజ వనరుల వల్ల పర్యావరణంపై పడే ప్రభావ తీవ్రతను లెక్కగట్టి ఈ ఫీజులను ప్రభుత్వం వసూలు చేస్తోంది.

తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై భవన నిర్మాణ అనుమతులకు ముందే ఈ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.  గతంలో భవన నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం భూగర్భ గనుల శాఖ అధికారులు ఈ రుసుము మొత్తాన్ని లెక్కగట్టి విధించేవారు. అయితే ఈ ప్రక్రియలో పారదర్శకత కొరవడిందని తెలంగాణ రియల్ ఎస్టేట్ సంఘాల సమాఖ్య ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చింది. దాంతో ఇకపై భవన నిర్మాణ అనుమతులకు ముందే బిల్డింగ్ ప్లాన్‌కు అనుగుణంగా ఈ ఫీజును వసూలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

అదే విధంగా ఇప్పటికే నిర్మాణం జరుగుతున్న, నిర్మాణం పూర్తయిన భవనాలపై సైతం ఈ ఫీజులు విధించాలని ప్రభుత్వం సూచించింది. అలాగే లెసైన్స్‌డ్ ఇంజనీర్ ఇచ్చిన ధ్రువపత్రం ఆధారంగా బిల్డర్లు స్వచ్ఛందంగా ఈ ఫీజులను చెల్లించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో పాటు గనుల శాఖ అధికారులు ఈ భవనాలపై దాడులు నిర్వహించినప్పుడు ఈ ధ్రువపత్రాలను చూపిస్తే సరిపోతుంది. పర్యావరణ ప్రభావ రుసుము చెల్లింపులను సరళీకృతం చేసినందుకు తెలంగాణ డెవపలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

పోల్

Advertisement