8మంది సజీవ దహనం | Eight killed in Maharashtra bus accident | Sakshi
Sakshi News home page

8మంది సజీవ దహనం

Jan 30 2014 3:53 AM | Updated on Sep 2 2017 3:09 AM

8మంది సజీవ దహనం

8మంది సజీవ దహనం

మరో వోల్వో బస్సు అగ్నికి ఆహుతైంది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు.

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం
 సాక్షి, ముంబై/వరంగల్, న్యూస్‌లైన్: మరో వోల్వో బస్సు అగ్నికి ఆహుతైంది. మహారాష్ట్రలోని థానే జిల్లాలో బుధవారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది నిద్రలోనే సజీవ దహనమయ్యారు. మరో 14 మంది గాయపడ్డారు. మృతుల్లో వరంగల్ జిల్లా ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామానికి చెందిన సానికొమ్ము శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు భావిస్తున్నారు.  ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై పాల్ఘర్ తాలూకా మనోరా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
 
     పుణే నుంచి 36 మంది ప్రయాణికులతో అహ్మదాబాద్‌కు వెళ్తున్న ప్రైవేట్ వోల్వో లగ్జరీ బస్సు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో పాల్ఘర్-మనోరా గ్రామాల మధ్య నిలిచి ఉన్న భారత్ పెట్రోలియం డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ట్యాంకర్‌కు ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. అదే సమయంలో వోల్వో వెనకాల వేగంగా వస్తున్న ఓ కారు.. వోల్వోను ఢీకొని, దాని కిందికి దూరి చిక్కుకుపోయింది.
     వెంటనే బస్సుకు, కారుకు మంటలు అంటుకున్నాయి. ప్రయాణికులు నిద్రలో ఉండడంతో ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోయారు. ట్యాంకర్‌ను ఢీకొన్నాక భారీ శబ్దం రావడంతో లేచినవారు బయటపడేందుకు ప్రయత్నించేలోపే బస్సును కారు ఢీకొట్టడంతో కిందపడ్డారు.
 
ఇదే సమయంలో బస్సులో మంటలు, పొగ దట్టంగా వ్యాపించాయి. అగ్నికీలలకు ఎనిమిది మంది అసువులు బాశారు. మరో 11 మంది గాయపడ్డారు. మిగతా 17 మంది సురక్షితంగా తప్పించుకున్నారు. మంటల ధాటికి బస్సు మొత్తం కాలిపోయింది. కారులోని ప్రయాణికులు బయటకు దూకేసినప్పటికీ అందులోని ముగ్గురు గాయపడ్డారు.
     మృతదేహాలు గుర్తుపట్టనంతగా కాలిపోయాయి. క్షతగాత్రుల్లో కొందరిని ముంబై, స్థానిక ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
 కంపెనీ పనిపై వెళ్తూ: మృతుల్లో వరంగల్ జిల్లావాసి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు భావిస్తున్నారు. క్షతగాత్రుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే మృతదేహం ఏది అన్నది డీఎన్‌ఏ పరీక్షల్లో తేలనుంది. శ్రీనివాస్ ముంబైలోని గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ప్రిన్సిపల్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆయన హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివారు. కంపెనీ పనిపై పుణే నుంచి అహ్మదాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement