జీపీఎస్‌ ట్రాకింగ్‌తో భార్యను వెంటాడి.. | Bengaluru woman ends life after boyfriend is shot dead | Sakshi
Sakshi News home page

జీపీఎస్‌ ట్రాకింగ్‌తో భార్యను వెంటాడి..

Jan 14 2017 2:50 PM | Updated on Sep 5 2017 1:16 AM

అమిత్‌, శ్రుతి గౌడ(ఫైల్‌)

అమిత్‌, శ్రుతి గౌడ(ఫైల్‌)

కారులో అధునాత జీపీఎస్‌ ట్రాకింగ్‌ డివైజ్‌ను ఉంచి భార్యను వెంటాడాడు. ప్రియుణ్ని బతికించుకోవడానికి విఫలయత్నం చేసిన ఆమె..

బెంగళూరు: కారులో అధునాత జీపీఎస్‌ ట్రాకింగ్‌ డివైజ్‌ను ఉంచి భార్యను వెంటాడాడు. సరిగ్గా ఆమె తన ప్రియుడికి దగ్గరగా ఉన్న సమయంలో తుపాకితో కాల్పులు జరిపాడు. ప్రియుణ్ని బతికించుకోవడానికి విఫలయత్నం చేసిన ఆమె.. చివరికి ఓ హోటల్‌గదిలో ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులో సంచలనం రేపిన ఈ సంఘటనపై ఇరుకుటుంబాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

దక్షిణ బెంగళూరుకు చెందిన శ్రుతి గౌడ(32) రైల్వే గొల్లహళ్లిలో పంచాయితీ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు భర్త రాజేశ్‌ గౌడ(33), ఇద్దరు పిల్లలు, మామ గోపాలకృష్ణ‌(78) ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి కారులో బయలుదేరిన శ్రుతి.. హేసరఘట్ట ప్రాంతంలో అమిత్‌ కేశవమూర్తి అనే వ్యక్తిని కలుసుకుంది. వివాహితుడైన అమిత్‌.. న్యాయవాదిగా పనిచేస్తున్నారు. చిన్నపాటి రాజకీయ నాయకుడు కూడా. ఇటీవలే ఆయన జేడీ(యూ) నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బైకర్‌గానూ ఆయనకు పేరుంది. శృతి మీద అనుమానంతో ఆమె కారును(జీపీఎస్‌ ట్రాకింగ్‌ పరికరం ద్వారా) వెంటాడిన రాజేశ్ గౌడ‌.. తండ్రి గోపాల కృష్ణ సాయంతో అమిత్‌పై దాడిచేశాడు. కారులో శ్రుతి, అమిత్‌లు పక్కపక్కన కూర్చుని ఉండగానే కాల్పులు జరిపి వెళ్లిపోయారు.

రక్తపుమడుగులో పడిపోయిన అమిత్‌ను శ్రుతి అతికష్టంమీద సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు తీవ్రత దృష్యా ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈలోపే శ్రుతి అక్కడి నుంచి వెళ్లిపోయింది. సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో శ్రుతి తన పుట్టింటివారికి ఫోన్‌చేసి లాడ్జిలో ఉన్నట్లు చెప్పింది. అయితే వారు వెళ్లేసరికి ఆమె దుప్పటితో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకుంది.

ఈ ఘటనకు సంబంధించి రెండు వేరు వేరు(అమిత్‌ కేశవమూర్తి హత్య, శ్రుతి ఆత్మహత్య) కేసులు నమోదుచేశామని పోలీసులు మీడియాకు తెలిపారు. అమిత్‌ను కాల్చిచంపింది రాజేశ్‌ గౌడా లేక తండ్రి గోపాల కృష్ణా అనేది తెలియాల్సిఉందని, అమిత్‌తో శ్రుతి బంధం, ఆత్మహత్యకు దారితీసిన ఇతర అంశాలను పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఉదంతంపై ఇరు కుటుంబాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. న్యూ ఇయర్‌ వేడుకల్లోనూ రెండు కుటుంబాలు ఆనందంగా గడిపాయని, ఇంతలోనే చంపుకునేంత గొడవలు ఏమొచ్చాయో అర్థంకావడంలేదని అమిత్‌ తల్లి వెంకమ్మ వాపోయారు.

మృతులు అమిత్‌, శ్రుతి(పైన), నిందితులు గోపాలకృష్ణ, రాజేశ్‌ గౌడ(కింద) (ఫైల్‌ ఫొటోలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement