నాన్న, బాబాయితో కమ్యూనికేషన్స్‌ కట్‌!

నాన్న, బాబాయితో కమ్యూనికేషన్స్‌ కట్‌!


లక్నో: అధికార సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ తన కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులపై వేటు వేయడం, స్వయనా తన బాబాయి  అయిన శివ్‌పాల్‌ యాదవ్‌ మంత్రిత్వశాఖలకు ఎసరుపెట్టడంతో భగ్గుమన్న ఈ అంతర్గత కుమ్ములాట 48 గంటలైనా ఇంకా సెగలు కక్కుతూనే ఉంది.



ఎస్పీ సుప్రీమ్‌ ములాయం సింగ్‌ యాదవ్‌ రంగంలోకి దిగినా పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. ఈ నేపథ్యంలో సంక్షోభానికి తెరవేసేందుకు శుక్రవారం ములాయం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటుచేశారు. శివ్‌పాల్‌ యాదవ్‌ బుధవారం తన అన్న, పార్టీ చీఫ్‌ ములాయంతో నాలుగు గంటలపాటు భేటీ అయినప్పటికీ ఫలితం ఇవ్వలేదు. తన మంత్రిత్వశాఖలకు కోత పెట్టిన అఖిలేశ్‌ కేబినెట్‌లో పనిచేసేందుకు శివ్‌పాల్‌ ససేమిరా అంటున్నట్టు సమాచారం. తమ్ముడిని బుజ్జగించేందుకు ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి కొడుకు అఖిలేశ్‌ను తప్పించి.. శివ్‌పాల్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఈ నియమాకంతో మరింత భగ్గుమన్న అఖిలేశ్‌ బాబాయి శాఖలకు కోత పెట్టి షాక్‌ ఇచ్చారు.



దీంతో మొదలైన హై వోల్టేజ్‌ పొలిటికల్‌ డ్రామా ఎస్పీలో ప్రకంపనలు రేపుతోంది. అయితే, ఇది కుటుంబ పోరాటం కాదని, ప్రభుత్వ పోరాటమని సీఎం అఖిలేశ్‌ పేర్కొన్నారు. 'ఔట్‌ సైడర్‌' (బయటి వ్యక్తి) వల్లే ఈ వివాదం  మొదలైందని చెప్పుకొచ్చారు. అక్టోబర్‌ 3 నుంచి పార్టీ ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్టు ప్రకటించిన అఖిలేశ్‌ తాజా వివాదం విషయంలో ఎంతమాత్రం వెనకకు తగ్గేది లేదని సంకేతాలు ఇచ్చారు. ఇటు బాబాయితోనే కాదు, అటు తండ్రి ములాయంతోనూ ఆయన కమ్యూనికేషన్స్‌ కట్‌ చేశారు. సంక్షోభ నివారణకు ఢిల్లీకి పిలిచినా ఆయన వెళ్లలేదు. ఢిల్లో ఉన్న తండ్రిని కలిసే ప్రయత్నం అఖిలేశ్‌ చేయకపోవడంతో ఈ సంక్షోభం ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని నిపుణులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో ఎస్పీపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషిస్తున్నారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top