కర్ణాటకలోని హావేరి వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనలో సజీవదహనమైన ఏడుగురు ప్రయాణికుల్లో నలుగురిని శుక్రవారం గుర్తించారు.
డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల అప్పగింత
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: కర్ణాటకలోని హావేరి వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనలో సజీవదహనమైన ఏడుగురు ప్రయాణికుల్లో నలుగురిని శుక్రవారం గుర్తించారు. హావేరి వద్ద వరదా నదిపై బ్రిడ్జి రెయిలింగ్‌ను ఢీకొట్టిన బస్సు దగ్ధమై ఏడుగురు సజీవదహనం కాగా 44 మంది గాయపడిన సంగతి తెలిసిందే. మృతుల్లో సలీం భాను, అమీనా ఖాన్, నామన్ ఖాన్, కైఫ్ ఖాన్‌లను వారి బంధువులు గుర్తుపట్టారు. బస్సు ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను హుబ్లీలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
మృతుల్లో ముగ్గురు పురుషులు, ముగ్గురు పిల్లలు, ఓ మహిళ ఉండగా.. వారిలో ఒకే కుటుంబానికి చెందినవారే ఐదుగురు. డ్రైవర్ నవాజ్ పాషా మృతదేహాన్ని అతడి చేతి గడియారం ఆధారంగా గుర్తించినట్లు తెలిసింది. అయితే పూర్తిగా ధ్రువీకరించలేదు. బంధువులు తమ వారి మృతదేహాలను గుర్తించగలిగినా, డీఎన్‌ఏ పరీక్షల అనంతరమే అప్పగిస్తామని అధికారులు తెలిపారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఐదుగురు క్షతగాత్రుల్లో నలుగురు బెంగళూరులోని వివిధ ఆస్పత్రుల్లో చేరారని, వారందరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు.