అలనాటి తార.. అందాల చీర

Costume Designer Gourang Shah Special Story - Sakshi

మహానటి సినిమాకు చీరలందించిన సిటీ డిజైనర్‌ గౌరంగ్‌షా

వంద మందికి పైగా చేనేత కళాకారుల కృషి  

ఏడాదికి పైగా సమయం 

షాకు ఇదే తొలి సినిమా

సాక్షి, సిటీబ్యూరో: తెరమీద పరుచుకున్న అనిర్వచనీయ అందం ఆమె... అతిరథ మహారథులు మెచ్చుకున్న అనితరసాధ్య అభినయం ఆమె... ఎందరో నటీమణులున్నా మహానటి తాను ఒక్కరేనని నిరూపించుకున్న అలనాటి తార సావిత్రి.. తెలుగు తెరపైఒకనాటి వెలుగు ధార. ఆమె కట్టూబొట్టూ అన్నీ అప్పట్లో అమ్మాయిలకు అనుసరణీయాలే. ఆ దిగ్గజ నటి జీవితాన్నితెర మీద ఆవిష్కరించబోతున్న సినిమా ‘మహానటి’. ఇందులో సావిత్రి పాత్రలో జీవించింది కీర్తి సురేష్‌. ఈ పాత్రను సజీవంగా మలిచిన అనేక మంది శిల్పుల్లో సిటీకి చెందిన టెక్స్‌టైల్‌ డిజైనర్‌ గౌరంగ్‌షా ఒకరు. ఈ చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన షాకు... ఇదే తొలి చిత్రం కావడం విశేషం. మే 9న విడుదల కానున్న ఈ చిత్ర కాస్ట్యూమ్స్‌పై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.   

పరిశోధించి.. పరిశ్రమించి..
అలనాటి సావిత్రి దుస్తులన్నీ సింప్లిసిటీకి, హుందాతనానికి ప్రతీకలుగా అనిపిస్తాయి. అందుకే ఆమె లుక్‌ గురించి పరిశోధనలో భాగంగా సినీ పరిశ్రమ పెద్దలనూ సంప్రదించారు గౌరంగ్‌. ఆనాటి టెక్స్‌టైల్స్‌ పునఃసృష్టి కోసం ఆయన బృందం తరచూ మ్యూజియమ్‌లను కూడా సందర్శించింది. అప్పటి టెక్స్‌టైల్, డిజైన్, టెక్చర్, కలర్‌లలోని ప్రతి విశేషాన్ని క్షుణ్నంగా పరిశీలించి, దాని ప్రకారం నేత కళాకారులకు మార్గదర్శకత్వం చేశారు. 6నెలలకు పైగా పరిశోధన సాగితే... వీవింగ్, టెక్చరింగ్, కలరింగ్‌కు మరో ఏడాది పట్టిందని చెప్పారు. ఇక సరైన టెక్స్‌టైల్, నేత, టెక్చరింగ్, కలరింగ్‌లను ఉపయోగించి నటి సావిత్రి వాస్తవ రూపాన్ని గుర్తుతెచ్చే ప్రయత్నం చేశామన్నారు గౌరంగ్‌. ఈ చిత్రంలోని కాస్ట్యూమ్స్‌ కోసం 100 మందికి పైగా చేనేత కళాకారులు నిర్విరామంగా పనిచేశారని చెప్పారు. ఈ సినిమాలో నేటి సావిత్రి ధరించే ప్రతీ కాస్ట్యూమ్‌... వాస్తవికంగా ఉండేందుకు గాను దేశంలోని కంచిపురం, బెనారస్‌ తదితర ప్రాంతాల నుంచి భారీ పట్టు ఫ్యాబ్రిక్స్‌ను సేకరించారు. వీటికి కోట, మంగళగిరి, బ్లాక్‌ ప్రింట్స్‌లతో లూమ్స్‌లో అదనపు సొబగులు అద్దారు.   

టాక్‌ ఆఫ్‌ ది సినీ కంట్రీ అనిపించుకున్న దేవదాస్, పద్మావతి... లాంటి బాలీవుడ్‌ సినిమాల్లోని కాస్ట్యూమ్స్‌ మంచి పేరొచ్చింది. ఆయా సినిమాల్లో తారల వస్త్రధారణను తీర్చిదిద్దిన డిజైనర్లు కూడా కొంతకాలం వార్తల్లో నిలిచారు. అయితే అలాంటి ఘనత ఇప్పటి వరకు నగరానికి చెందిన ఏ డిజైనర్‌కూ దక్కలేదు. అంతేకాదు.. భారీ చిత్రాలకు కాస్ట్యూమ్స్‌ ఇచ్చిన దాఖలాలూ... సదరు చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న సందర్భాలూ దాదాపు లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో సిటీ టెక్స్‌టైల్‌ డిజైనర్‌ గౌరంగ్‌ షా దీనికి శ్రీకారం చుట్టారు. ‘మహానటి’ సినిమాకు ఆయన అందించిన కాస్ట్యూమ్స్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. జామ్‌దానీని ఉపయోగించి వైవిధ్యభరితమైన ఫ్యాబ్రిక్స్, టెక్చర్స్‌ల మేళవింపులతో చీరల సృష్టికి చిరునామాగా నిలిచే ఈ డిజైనర్‌... వింటేజ్‌ ఫ్యాషన్‌ ట్రెండ్స్‌కు సిటీలో పేరొందారు. విద్యాబాలన్, షర్మిలా ఠాగూర్‌లతో పాటు మరెందరో బాలీవుడ్‌ తారలు ఆయన డిజైన్స్‌ ధరించారు. 

జీవనయానం.. వస్త్రవైభవం  
ఆనాటి మహిళ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా... అప్పటి ప్రసిద్ధ రంగులతో వీటిని బ్యాలెన్స్‌ చేశామన్నారు. బాల్యం నుంచి చివరి దశ వరకు ఆమె జీవన ప్రయాణంలోని ప్రతి సందర్భాన్నీ దృష్టిలో పెట్టుకొని వస్త్రధారణను తీర్చిదిద్దారు. ఎదిగే వయసులోని సావిత్రిని ప్రతిబింబించేందుకు మంగళగిరి, కోటా ప్రింట్స్‌ను... స్వర్ణయుగం లాంటి సినీ దశను అనుభవించిన సమయంలో సావిత్రిని చూపించేందుకు హెవీ బ్రొకేడ్స్, సిల్క్సŠ, ఆర్గంజా, చేతితో నేసిన శాటిన్స్, షిఫాన్స్‌లను వినియోగించారు. అదే విధంగా ఆమె చరమాంకానికి తగ్గట్టూ వస్త్రశైలుల్ని రూపొందించారు. ‘సినిమాలో కొన్ని ప్రత్యేకమైన సీన్ల కోసం శాటిన్స్‌ను అందించమన్నారు. అయితే ఆమె లుక్స్‌ పూర్తిగా స్వచ్ఛమైన చేనేతలతోనే ఉండాలని కోరుకున్నాను. దాంతో హ్యాండ్లూమ్స్‌ మీదనే శాటిన్స్‌ని రీక్రియేట్‌ చేశాను. భారీ కాంజీవరమ్‌ లెహంగా, బ్లౌజ్, ఆర్గంజా దుపట్టాతో ఉండే మాయాబజార్‌లోని సావిత్రిని గుర్తు తెచ్చేందుకు కలర్, డిజైన్, దుస్తుల నేతతో కూడిన లుక్‌ కోసం మాకు 3 నెలలు సమయం పట్టింద’ని చెప్పారు గౌరంగ్‌.

బ్యూటీఫుల్‌ జర్నీ...   
ప్రారంభం నుంచీ ఇదొక చాలెంజ్‌ లాంటిది నాకు. భారతీయ చీరల వైభవాన్ని పూర్తి స్థాయిలో వెండి తెరపై ప్రదర్శించడానికి దక్కిన అద్భుతమైన అవకాశం కూడా. ఈ సినిమాకు సంబంధించిన విభిన్న సందర్భాలు, ఘట్టాలను దగ్గర ఉండి పరిశీలిస్తూ పనిచేశాం. మా బృందానికి ఇదొక అందమైన ప్రయాణం. అలనాటి దిగ్గజ నటి జీవనశైలికి తగ్గట్టుగా ఫ్యాబ్రిక్‌ శైలులను, టెక్చర్స్‌ను తీర్చిదిద్దడం, ఆమె సున్నిత మనోభావాలకు అనుగుణంగా చీరలను సృష్టించడం అనేది ఒక టెక్స్‌టైల్‌ డిజైనర్‌గా నాకు అత్యంత తృప్తిని అందించింది.  – గౌరంగ్‌ షా, టెక్స్‌టైల్‌ డిజైనర్‌

Read latest Tollywood News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top