రేణుక మోసం చేశారని గాంధీభవన్‌ ఎదుట ధర్నా 

Women Protest At Gandhi Bhavan - Sakshi

ఖమ్మంసహకారనగర్‌ : కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి తన భర్త రాంజీకి గత సాధారణ ఎన్నికలప్పుడు కాంగ్రెస్‌ పార్టీ తరఫున వైరా ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇప్పిస్తానని కోటీ 20లక్షలు తీసుకున్నారని, టికెట్‌ రాలేదని తన భర్త మరణించారని, ఆ డబ్బును వెనక్కి ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ రాంజీ భార్య కళావతి శుక్రవారం హైదరాబాద్‌ గాంధీభవన్‌ ఎదుట ధర్నా చేశారు. గిరిజన సంఘం నాయకులతో కలిసి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కళావతి, గిరిజన సంఘం నాయకుడు రవిచంద్ర చౌహాన్‌లు మాట్లాడుతూ..2014లో వైరా టిక్కెట్‌ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుని..టిక్కెట్‌ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు.

రాంజీ చనిపోతే కనీసం చూడ్డానికి కూడా రాలేదని, తీరా ఇంటికి వెళ్తే కేసులు పెట్టించారని ఆరోపించారు. నాలుగేళ్లు గడుస్తున్నా తమకు న్యాయం జరగట్లేదని, ఈ నెల 14వ తేదీన రాహుల్‌ గాంధీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం ఢిల్లీలో కూడా ధర్నా చేస్తామని వెల్లడించారు. ఏఐసీసీ కార్యదర్శికి, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. ఇన్ని సంవత్సరాలుగా వివిధ దశల్లో పోరాడామని, అయినా స్పందించకపోవడం రేణుకకు తగదని, తమ డబ్బును వెనక్కిప్పించాలని కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top