పిక్నిక్‌ అనుకుంటున్నారా ? ఉద్యోగులపై కలెక్టర్‌ సీరియస్‌.

Wish Picnic? The Collector is Serious - Sakshi

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ ఆగ్రహం

రెండు విభాగాల నివేదికల్లో తేడా ఉండడంతో ఆరా

సమన్వయంతో పనిచేయాలని ఆదేశం

లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల తీరు పిక్నిక్‌ వెళ్లి వస్తున్నట్లుగా ఉందని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే నేరుగా పరిశీలకులే విధులు నిర్వర్తిస్తారని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పక్కాగా అమలు చేయాలని పదేపదే చెబుతున్నా పిక్నిక్‌కు వెళ్లి వస్తున్నట్లుగా ఎన్నికల బృందాలు పనితీరు ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం అభ్యర్థుల ప్రచారం సాగుతుందా, అతిక్రమిస్తున్నారా అనే విషయాన్ని అధికారులు పక్కాగా పరిశీలించాలని సూచించారు.

జిల్లాలో 144 సెక్షన్‌ అమలు చేస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా ప్రచారాలు నిర్వహించే వారికి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం కలెక్టర్‌ ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులు, ఏఈఓలతో ఎన్నికల ఏర్పాట్లు, శాంతిభద్రతలపై సమీక్షించారు. 

తేడాలు ఎందుకు వస్తున్నాయ్‌? 
పెయిడ్‌ న్యూస్‌కు సంబంధించి ఆర్వోలు, ఎంసీఎంసీ వద్ద ఉన్న వివరాల్లో తేడాలు గమనించిన పరిశీలకులు సమన్వయలోపాన్ని కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన ఆయన స్పందిస్తూ పెయిడ్‌ న్యూస్‌కు సంబంధించిన వివరాలను ప్రతీరోజు ఆర్వోలు, పరిశీలకులకు పంపాలని డీపీఆర్వోను ఆదేశించారు. ప్రతీ రోజు తాను స్వయంగా పేపర్‌ చూసి స్పందించినా ఎందుకు కదలిక రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇబ్బందులు పడతారని, ఎన్నికల కమిషన్‌కు పంపించే నివేదికలో తేడాలు రాకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లకు సంబంధించిన అద్దెను అభ్యర్థుల ఖర్చుల జాబితాలో నమోదు చేయకపోవడంపై ప్రశ్నించారు.

పట్టణాలు, గ్రామాల్లో సమూహంగా ర్యాలీలు నిర్వహిస్తూ ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నట్లు తెలుస్తోందని.. ఈ అంశంపై రిటర్నింగ్‌ అధికారులు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు పర్యవేక్షణ పెంచాలన్నారు. ఎంసీసీ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తీసుకున్న చర్యలపై ఆర్వోలను ఆరా తీయగా వారితో పాటు ఎంసీసీ వద్ద మరో రకంగా నివేదికలు ఉండడంతో ఎన్నికల పరిశీలకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు.

ఈ మేరకు కలెక్టర్‌ ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధుల నిర్వహణలో ఇదే నిర్లక్ష్యం కొనసాగితే చివరి ఐదు రోజులు నేరుగా పరిశీలకులకే ఎన్నికల నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తారని నారాయణపేట, జడ్చర్ల ఆర్వోలను హెచ్చరించారు. 

పదేపదే హెచ్చరిస్తున్నా...
పదేపదే హెచ్చరిస్తున్నా కొందరు ఉద్యోగులు పనితీరు మార్చుకోవడం తెలుస్తోందని రొనాల్డ్‌ రోస్‌ పేర్కొన్నారు. ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల నామినేషన్ల సందర్బంగా నిర్వహించిన ర్యాలీల ఖర్చుపై ఆరా తీయగా తేడాలు ఉండడంతో మందలించారు. తప్పుడు వివరాలు ఇస్తే ఉద్యోగాలు పోతాయని, నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. సీ విజిల్‌ యాప్‌పై నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. అనంతరం పోస్టల్‌ బ్యాలెట్‌పై పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగాఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల విధులు రాజ్యంగబద్దమైనవని, జిల్లా ఎన్నికల అధికారి తర్వాత రిటర్నింగ్‌ అధికారుల బాధ్యతలు అత్యంత కీలకమైనవని తెలిపారు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. ఈ సమావేశంలో ఎన్నికల ప్రత్యేకాధికారి క్రాంతి, డీఆర్వో స్వర్ణలత, నియోజకవర్గాల అధికారులు పాల్గొన్నారు. 

దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి 
సాధారణ ఎన్నికల్లో దివ్యాంగులు వంద శాతం ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అలహాబాద్‌ జిల్లా నుండి వచ్చిన ఐఏఎస్‌ అధికారి సుహాస్‌ లలిత్‌కేర్‌ సమక్షంలో సోమవారం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 1,312 పోలింగ్‌ కేంద్రాలు, 748 పోలింగ్‌ లొకేషన్లు ఉన్నాయని వివరించారు.

125 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో దివ్యాంగులను గుర్తించామని.. వారి కోసం రవాణా సౌకర్యం, తాగునీరు, వీల్‌చైర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చేలా 872 వలంటీర్లు, 978 వాహనాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అలాగే, 408 ర్యాంపులు నిర్మించినట్లు తెలిపారు. నోడల్‌ అధికారి శంకరాచారి, అసిస్టెంట్‌ నోడల్‌ అధికారి జోజప్ప పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top