స్కూల్‌ ఫీజుల నియంత్రణ ఎప్పుడు? | Sakshi
Sakshi News home page

స్కూల్‌ ఫీజుల నియంత్రణ ఎప్పుడు?

Published Sat, Jun 1 2019 2:29 AM

When is the School Fees Control - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు పాఠశాల గతేడాది ఒకటో తరగతికి రూ.45 వేలు వసూలు చేయగా, ఇపుడు ఆ విద్యార్థి రెండో తరగతికి వచ్చేసరికి రూ.53 వేలకు పెంచింది. కరీంనగర్‌లోని మరో ప్రైవేటు పాఠశాలలో గతేడాది ఎల్‌కేజీకి రూ.25 వేలు వసూలు చేయగా, ఈ సారి రూ.32 వేలకు పెంచుతున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. ఈ రెండు పాఠశాలలే కాదు రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేటు పాఠశాలలన్నీ 15 శాతం నుంచి 25 శాతం వరకు ఫీజులు పెంచాయి. ప్రభుత్వం వద్దన్నా.. కోర్టులో కేసు ఉన్నా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ తరగతుల్లోనే 25 శాతం వరకు ఫీజులను పెంచేశాయి. ఇతర తరగతుల్లోనూ ఫీజులను పెంచి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తున్నాయి. ఏటా రాష్ట్రంలో స్కూల్‌ ఫీజులను యాజమాన్యాలు భారీగా పెంచుతున్నా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టలేకపోతోంది. న్యాయ వివాదాలు ఇతరత్రా కారణాలతో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. 

ఒక్కోసారి ఒక్కో కారణంతో.. 
రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్‌ ఫీజుల నియంత్రణ ఒక్కోసారి ఒక్కో కారణంతో ఆగుతోంది. 2017 జూన్‌ నుంచి ఫీజుల నియంత్రణకు చర్యలు చేపట్టేలా పాఠశాల విద్యా శాఖ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి, మార్గదర్శకాలు రూపొందించింది. అందులో జీవో–1 అమలుకు పక్కా చర్యలు చేపట్టేలా సిఫారసులు చేసింది. ఆ ఫైలును ఆమోదం కోసం 2016 డిసెంబర్‌లోనే ప్రభుత్వానికి పంపింది. అయితే ప్రభుత్వం దాన్ని పరిశీలించి శాస్త్రీయంగా ఫీజులు ఖరారు చేసేందుకు అవసరమైన సిఫార్సులు చేయాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వీసీ ప్రొఫెసర్‌ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని 2017 ఏప్రిల్‌లో ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించేందుకు అధిక సమయం పట్టింది. ఎట్టకేలకు 2018 ఫిబ్రవరిలో కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. 

ప్రభుత్వ ఉత్తర్వులపై కోర్టుకు.. 
ప్రైవేటు పాఠశాలల్లో పీజుల నియంత్రణకు ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికీ ప్రభుత్వ పరిశీలనలోనే ఉంది. గతేడాది తిరుపతిరావు కమిటీ నివేదికను పరిశీలించి, న్యాయ సలహా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఫీజుల ఖరారు ఆలస్యం అవుతోందని భావించి ప్రైవేటు పాఠశాలలు 2018–19 విద్యా సంవత్సరంలో ఫీజులు పెంచొద్దని అప్పటి విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. అనేక యజమాన్యాలు ఆ ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు ఆ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. ఫీజుల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, తిరుపతిరావు కమిటీ నివేదికపై పరిశీలన జరుపుతున్నామని ప్రభుత్వం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే దానిపై తీర్పు ఇంకా వెలువడలేదు. దీంతో తాజాగా మళ్లీ ఫీజులు పెంచేందుకు ప్రైవేటు పాఠశాలలు ప్రయత్నిస్తున్నాయి. 

చెడు పేరు వస్తుందనే.. 
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలు ఏటా ఫీజులను 10 శాతంలోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదంటూ ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీ చేసిన సిఫారసు కారణంగా ఆ నివేదికను ప్రభుత్వం పక్కన పడేసినట్లు తెలిసింది. అది ఫీజుల పెంపును సమర్థిస్తున్నట్లు ఉండటంతో దాన్ని ఆమోదిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచనతో ఆ నివేదికను పక్కనపెట్టింది. అనుమతి లేకుండా ఏటా 10 శాతం ఫీజులను పెంచుకునేలా ఎలా సిఫారసు చేశారంటూ ప్రొఫెసర్‌ తిరుపతిరావు కమిటీని ప్రభుత్వం ప్రశ్నించింది. ద్రవ్యోల్బణం ఆధారంగా దాన్ని సిఫారసు చేసినట్లు, ఫీజులు ఎక్కువ ఉన్నాయని భావిస్తే విద్యా శాఖ అధికారులు పరిశీలించేలా సిఫారసు కూడా చేసినట్లు తెలిసింది.  

Advertisement
Advertisement