టీడీపీ మద్దతు కోరాం : డీకే అరుణ | we want support tdp: dk aruna | Sakshi
Sakshi News home page

టీడీపీ మద్దతు కోరాం : డీకే అరుణ

Jun 29 2014 3:09 AM | Updated on Mar 18 2019 9:02 PM

టీడీపీ మద్దతు కోరాం : డీకే అరుణ - Sakshi

టీడీపీ మద్దతు కోరాం : డీకే అరుణ

జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు సహకరించాలని తెలుగుదేశం పార్టీ మద్దతు కోరినట్లు మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు.

- ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఖాయం
- జెడ్పీ పీఠం కాంగ్రెస్ ఖాతాలోనే

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌కు సహకరించాలని తెలుగుదేశం పార్టీ మద్దతు కోరి నట్లు మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు. ఓటింగ్ లో పాల్గొనడం ద్వారా ప్రత్యక్షంగా, గైర్హాజరవడం ద్వారా పరోక్షంగా మద్దతు ఇచ్చే అంశంపై టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారన్నారు. శనివారం స్థానిక డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌తో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు సాధించినందున జిల్లా పరిషత్‌తో పాటు మండల పరిషత్, మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని మండలాల్లో కనీసం రెండు ఎంపీటీసీ స్థానాలు లేకపోరునా టీఆర్‌ఎస్ ఎంపీపీ పీఠం కోసం  ఇతర పార్టీల సభ్యులను ప్రలోభాలకు గురి చేస్తోందన్నారు. కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యులను టీఆర్‌ఎస్ నేతలు బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

 కాంగ్రెస్ జడ్పీటీసీ సభ్యుల్లో చీలిక వస్తుందని టీఆర్‌ఎస్ మైండ్‌గేమ్ ఆడుతున్నదన్నారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారని మాజీ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. డీకే అరుణ నేతృత్వంలో జిల్లాలో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదని, నమ్మిన సిద్దాంతం కోసం కార్యకర్తలు, నాయకులు సమష్టిగా  కృషి చేస్తామని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. సమావేశంలో మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, డీసీసీ మాజీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
 
ప్రజా వ్యతిరేక చర్యలను అడ్డుకుందాం
 మహబూబ్‌నగర్ అర్బన్: అధికార పార్టీ టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడం ప్రారంభించిందని, ప్రజల పక్షాన వాటిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని డీకే అరుణ పిలుపునిచ్చారు. శనివారండీసీసీ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో తమకు సహకరించాలని సీఎం కేసీఆర్ చేసిన అభ్యర్థన మేరకు తాము ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంటే , ఆయనేమో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు ఎరవేసి ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తున్నారని మండిపడ్డారు. బంగారు తెలంగాణ  అంటున్న కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పకుండా ఇతర పార్టీల వారి వలసలను ప్రోత్సహిస్తున్నారని ఎద్దేవా చేశారు.  ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజాసమస్యల సాధన కోసం కృషి చేస్తే రానున్న కాలంలో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement