‘పిల్లల ఇంటర్నెట్‌’పై కన్నేయాలి 

We Need To Look Into Children's Internet Activity In Women Safety Webinar - Sakshi

విమెన్‌ సేఫ్టీ వెబినార్‌లో వక్తలు 

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు వినియోగించే సోషల్‌ మీడియాపై పేరెంట్స్‌ ప్రత్యేకదృష్టి సారించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కోవిడ్‌ పరిస్థితుల్లో ఇంటర్నెట్‌ వినియోగం నాలుగింతలు పెరిగిందని, ఆన్‌లైన్‌ మోసాలు కూడా ఆందోళనకరస్థాయిలో నమోదవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. విమెన్‌సేఫ్టీ వింగ్‌ చేపట్టిన ‘సైబ్‌హర్‌’ప్రాజెక్టులో భాగంగా ‘ఆన్‌లైన్‌ పోస్టింగుల్లో వాస్తవాలు–అవాస్తవాలు, వేటిని నమ్మాలి‘అనే అంశంపై తెలంగాణ పోలీస్‌ శాఖ మహిళాభద్రతావిభాగం నిర్వహించిన వెబ్‌ ఆధారిత చర్చగోష్టిలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎస్పీ ఎం.శ్వేత, యూనిసెఫ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ నిపుణులు జార్జ్, సి–డాక్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ సీఏఎస్‌ మూర్తి తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు.

ఎస్పీ శ్వేత మాట్లాడుతూ భౌతిక ప్రపంచానికి, వర్చువల్‌ ప్రపంచానికి చాలా వ్యత్యాసముందని, సోషల్‌ మీడియాలో వచ్చే అంశాలను వాస్తవాలతో బేరీజు వేసుకోకపోతే పిల్లలు, యువత సులువుగా నమ్మి మోసపోయే ప్రమాదముందని అన్నారు. ఇంటర్నెట్‌ వినియోగం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించిన నేపథ్యంలో కొత్తరకాల నేరాలు వెలుగుచూస్తున్నాయని చెప్పారు. యూనిసెఫ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ స్పెషలిస్ట్‌ జార్జ్‌ మాట్లాడుతూ మహిళలు, పిల్లలపై జరిగే సైబర్‌ నేరాలను అరికట్టేందుకు యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో బాలసురక్ష, శ్రీ సురక్ష అనే ప్రత్యేక యాప్‌లను రూపొందించామని చెప్పారు. సీఏఎస్‌ మూర్తి మాట్లాడుతూ సైబర్‌ నేరాలు అన్నివర్గాలను బాధితులుగా చేస్తున్నాయని, మహిళలు, పిల్లలు వీటి బారిన పడేవారిలో అధికశాతమున్నారని తెలిపారు. మహిళాభద్రతా విభాగం అడిషనల్‌ డీజీ స్వాతిæ లక్రా, డీఐజీ సుమతి ఈ కార్యక్రమాన్ని సైబ్‌హర్‌లో భాగంగా నిర్వహించారు. 

ఎన్‌ఆర్‌ఐ సెల్‌ తొలి వార్షికోత్సవం! 
విదేశీ భర్తల వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు విమెన్‌ సేఫ్టీ వింగ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌ఐ సెల్‌ తొలి వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు ఇప్పటిదాకా 101 ఫిర్యాదులు రాగా అందు లో ఆరుగురి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది కేసుల్లో లుకవుట్‌ నోటీసులు జారీ చేశారు. 44 కేసుల్లో నిందితులను ఇండియాకు రప్పించేలా వారు పనిచేసే కం పెనీలకు లేఖలు రాశారు. కరోనా కాలంలో గృహహింసను తగ్గించేందుకు పలు భాషల్లో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తాజాగా పిల్లలు, మహిళలకు ఆరోగ్యకరమైన సైబర్‌ ప్రపంచాన్ని అందించేందుకు నెలపాటు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top