ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని నీటి సమస్య ప్రజలకు కన్నీరు తెప్పిస్తోంది. వేసవిలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది.
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ మున్సిపాలిటీలోని నీటి సమస్య ప్రజలకు కన్నీరు తెప్పిస్తోంది. వేసవిలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది. నల్లా నీటి కోసం ఆయా కాలనీల ప్రజలు నిత్యం నిరీక్షించాల్సిన పరిస్థితి. నీటి సరఫరాలో సమయపాలన పాటించనందున పట్టణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.
పన్ను వసూలు చేస్తున్నా..
మున్సిపాలిటీ పరిధిలో 36 వార్డులుండగా 32,554 కుటుంబాలున్నాయి. లక్షా 17వేల 338 జనాభా ఉంది. 11,860 నల్లా కనెక్షన్లున్నాయి. ఇందులో సగానికంటే ఎక్కువ కనెక్షన్లకు నీరు సరఫరా కావడంలేదు. 300 వీధి కుళాయిలుండగా అధికారులు కొన్నింటిని తొలగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 751 చేతిపంపులుండగా 609 మాత్రమే పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నల్లా నీటిని రోజు విడిచి రోజు సరఫరా చేయడం, సమయపాలన లేకుండా 20 నిమిషాలే నీటిని వదలడం తదితర కారణాలతో పట్టణంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మూడేళ్ల కిందటి వరకు నిత్యం నల్లా నీరు సరఫరా అయ్యేది. మూడేళ్లుగా విద్యుత్ కోతలంటూ రోజు విడిచి రోజు నీరు సరఫరా చేస్తున్నారు. విద్యుత్ కోతలు లే నపుడు కూడా నీటి సరఫరాలో ఎలాంటి మార్పులేదు. నల్లా బిల్లు ముక్కు పిండి వసూలు చేస్తున్న మున్సిపల్ అధికారులు నీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోతున్నారు.
తక్కువ స్థాయిలో సరఫరా..
బల్డియా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టణ ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు. 36 వార్డుల్లో ప్రజలకు 23.92 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉండగా 20.36 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఇంతకంటే తక్కువ స్థాయిలో నీరు సరఫరా చేస్తున్నట్లు పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. మావల చెరువు నుంచి ఫిల్డర్‌బెడ్, హౌసింగ్ బోర్డు, విద్యానగర్ కాలనీల్లో నీటిని సరఫరా చేస్తుండగా, మిగితా కాలనీలకు లాంగసాంగ్వి చెరువు నుంచి నీరు సరఫరా చేస్తున్నారు. సరిపడా నీరు సరఫరా చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని ఆయా కాలనీల ప్రజలు వాపోతున్నారు.
నిధులు మంజూరైనా..
మున్సిపల్ పరిధిలోని చేతిపంపుల మరమ్మతుకు రూ.18.8 లక్షలు మంజూరైనా అవి నిరుపయోగమయ్యాయి. చేతిపంపు విడి భాగాలు కోనుగోలు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయలేదు. దీంతో చేతిపంపులు మరమ్మతుకు నోచుకోవడం లేదు. వేసవి ముగుస్తున్నా అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మావల, లాంగసాంగ్వి ప్రాంతాల నుంచి నీటి సరఫరాకు 18 ఇంచుల పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేస్తుండగా పెరిగిన పట్టణ జనాభాకు సరిపోవడం లేదు. జనాభాకు తగినట్లు ఇంతకంటే వెడల్పు పైపులైన్ వేసి తాగునీరు సరఫరా చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.