కొత్త టెక్నాలజీతో నీటి ప్లాంట్లు

కొత్త టెక్నాలజీతో నీటి ప్లాంట్లు


సిద్దిపేట రూరల్: కొత్త టెక్నాలజీ ఉపయోగించి సిద్దిపేటలో మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని వెంకటాపూర్, బుస్సాపూర్, కోదండరావుపల్లి, బండచెర్లపల్లి గ్రామాల్లో వాటర్ ప్లాంట్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కార్డు పెట్టి నీళ్లు పట్టుకునే కొత్త టెక్నాలజీని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు.



నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛమైన మంచినీటిని తాగడం ద్వారా  సిద్దిపేట రాష్ర్టంలోనే ఆదర్శంగా నిలవాలన్నారు. జిల్లాలో 74 వాటర్ ప్లాంట్లు ఉండగా 64 వాటర్ ప్లాంట్లు సిద్దిపేట నియోజకవర్గంలోనే  ఏర్పాటు చేశామన్నారు. అన్ని గ్రామాల ప్రజలు స్వచ్ఛమైన నీటిని తాగాలన్నదే తమ లక్ష్యమన్నారు. మన ప్రాంత బియ్యం మనమే తయారు చేసుకునే విధంగా ప్రభుత్వం ప్రసుత్తం ఇచ్చే బియ్యం కాకుండా ఆహార భద్రత పథకం కింద కోటా పెంపునకు ఆలోచన చేస్తున్నామన్నారు. 



గ్రామాల్లో చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందన్నారు. అందుకోసం చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామన్నారు. అలాగే దేశంలోని ఏ రాష్ట్రంలో పింఛన్లను పెంచండంలేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే నవంబరు నెల నుంచి పింఛన్లు ఇస్తున్నామన్నారు. జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి మాట్లాడుతూ  కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు. అంతముందు కోదండరావుపల్లిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు.



ముంపు గ్రామాలకు పరిహారం

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రాజెక్టు కింద ముంపు గ్రామాలు ఉంటే నష్టపరిహరం కింద అందరూ మెచ్చే విధంగా పాలసీ తెస్తున్నామని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. భూములతో పాటు ఇళ్లు మొత్తం పోతే ఎస్సీ, ఎస్టీలకు మార్కెట్ విలువను బట్టి నాలుగింతలు పెంచి ఇస్తామని, బీసీలకు మార్కెట్ విలువను బట్టి మూడింతలు పెంచి ఇస్తామన్నారు. అదే విధంగా కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లేదా రూ.5లక్షలను అందజేస్తామన్నారు.



వెంకటాపూర్, బుస్సాపూర్ గ్రామాలు తడ్కపల్లి రిజర్వాయర్‌లో పోతున్నాయంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయగా  నేనుండగా మీ ఊరు పోదని చెప్పడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో ఎంపీపీ ఎర్ర యాదయ్య, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, సర్పంచ్‌లు ప్రతాప్‌రెడ్డి, మద్దూరి లలిత మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top