నగరాన... పూలవాన

Vijayadashami Hyderabad Flower Market Sees Record Arrival - Sakshi

మార్కెట్లకు భారీగా వివిధ రకాల పూల దిగుమతి 

శివారు జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం 

రికార్డు స్థాయిలో బంతిపూల విక్రయాలు

సాక్షి, హైదరాబాద్‌: దసరా పండగ నేపథ్యంలో నగరానికి పూలు పోటెత్తాయి. గత వారమంతా బతుకమ్మ సందడి, నవరాత్రలతో పూలకు గిరాకీ బాగా ఉండగా...దసరాకు అది మరింత పెరిగింది. దీంతో గ్రేటర్‌ శివారు జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి సైతం నగరానికి పూలు దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా బంతి, చామంతి, గులాబీ పూలతోపాటు డెకరేషన్‌కు ఉపయోగించే పూలకు డిమాండ్‌ బాగా ఉంది. దసరాకు ఆయుధపూజలు నిర్వహించడంతోపాటు వాహనాలు, షాపులు, వివిధ సంస్థలను పూలతో అలంకరించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే పూల విక్రయాలు పెరిగాయి.  

ఈసారి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గులాబీ, చామంతి, బంతితో పాటు ఇతర పూలు ఎక్కువ మొతాదులో మార్కెట్‌కు వచ్చాయని మార్కెట్‌ అధికారులు తెలిపారు. సోమవారం గడ్డిఅన్నారం మర్కెట్‌కు బంతి సుమారు 2 వేల క్వింటాళ్లు, చామంతి 800 క్వింటాళ్లు దిగుమతి అయ్యాయని మార్కెట్‌ వర్గాల అంచనా. గతంలో ఎన్నడూ లేని విధంగా కనకాంబరం పూల ధర రికార్డు స్థాయిలో కిలో రూ.1500 పలికిందని మార్కెట్‌ అధికారులు చెప్పారు. 

గతేడాదితో పోలిస్తే బంతి పూలు రికార్డు స్థాయిలో విక్రయాలు జరిగినట్లు అంచనా. బంతిపూల ధరలు తక్కువగా ఉండడంతో జనం ఇతర పూల కంటే వీటినే ఎక్కువగా కొనుగోలు చేశారు. దిగుమతులు అధికమవడం వల్లే బంతి పూల ధరలు తగ్గాయని వ్యాపారులు, రైతులు అంటున్నారు. గత ఏడాది బంతి రూ.50 నుంచి 80 రూపాయలు ధర పలికితే...ఈ ఏడాది రూ.50–30 మధ్యే ధరలు ఉన్నాయంటున్నారు. దీంతో తమకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోయారు. కేవలం కనకాంబరాల దిగుమతి తక్కువగా ఉండడం వల్లే రేటు బాగా పలికిందన్నారు.  

రైతులకు గిట్టుబాటయ్యేలా చర్యలు 
గతేడాది బంతి పూల ధర కిలో రూ.50 లోపే ఉండగా...చామంతి ధర అత్యధికంగా రూ.100 ఉంది. ఈ ఏడాది శివారు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఎక్కువ మోతాదులో ప్రత్యేకంగా బంతి, చామంతి, సెంట్‌గులాబీ, కాగడాలు, లిల్లీ తదితర రకాల పూలు దిగుమతి అయ్యాయి. డిమాండ్‌కు సరిపడ దిగుమతులు ఉంటే ధరలు సర్వసాధారణంగా పెరగవు. డిమాండ్‌కు తక్కువగా దిగుమతులు ఉంటే ధరలు పెరుగుతాయి. ధరలు మరింత పడిపోకుండా నియత్రించడానికి ప్రయత్నించాం. రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకున్నాం. రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం.  కె. శ్రీధర్, స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శి, గుడిమల్కాపూర్‌ మార్కెట్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top