పార్కులూ వదలట్లే!

Vigilance And Enforcement Target to Parks And layouts - Sakshi

గ్రేటర్‌లో దర్జాగా కబ్జా

లే అవుట్ల పార్కులు, ఖాళీ స్థలాలు సైతం..  

తొలగింపునకు జీహెచ్‌ఎంసీ ‘ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌’ చర్యలు

తిరిగి చేజారిపోకుండా ఏర్పాట్లు  

సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో ఏడు దుకాణాలు, ఒక డెయిరీ పార్లర్‌ ఉన్నాయి. వీటిని చూసిన వారెవరైనా అవి లేఅవుట్‌ స్థలమో లేక పార్కునో కబ్జా చేసి కట్టినవంటే నమ్మలేరు. కానీ అవి ఆక్రమించిన స్థలంలో కట్టినవేనని జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ విభాగం తనిఖీల్లో తేలింది. ఇవేకాదు.. నగరవ్యాప్తంగా ఎన్నెన్నో లేఅవుట్లలో ఉండాల్సిన ఖాళీ స్థలాలు, పార్కు స్థలాలు దురాక్రమణకు గురయ్యాయి. వాటిలో దుకాణాలు, నివాసాలు సైతం వెలిశాయి. ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జా చేసే నగరంలో లేఅవుట్లలోని పార్కులు, ఖాళీస్థలాలను వదలకుండా దొరికినంతా ఆక్రమించేశారు. ఇలాంటి స్థలాల్లో కొందరు ఇళ్లుఇంకొందరు దుకాణాలు నిర్మించుకోగా.. మరికొందరు ప్రహరీలు నిర్మించి చిన్న గుడిసెలో, ఏసీ షీట్లతో గదులో వేశారు. కొన్ని చోట్ల అయితే ప్రార్థనా మందిరాలు సైతం కట్టేశారు. అయితే బల్దియా అధికారులు కాలనీల్లోని పార్కులు, ఓపెన్‌స్పేస్‌ల లెక్క తేల్చేందుకు నడుం బిగించింది. నమూనాగా సర్కిల్‌కు ఓ పార్కు/ఓపెన్‌ స్పేస్‌ చొప్పున లెక్కించగా.. కళ్లు బయర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో కబ్జాల పాలైనవి 20 వేల గజాలకు పైగా ఉన్నట్టు తేలింది.

ఎంత లేదన్నా ఈ స్థలం విలువ కనిష్టంగా రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక గ్రేటర్‌ వ్యాప్తంగా అన్ని పార్కుల లెక్కా తీస్తే ఎన్ని వందల కోట్ల రూపాయల విలువైన స్థలాలు కబ్జా పాలయ్యాయో చెప్పలేం. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో కబ్జాల పాలైనవి కొన్నయితే, రౌడీయిజంతో పరుల పాలైనవి ఇంకొన్ని. ఇతరత్రా మార్గాల్లో ప్రైవేట్‌ పరమైనవి కూడా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. సర్వేలో కబ్జాపాలైనట్లు గుర్తించిన స్థలాల్లో తొలిదశలో ఒక్కో సర్కిల్‌లో ఒక్కో పార్కు/ఓపెన్‌ స్థలంలోని కబ్జాలను తొలగించి, తగిన రక్షణ ఏర్పాట్లు చేసి మున్ముందు కబ్జా కాకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఈవీడీఎం విభాగం నిర్ణయించింది. ఇందుకు ఆయా పార్కులను తగిన విధంగా అభివృద్ధి చేయడంతో పాటు సెక్యూరిటీ ఏర్పాట్లు చేయనున్నట్లు ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కాంపాటి తెలిపారు.  జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్లలో ఆయా లేఅవుట్లలోని ఒక్కో ఖాళీ స్థలం లేదా పార్కును పరిగణనలోకి తీసుకుంటే ఉండాల్సిన మొత్తం స్థలం 47,902 చదరపు గజాలు కాగా, వాటిలో 20 వేల చదరపు గజాలకు పైగా ఆక్రమణలకు గురైనట్లు వెల్లడైంది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని, భద్రత కల్పించే చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. 

కబ్జాకు గురైన పార్కులు,ఖాళీ ప్రదేశాలు ఇలా..
ఏఎస్‌రావు నగర్‌లోని న్యూఫ్లోరా హోటల్‌ సమీపంలో, ఉప్పల్‌ సర్కిల్‌లో కాకతీయ కాలనీ, హయత్‌నగర్‌లో జైపురికాలనీ, ఎల్‌బీనగర్‌లో అగ్రికల్చర్‌ కాలనీ, సరూర్‌నగర్‌లో జైస్వాల్‌ కాలనీ, మలక్‌పేట సర్కిల్‌లో సెయింట్‌ డోమ్నిక్స్‌ స్కూల్‌ పక్కన, సంతోష్‌నగర్‌లో సింగరేణి కాలనీ, చాంద్రాయణగుట్టలో రాజన్నబౌలి దగ్గర, ఫలక్‌నుమాలో బహదూర్‌పురా హౌసింగ్‌బోర్డు కాలనీ, రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో గోల్డెన్‌ హైట్స్‌ కాలనీ, మెహదీపట్నంలో ఏజీఎస్‌ ఆఫీస్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ, కార్వాన్‌లో సాలార్జంగ్‌ కాలనీ, కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ, గోషామహల్‌ సర్కిల్‌లో మహేశ్‌నగర్, జూబ్లీహిల్స్‌లో ప్రశాసన్‌నగర్, అంబర్‌పేట సర్కిల్‌లో పటేల్‌నగర్, మల్కాజిగిరిలో దుర్గానగర్, బేగంపేటలో సింధికాలనీ, యూసుఫ్‌గూడలో మధురానగర్‌ ఎఫ్‌ బ్లాక్, శేరిలింగంపల్లి సర్కిల్‌లో నల్లగండ్ల, చందానగర్‌లో భవానీపురం కాలనీ, ఆర్‌సీపురం, పటాన్‌చెరు సర్కిల్‌లో సింఫనీకాలనీ, మూసాపేట సర్కిల్‌లో కేపీహెచ్‌బీ 4వ ఫేజ్, కూకట్‌పల్లిలో ఆదిత్యానగర్, కుత్బుల్లాపూర్‌లో ప్రతాప్‌రెడ్డి కాలనీ, గాజులరామారంలో మిథిలానగర్, అల్వాల్‌ సర్కిల్‌లో తిరుమల ఎన్‌క్లేవ్‌ ప్రాంతాలు ఉన్నట్లు విజిలెన్స్‌ సర్వేల్లో గుర్తించారు. 30 సర్కిళ్లలో వెరసి దాదాపు వంద ఆక్రమణలు జరిగాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top